19-12-2025 01:56:26 AM
వేములవాడ, డిసెంబర్ 18 (విజయక్రాంతి): వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానంలో కొనసాగుతున్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులపై ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ దేవస్థానం అతిథి గృహంలో సమావేశం నిర్వహించారు. ప్రధాన ఆలయ రాజగోపురం నిర్మాణం, ఆలయ విస్తరణ పనులు, బద్ది పోచమ్మ ఆలయం నిర్మాణం,రాజగోపుర అభివృద్ధి పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో విపులంగా చర్చించారు.
నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా, నిర్ణీత కాలపరిమితిలో పూర్తిచేయాలని అధికారులకు సూచనలు జారీ చేశారు.భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న నిత్య అన్నదానం భవనం, ఇతర అనుబంధ నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, అలాగే కొత్తగా నిర్మించబడుతున్న భవనాల వద్ద భక్తులకు సరిపడా పార్కింగ్ సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.
నిర్మాణ భద్రత, డిజైన్, సాంకేతిక అంశాలపై నిపుణుల సూచనలు తప్పనిసరిగా అమలు చేయాలని పేర్కొన్నారు.ఆలయ అభివృద్ధి పనులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, సంప్రదాయ శైలిని కాపాడుతూ పూర్తి చేయాలని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో కె. రాము సెక్షనల్ ఇంజనీర్ ఎస్ ఈ ఆర్ అండ్ బి. కరీంనగర్,వి. నరసింహ చారి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఈ ఈ ఆర్ అండ్ బి , సిరిసిల్ల,శ్రీధర్ రెడ్డి స్ట్రక్చరల్ కన్సల్టెంట్,రవీందర్ రెడ్డి స్పెషల్ ఆఫీసర్ భవన విభాగం డీఈఈ శాంతయ్య. విభాగం,భవనాల కాంట్రాక్టర్లు, ఈవో ఎల్. రమాదేవి, ఈఈ రాజేష్, డీఈలు రఘునందన్, మైపాల్ రెడ్డి, ఏఈఓలు బ్రహ్మన్నగారి శ్రీనివాస్, జి. అశోక్ , ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.