11-11-2025 11:11:52 PM
హైదరాబాద్: బీమా లోక్ పాల్ దినోత్సవాన్ని హైదరాబాద్ ఇన్య్సూరెన్స్ అంబుడ్సమన్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఐఆర్డీఎ ఛైర్మన్ అజయ్ సేథ్ వెబ్ కాస్ట్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బీమా అంబుడ్సమన్ కేంద్రాలను ఉద్దేశించి ప్రసంగించిన అజయ్ సేథ్ 2047 నాటికి ప్రతీ ఒక్కరికీ బీమా అనే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు చెప్పారు. పాలసీదారుల ఫిర్యాదులను ఉచితంగా, పారదర్శక పరిష్కరించడానికి నిష్పాక్షికమైన యంత్రాంగాన్ని అందించడానికి భారత ప్రభుత్వం దీనిని తీసుకొచ్చిందన్నారు. ఫిర్యాదులను వేగంగా పరిష్కరించడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవడంలో హైదరాబాద్ కేంద్రం చేస్తున్న కృషిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు.
హైదరాబాద్ కార్యాలయంలో వేడుకలకు హాజరైన ఐఆర్డీఎ సభ్యుడు దీపక్ సూద్ బీమా రంగం అభివృద్ధిలో పాలసీదారుల నమ్మకం అత్యంత ముఖ్యమైనదన్నారు. దీని కోసం బీమా లోక్ పాల్ న్యాయపూర్వక సేవలందిస్తూ నిష్పక్షపాతంగా పనిచేస్తుందని గుర్తు చేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం పనితీరును హైదరాబాద్ బీమా అంబుడ్సమన్ జి. శోభారెడ్డి వివరించారు. బీమా ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగం యొక్క ప్రాముఖ్యతను వెల్లడించారు. 2025 బీమా లోక్పాల్ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ కేంద్రం నవంబర్ నెలలో నిర్వహించిన కార్యక్రమాల గురించి వివరించారు. ప్రతీ ఒక్కరికీ బీమా ప్రాముఖ్యతను తెలియజెప్పేలా వాట్సాప్, డిజిటల్ స్క్రీన్లు, మెట్రో స్టేషన్లు, రైల్వే స్టేషన్లు వంటి వాటి ద్వారా బీమా గురించి అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు.