ప్రేరణాత్మక నాయకత్వం
పాలకుర్తి రామమూర్తి :
ప్రయాసవధాత్ సస్యవధః;
ముష్టివధాత్పాపీయాన్..
(కౌటిలీయం -8--2)
రైతు పొలంలో విత్తనాలను చల్లకపోవడం (ముష్టివధ) కన్నా చేతికి వచ్చిన పంటను నాశనం చేయడం (సస్యవధ) చాలా చెడ్డది. రెండింటిలోనూ ఫలితం ఒకటే అయినా.. పంటను నాశనం చేయడం వల్ల అప్పటి వరకూ సస్యాన్ని పోషించడానికి చేసిన శ్రమ అంతా వ్యర్ధమౌతుంది. జీవనాధారమే లేకుండా చేసే అనావృష్టి కన్నా, అతివృష్టి మెరుగైనది అంటాడు ఆచార్య చాణక్య.
నాయకుని లక్షణాలు
‘సత్యం చతురోపాదః’ అంటారు. సత్యమనే భౌతికము, ;భావోద్వేగము,;బుద్ధిగతము, ;ఆత్మగతము అనబడే నాలుగు పాదాలుగా వ్యక్తమౌ తుంది. స్వఛ్ఛత, నాణ్యత, స్పష్టత, ఐక్యతలు వరసగా సత్యం యొక్క ధర్మాలు. భౌతిక పార్శ్వంలో పరులపై ఆధారపడడం, భావోద్వేగ పార్శ్వంలో స్వతంత్రంగా ఉండడం, బుద్ధిగత పార్శ్వంలో పరస్పర ఆధారితంగా చరించడం, ఆత్మగత పార్శ్వం లో ఇతరులకు సహయసహకారాలు అందించ డం సత్యానికి లక్షణాలు.
నాయకుడు.. మంచిచె డుల మధ్య భేదాన్ని తెలుసుకొని, ఆచరించ తగిన దానిని ఆచరించాలి.. తగని దానిని విడిచివేయాలి. నాయకునికి ఆలోచించడం ఎలాగో.. నిర్ణ యించడం ఎలాగో స్పష్టంగా తెలియాలి. ఎవరూ ఊహించని ఉత్తమత్వాన్ని ఊహించడం ఉదాత్త నాయకుని లక్షణం. తప్పక ఫలితాన్ని ఇచ్చే దాని ని విడిచి పెట్టి, అనిశ్చితమైన దాని వెంట పరుగు లు పెట్టే నాయకుడు.. రెంటికీ చెడిపోతాడు.
అం దుకే నిర్ణయించుకునే ముందే ఏం చేయాలో ఎ లా చేయాలో చర్చించడం అవసరం. విజయ సా ధన కన్నా విజయ సాధనకై చేసే ప్రయత్నం ప్ర ముఖమైనది. తనకు వారసత్వంగా వచ్చిన సంపదను రక్షించుకోవడం, ఉన్నదానిని పెంచుకో వడం, అదనంగా సంపదను సృష్టించడం, వృద్ధిచేయడం, అర్హత ప్రాతిపదికగా సమా జంతో సంపదను పంచుకోవడం, సకాలంలో పన్నులు చెల్లించి జాతి నిరంతర అభ్యుదయంలో ఆధారంగా నిలవడం.. ఉత్తమ నాయకుని లక్షణాలు.
ప్రయత్నాలతో ఉత్తమ ఫలితాలు
సంస్థలో ఎవరి స్థాయి ఏదైనా.. పట్టుదలతో ప్రయత్నాన్ని ఆపకుండా చేయవలసిన పనికన్నా కొద్ది మొత్తమైనా (0.01) అధికంగా చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు అందుకుంటారు. చేయవలసిన దానికన్నా కొద్ది మొత్తం (0.01) తక్కువగా చేసినా ఫలితం కనిష్టస్థాయికి చేరుతుంది. చేయవలసిన పనికి 0.01 చొప్పున సంవత్సరకాలం అదనంగా జత చేస్తే (1.01)365= 37.78 కాగా.. 0.01 చొప్పున సంవత్సరకాలం తక్కువగా చేస్తే (0.99)365= 0.026 అవుతుంది.
ఎవరైతే సంస్థ లో తామొక ఉద్యోగిగా కాక, సేవకునిగా భావిస్తా రో వారు యోగక్షేమాలను పొందుతారు. సేవకుడంటే.. పొందే వేతనానికన్నా ఎక్కువ సేవల నందించడం. యోగమంటే మనకు లేని దానిని పొందడము.. క్షేమము సాధించిన దానిని కాపాడుకోవడం. లేనిదనేది.. విజ్ఞానం కావచ్చు, సంప ద కావచ్చు, శక్తిసామర్ధ్యాలు కావచ్చు. ఆ మూ డూ ఒకదానితో ఒకటి కలిస్తే పరిపూర్ణత సిద్ధిస్తుం ది.. దేనికదే నిలిస్తే.. జీవితం శూన్యమౌతుంది.
ప్రమాదంలోనూ అవకాశం..
ప్రతివ్యక్తి జీవితానికి ప్రయోజనం ఉంటుంది. ప్రయోజనాన్ని గుర్తించి సాధించే దిశలో కలలుగనడం, కలలను సాకారం చేసుకునేందుకు శ్రమించడం అవసరం. ప్రయోజనాన్ని గుర్తించని జీవితం భ్రమలకు నెలవవుతుంది. ప్రయోజనాన్ని సంతరించుకున్న జీవితం ప్రకాశవంతమ వుతుంది. దానితో ప్రేరణ కలుగుతుంది. ప్రేరణతో మార్గదర్శన కలిస్తే.. దార్శనికత అవుతుంది. దార్శనికతతో లక్ష్యం కలిస్తే.. అసాధ్యాన్ని సుసా ధ్యం చేస్తుంది.
పటిష్టమైన ప్రణాళికలతో కార్యాచరణ జత కలిస్తే ఆ పనికి విలువ పెరుగుతుంది. పెరిగిన విలువ విస్తరిస్తుంది. చాలామంది పనిని ప్రారంభించే ముందే దానిలో ప్రమాదాన్ని శంకిస్తారు. దానికి కారణం.. ప్రతి ప్రమాదంలోనూ అవకాశం ఉంటుందనే సత్యాన్ని విస్మరించడం, సమస్యను పెద్దదిగా చూస్తూ తన శక్తిసామర్ధ్యాలను తక్కువగా చూడడమే. నిజానికి ప్రమాద మూ.. అవకాశమూ వెలుగు నీడల లాంటివి. వె లుగున్న చోటే నీడా ఉంటుంది.
బుద్ధి సూక్ష్మత కలిగిన నాయకుడు ఎప్పుడో వస్తాయనుకునే ఆ పదల గురించి ఆలోచించడు. వర్తమానంలో అం దివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుం టూ, ఎదురయ్యే విపత్తులను ధైర్యంతో ఎదు ర్కొంటూ ముందుకు సాగుతాడు. తలవ్రాతను నమ్మి; నిష్కృయాపరతను ఆదరించడం మరణంతో సమానం. వ్యక్తిగా సాధించలేనిది స మష్టిగా సాధించవచ్చు. వరసగా ఎన్ని సున్నాలు పెట్టినా వాటి ప్రయోజనమూ సున్నాయే.. వాటి ముందు ఒకటిని చేరిస్తే వాటి విలువ పెరుగుతుంది.
అభ్యుదయ మార్గంలో
ప్రేరణాత్మకమైన నాయకత్వం.. సంస్థ ప్రయోజనాన్ని గుర్తిస్తుంది.. నీతి నియమాలను పాటి స్తుంది. ప్రక్రియలను ఆదరిస్తుంది.. వికాసాన్ని సాధిస్తుంది. శాంతి సౌభాగ్యాలతో అభ్యుదయ మార్గంలో ముందుకు సాగుతుంది. అలాంటి ప్రతిభావంతమైన, ప్రభావశీలత కలిగిన నాయకత్వంలో సభ్యులలో విజ్ఞత, విచక్షణలు వెలుగు చూస్తాయి. సంస్థ అర్హతను పెంచుకుంటుంది. సాధించాలనే కోరిక బృందంలో తపనను పెంచుతుంది.
గెలుపు మార్గంలో ముందుకు సాగి సంపదను సృష్టిస్తుంది. దానితో సుస్థిరమైన అభ్యుదయం సంస్థ చిరునామాగా మారుతుంది. నీతినియమాలు, విలువలు పాటించడం వ్యక్తిగతమైనవి.. ప్రక్రియలు లేదా విధానాలు వ్యవస్థకు సంబంధించినవి. వికాసం అభివృద్ధి.. వ్యూహ నిర్మాణ చతురతకు, దానిని సమర్ధవంతంగా అమలుపరచడానికి సంబంధించినది. శాంతి సుస్థిరతలు.. క్రమబద్ధీకరణకు సంబంధించినవి.
అభ్యుదయం విజయానికి ప్రతీకగా నిలుస్తుంది. ఆ విజయాన్ని తోటివారితో, సమాజంతో పంచుకున్నప్పుడు.. సామాజిక శ్రేయస్సు ఆవిష్కృతమై.. సంస్థ ప్రయోజనం సిద్ధిస్తుంది. అలాంటి ప్రేరణాత్మకమైన నాయకత్వంలో బృంద సభ్యుల మధ్య ప్రేమ బంధంగా నిలిచి ముందుకు సాగేందుకు ఉత్ప్రేరకమౌతుంది. తపనతో కూడిన కృషి తనను తాను నిరూపించుకునేందుకు మార్గదర్శన చేస్తుంది. నీవు ప్రగతిని సాధించు.. ఇతరుల ప్రగతికి చేయూతనివ్వు అనే విధానంలో సమగ్రతను సాధిస్తుంది.
అంకిత భావనతో పనిచేసే నాయకునిలో ప్రేమను చూపడం, తోటివారిపై నమ్మకాన్ని కలిగి ఉండడం, అనుచరులకు దారిచూపడం, నిర్మాణాత్మకమైన ప్రమాణాలను ఏర్పరచడం, అవసరమైన శిక్షణను ఇవ్వడం, చిత్తశుద్ధితో బాధ్యతలను అప్పగించడం, నిర్వహణలో సహకరించడం, అనుచరులు అడ్డంకులను అధిగమించుటలో ప్రేరణనివ్వడం లాంటి లక్షణాలు సహజంగా వెలుగు చూస్తుంటాయి. అలాంటి నాయకుడు.. సంకల్పించిన కార్యాన్ని మధ్యలో ఆపడు.. ఎన్ని అవరోధాలు ఎదురైనా తానూ ఎదుగుతాడు.. తన వారినీ అభ్యుదయ మార్గంలో నడిపిస్తాడు.






