14-02-2026 01:28:36 AM
బీసీ జనరల్ రిజర్వేషన్‌తో సమీకరణలు వేడెక్కుతున్నాయి
కరీంనగర్, ఫిబ్రవరి13(విజయక్రాంతి):కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్ పదవి ఈసారి బీసీ జనరల్కు రిజర్వ్ కావడంతో భారతీయ జనతా పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. కార్పొరేషన్లో మెజారిటీ సమీకరణాల నేపథ్యంలో మేయర్ పీఠం కోసం పలువురు కీలక నేతల పేర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వాసల రమేష్, కోలగాని శ్రీనివాస్, సోమిడి వేణు ప్రసాద్, తోట అనిల్, బండారి వేణు పేర్లు ప్రధానంగా చర్చకు వస్తున్నాయి.
వాసల రమేష్ ఇప్పటికే ఎంపీపీగా సేవలందించడంతో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్గా పనిచేసిన అనుభవం కలిగిన సీనియర్ నాయకుడిగా గుర్తింపు పొందారు. బండారి వేణు సీనియర్ కార్పొరేటర్గా కొనసాగుతూ కార్పొరేషన్ వ్యవహారాలపై మంచి పట్టున్న నేతగా పేరుగాంచారు. అదే సమయంలో కోలగాని శ్రీనివాస్, సోమిడి వేణు ప్రసాద్, తోట అనిల్ కూడా స్థానికంగా ప్రభావం కలిగిన నాయకులుగా ఉన్నారు. పార్టీ అంతర్గత సమీకరణలు, కార్పొరేటర్ల మద్దతు, సామాజిక సమతుల్యత వంటి అంశాలు మేయర్ ఎంపికలో కీలకంగా మారనున్నాయి.
కార్పొరేషన్లో మెజారిటీ సాధించిన బీజేపీ తరఫున మేయర్ అభ్యర్థి ఎంపికలో తుది నిర్ణయం బండి సంజయ్ కుమార్ తీసుకునే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఆయన సూచనలు, స్థానిక నాయకుల అభిప్రాయాలు, కార్పొరేటర్ల మద్దతు వంటి అంశాల ఆధారంగా అభ్యర్థి ఎంపిక జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో బీజేపీ వర్గాల్లో ఆసక్తి మరింత పెరిగింది. చివరకు మేయర్ పీఠం ఎవరికీ దక్కుతుందో అన్నదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.