ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు వచ్చేశాయి...
హైదరాబాద్: తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు సోమవారం విడుదల చేసింది. మే 22 నుంచి 29వ తేదీ వరకు నిర్వహించిన సప్లిమెంటరీ పరీక్షలకు 4,12,724 మంది విద్యార్థులు హాజరయ్యారు. అభ్యర్థులు తమ ఫలితాలను తెలంగాణ ఇంటర్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.inలో పొందవచ్చు. అంతకుముందు ఏప్రిల్ 22న వచ్చిన మెయిన్ తెలంగాణ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలతో అసంతృప్తి చెందిన విద్యార్థులు రీకౌంటింగ్ లేదా తిరిగి మూల్యాంకనం కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. ఉత్తీర్ణత సాధించనివారిలో వచ్చిన మార్కులతో సంతృప్తి లేని వారు మళ్లీ సప్లిమెంటరీ పరీక్షలకు హజరయ్యారు.
అంతకుముందు, ఏప్రిల్ 22వ తేదీన ప్రకటించిన ప్రధాన పరీక్షలో మొదటి సంవత్సరం విద్యార్థుల మొత్తం ఉత్తీర్ణత శాతం 66.89% కాగా, రెండవ సంవత్సరం విద్యార్థుల ఉత్తీర్ణత 71.37%గా నమోదైంది. రెండు సంవత్సరాలలోనూ బాలుర కంటే బాలికలు మెరుగ్గా రాణించారు. మొదటి సంవత్సరం విద్యార్థులలో, 73.8% మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు, బాలురు 57.83% మంది ఉత్తీర్ణత సాధించారు. రెండవ సంవత్సరంలో బాలికల ఉత్తీర్ణత రేటు 74.21%, బాలురు 57.31% వచ్చిందని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.




