29 April, 2026 | 7:26 PM

సింగరేణి ఉద్యోగులకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుతో ఇన్సూరెన్స్ ఒప్పందం

29-04-2026 06:03 PM

కొత్తగూడెం,(విజయక్రాంతి): సింగరేణి ఉద్యోగులకు కోటి ఇరవై లక్షల ప్రమాద బీమా మరియు సహజ మరణానికి కూడా రూ.10 లక్షల ఉచిత బీమా చెల్లింపునకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ తో సింగరేణి ఒప్పందం. సింగరేణి సంస్థ కార్మిక సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఇన్సూరెన్స్ పథకానికి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వారితో  బుధవారం కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయం లో ఒక ఒప్పందం కుదుర్చుకుంది.  దీని ప్రకారం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో శాలరీ ఎకౌంటు కలిగి ఉన్న సింగరేణి ఉద్యోగులకు కోటి ఇరవై లక్షల  ప్రమాద బీమాతో పాటు సహజ మరణానికి కూడా టర్మ్ ఇన్సూరెన్స్ పథకం కింద పది లక్షల రూపాయల బీమా సొమ్మును చెల్లించడం జరుగుతుంది.

సింగరేణి సంస్థ ఛైర్మన్ మరియు ఎం‌డి డాక్టర్ బుద్దప్రకాష్ జ్యోతి ఆదేశాల మేరకు  డైరెక్టర్ పర్సనల్ మరియు ఫైనాన్సు శ్రీ గౌతమ్ పోట్రు ప్రత్యేక చొరవ ఫలితంగా  ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఈ కొత్త ఒప్పందం జరిగినది.  అంతేకాకుండా శాలరీ అకౌంట్ కలిగి ఉన్న ఉద్యోగులకు మరికొన్ని మంచి రాయితీలను ఈ ఒప్పందంలో పొందుపరిచారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్(పర్సనల్) వెల్ఫేర్ & సి‌ఎస్‌ఆర్ శ్రీ జి.వి.కిరణ్ కుమార్  మాట్లాడుతూ, సింగరేణి సంస్థలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో ఖాతాలు కలిగిఉండి, తమ ఖాతాలను శాలరీ ఎకౌంటుగా మార్చుకున్న వారికి ప్రమాద బీమా పథకంతో పాటు సహజ మరణం బీమా పథకం కూడా అమల్లోకి వస్తుందన్నారు.

ఉద్యోగులందరూ చిరకాలం ఆయురారోగ్యాలతో తమ ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ సుఖసంతోషాలతో ఉండాలి అనేదే కంపెనీ ఉద్దేశమని అయితే అనుకోని ఘటనలు జరిగినప్పుడు వారి కుటుంబాలకు ఆర్థిక భరోసాగా నిలవడం కోసం ఇటువంటి బీమా పథకాలను అమలు చేయడం జరుగుతుందన్నారు. అనంతరం జనరల్ మేనేజర్ (పర్సనల్) వెల్ఫేర్ & సి‌ఎస్‌ఆర్ , కిరణ్ కుమార్ గారు మరియు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సీనియర్ రీజనల్ మేనేజర్ ,రిషికేశ్ రంజన్ కుమార్ ఈ ఒప్పోంద పత్రాలపై సంతకాలు చేశారు.