3 September, 2026 | 4:48 AM

ఆగని మృత్యుఘోష

03-09-2026 | 03:05am
  1. నేపాల్‌లో 1,244కు చేరిన మృతుల సంఖ్య
  2. ఇంకా ఐదువేలకు పైనే గల్లంతు
  3. 6,541మందిని రక్షించిన సహాయక బృందాలు
  4. మృతదేహాల గుర్తింపు, అప్పగించడంలో తీవ్ర జాప్యం
  5. భారత్‌కు ప్రధాని బాలేన్ షా ధన్యవాదాలు

ఖాఠ్మాండు, సెప్టెంబర్ 2: నేపాల్ వరదల్లో మరణించిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వరద సంభవించిన జిల్లాల్లో ఎక్కడ చూసినా బురదలో శవాల దిబ్బలే కనిపిస్తున్నాయి. వరద ప్రళయంలా విరుచుకుపడి ఈ ప్రాంతంలో మరణమృదంగం (Death rattle) కొనసాగించింది.

ఎనిమిది రోజులైనా నేపాల్‌లో మృత్యుఘోష ఇంకా ఆగడం లేదు. బుధవారం నాటికి 1,244కు మృతుల సంఖ్య చేరింది. ఇంకా ఆచూకీ లభించని వారి సంఖ్య ఐదువేలకు పైగానే ఉంది. వీరిలో 583 మంది విదేశీయులు, 83 మంది భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. మరోపక్క కురుస్తున్న వర్షాలతో ప్రధాన నదుల్లో పెరుగుతున్న నీటిమట్టాలు ప్రజలను తీవ్ర భయభ్రాంతాలకు గురిచేస్తోన్నాయి. 

నేపాల్‌లో సంభవించిన భారీ ఆకస్మిక వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య బుధవారం నాటికి 1,244కు చేరిందని, దాదాపు 5000 మందికి పైగా ఇంకా గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. వర్షం, శిథిలాల మధ్య సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

నేపాల్‌లోని ఒక్క చిత్వాన్ జిల్లాలోనే అత్యధికంగా 348 మృతదేహాలను వెలికితీశారు. 6,541 మందిని సహాయక బృందాలు కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. నేపాల్ పోలీసుల వివరాల ప్రకారం, చిత్వాన్ నుంచి 348 మృతదేహాలు, నవల్పరాసి తూర్పు నుంచి 217, నవల్పరాసి పశ్చిమ నుంచి 190 మరియు నువాకోట్ నుంచి 155 మృతదేహాలను వెలికితీశారు. అలాగే గోర్ఖా నుంచి 66, ధాడింగ్ నుండి 59, రసువా నుంచి 45, తనహు నుంచి 38 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.

1,113 మృతదేహాలకు పోస్ట్మార్టం, చట్టపరమైన గుర్తింపు ప్రక్రియలు పూర్తయ్యాయని, 95 మృతదేహాలను బంధువులకు అప్పగించామని పోలీసులు తెలిపారు. తప్పిపోయిన తమ బంధువులను గుర్తించడంలో కుటుంబాలకు సహాయపడటా నికి, 911 గుర్తుతెలియని మృతదేహాల వివరాలను నేపాల్ పోలీస్ వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేశారు. గల్లంతైన వారి కోసం 7,912 మంది పోలీసు సిబ్బంది నాలుగు జిల్లాల్లో నిర్విరామంగా విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.

మృతదేహా లను గుర్తించడం, అప్పగించడంలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటుంది. వరదల్లో గుర్తుతెలియని మృతదేహాలు నీరు, బురదలో ఎక్కువకాలం ఉండటంతో కుళ్లిపోతున్నాయి. దీంతో వాటిని గుర్తించడం కష్టంగా మారడంతో మృతదేహా లను పూడ్చిన చోట ప్రత్యేక నెంబరింగ్ వేస్తున్నారు. డీఎన్‌ఏ వివరాలను భద్రపరుస్తున్నారు. మరోవైపు రోజురోజుకూ మృతదేహాల సంఖ్య పెరుగుతుండడంతో ఆసుపత్రుల్లోని పోస్టుమార్టం వార్డులు కూడా సరిపోవడం లేదని యంత్రాంగం పేర్కొంది. 

భారత్‌కు ధన్యవాదాలు: ప్రధాని బాలేన్ షా

నేపాల్ వరదలపై పార్లమెంట్‌లో ఆ దేశ ప్రధాని బాలేన్ షా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రజలను రక్షించడమే తమ ప్రధాన ప్రాధాన్యత అన్నారు. క్లిష్ట సమయంలో దేశానికి అండగా ఉండాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు మొత్తం 11,993 మందిని రక్షించగా, 3,916 మంది ఇంకా గల్లంతయ్యారని, 95 మృతదేహాలను కుటుంబాలకు అప్పగించామని చెప్పారు. నేపాల్ మంత్రులు, ప్రజాప్రతినిధులంతా ఒకనెల వేతనం విరాళంగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

26న వరద సంభవించిన అనంతరం గంటలోపే అత్యవసర సమావేశాన్ని నిర్వహించామని తెలిపారు. తక్షణం సహాయం చేసిన భారత్, చైనాలకు బాలేన్ షా ధన్యవాదాలు తెలిపారు. హెలికాప్టర్లు, రెస్క్యూ బృందాలను రంగంలోకి దింపామన్నారు. ప్రాజెక్టు నిర్మాణ సొరంగాలలో చిక్కుకున్న 900 కార్మికుల కోసం భారత బృందాలు భారీ ఎత్తున గాలింపు చర్యలు చేపడుతున్నాయని చెప్పారు. మరోవైపు చైనా గిరాంగ్ సరిహద్దు రహదారిని తెరిచిందన్నారు.

ఇంకోవైపు అమెరికాకు చెందిన క్రైసిస్ రెస్పాన్స్ ఇంటర్నేషనల్ సంస్థకు చెందిన 13 మంది సభ్యుల బృందం కూడా నేపాల్‌కు చేరుకుందని పార్లమెంట్‌కు బాలేన్ షా వివరించారు. ఈ సంక్షోభ సమయంలో బాధిత ప్రజలకు ధైర్యం, మద్దతు, భరోసా ఇవ్వాలని బాలేన్ షా నాయకులకు సూచించారు. 

భారత్ సహాయం

ఆగస్ట్ 26న తొలివిడత భారత్ సీ జే విమానంలో 10 టన్నుల సహాయ సామాగ్రిని నేపాల్‌కు పంపింది. ఆగస్ట్ 27న సీ17లో 37.5 టన్నులు, ఆగస్ట్ 28న మూడో విడతలో 10 టన్నుల సామాగ్రితోపాటు 11మంది ప్రత్యేక వైద్యుల బృందం, ఆగస్ట్ 30న నాలుగో విడతలో 11 టన్నుల సహాయ సామాగ్రితోపాటు, ఫోరెన్సిక్స్ నిపుణులు, సొరంగంలో రెస్క్యూ పరికరాలు, సెప్టెంబర్ 2న సహాయక సామాగ్రితో పాటు, 11 మంది సభ్యుల సాంకేతిక బృందాన్ని నేపాల్‌కు పంపించింది. 

ప్రమాదస్థాయిని దాటిన మూడు నదులు

నేపాల్‌లోని వివిధ ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా మూడు ప్రధాన నదులలో నీటి ప్రవాహాలు హెచ్చరిక స్థాయిని దాటాయి. దీంతో దేశంలోని మధ్య, పశ్చిమ, తూర్పు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్‌డీఆర్‌ఆర్‌ఎంఏ) అధికారులు బుధవారం కోరారు. జలవనరు లు, వాతావరణ శాఖకు చెందిన వరద అంచనా విభాగం (ఎఫ్‌ఎఫ్‌డీ) ప్రకారం..

సెప్టెంబర్ 2న ఉదయం 6 గంటల సమయానికి సింధులి జిల్లాలోని సున్ కోషి నది, గోర్ఖాలోని బుధి గండకి నది, దడెల్ధురాలోని మహాకాళి నది నీటి మట్టాలు హెచ్చరిక స్థాయి కంటే ఎక్కువగా ఉన్నాయి. లామ్జుంగ్ జిల్లాలోని మార్స్యాంగ్డి నది నీటి మట్టం, భుకుండే బేసి పర్యవేక్షణ కేంద్రం వద్ద రాత్రి 11:15 గంటలకు ప్రమాద స్థాయిని దాటిందని ఆ విభాగం మంగళవారం తెలిపింది. కాఠ్మండుతో సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో రుతుపవనాలు చురుకుగా ఉండటంతో నిరంతరం వర్షాలు కురుస్తున్నాయి.

నేపాల్ ఒంటరికాదు: సోనూసూద్

ప్రముఖ నటుడు సోనూసూద్ నేపాల్ రాజధాని ఖాఠ్మాండుకు వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. కష్టకాలంలో నేపాల్ ఒంటరికా దని, బాధితులకు అండగా ఉంటానని ఎక్స్ వేదికగా ఆయన వెల్లడించాడు. చాలామంది పిల్లల తల్లిదండ్రులు వరదల్లో కనిపించకుండా పోయారని, పునరావాసకేంద్రాల్లో చూస్తుంటే మనసు ముక్కలైపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

8 ఏళ్ల చిన్నారి తనను చూసి అంతా సర్దుకుంటుందని నవ్వుతూ చెబుతుంటే కళ్లు చెమ్మగిల్లా యన్నారు. మనం సురక్షిత ప్రాంతాల్లో ఉన్నందుకు అదృష్టవంతులమన్నారు. ఆపన్నహస్తం అందించాలని, చేతనైనంత విరాళాలను పంపాలని సోనూ సూద్ విజ్ఞప్తి చేశారు.