3 March, 2026 | 3:09 AM

స్ఫూర్తి ప్రదాత దుద్దిళ్ల శ్రీపాదరావు

03-03-2026 12:01 AM

మహబూబాబాద్, మార్చి 2 (విజయక్రాంతి): ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి నిష్పాక్షికంగా ప్రజాసేవే లక్ష్యంగా పనిచేసి చిరస్మరణీయుడిగా గుర్తింపు పొందిన స్వర్గీయ దుద్దిల్ల శ్రీపాదరావు స్ఫూర్తితో ముందుకు సాగాలని, వివిధ జిల్లా కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులు, అధికారులు అన్నారు. మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిల్ల శ్రీపాద రావు 87వ జయంతి సందర్భంగా సోమవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో కలెక్టర్ కార్యాలయాలతో పాటు మండల డివిజన్ జిల్లా కేంద్రాల్లో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

జయశంకర్ భూపాలపల్లిలో..

 జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాద రావు  ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి నిష్పక్షపాతంగా వ్యవహరించిన గొప్ప ప్రజానాయకుడని, స్పీకర్ హోదాలో ఆయన చూపిన క్రమశిక్షణ, పారదర్శకత, నైతిక విలువలు ప్రతి ఒక్కరికి ఆదర్శమని పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేసిన నాయకుడిగా ఆయన చిరస్మరణీయులన్నారు.

మహబూబాబాద్‌లో..

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన దుద్దిల్ల శ్రీపాదరావు జయంతి వేడుకల్లో కలెక్టర్ స్నేహ శబరిష్ పాల్గొని దుద్దిల్ల శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శ్రీపాదరావు సేవాభావం, నాయకత్వ లక్షణాలు, ప్రజాసేవ పట్ల ఉన్న నిబద్ధతను యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం ఎంతో ప్రధానమన్నారు.

ములుగులో..

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన స్వర్గీయ శ్రీపాదరావు జయంతి వేడుకల సందర్భంగా కలెక్టర్ దివాకర టిఎస్ శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శ్రీపాదరావు శాసనసభాపతి పదవికి వన్నెతెచ్చిన మహనీయుడని కొనియాడారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడడంలో శ్రీపాదరావు విశిష్ట పాత్ర పోషించాలని చెప్పారు. ప్రభుత్వం ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించడం గౌరవప్రదమైన విషయంగా పేర్కొన్నారు. శ్రీపాదరావు సేవలు ప్రజాసమయ పరిరక్షణ ప్రజల కోసం పనిచేసే అంకితభావం, ప్రజాసేవ పట్ల నిబద్ధత, భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయన్నారు.

హనుమకొండలో..

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకల్లో శ్రీపాదన చిత్రపటానికి హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ ఇతర అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

జనగామలో..

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకల్లో ఆయన చిత్రపటానికి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఇతర అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.