calender_icon.png 20 February, 2026 | 2:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటర్ హాల్‌టికెట్లు విడుదల

20-02-2026 01:02:58 AM

25 నుంచి మార్చి 18 వరకు పరీక్షల నిర్వహణ

పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా హాల్‌టికెట్లపై క్యూఆర్ కోడ్

హైదరాబాద్, ఫిబ్రవరి 19 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు ఈనెల 25 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో హాల్‌టికెట్లను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వార్షిక పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను ఆయా కళాశాలల లాగిన్లతో అందుబాటులో ఉంచినట్లు గురువారం ఇంటర్ బోర్డు తెలిపింది.

ఈమేరకు బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఒక ప్రకటనను విడుదల చేశారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్‌టికెట్లను కళాశాల ప్రిన్సిపాల్స్‌ను కలిసి తీసుకోవచ్చని, అలాగే విద్యార్థుల రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ లింక్‌ను పంపిస్తున్నామని, విద్యార్థులే నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.

హాల్‌టికెట్లపై ఏవైనా తప్పులు ఉంటే ప్రిన్సిపాల్స్ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. విద్యార్థులు తమ పరీక్షా కేంద్రానికి సులువుగా చేరుకునేలా హాల్‌టికెట్లపై క్యూఆర్ కోడ్‌ను ముద్రించినట్లు తెలిపారు. ఈనెల 25 నుంచి మార్చి 18 వరకు జరిగే ఇంటర్ పరీక్షలకు దాదాపు 9.96 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. మొత్తం 1495 సెంటర్లను ఏర్పాటు చేశారు.