17-07-2025 12:54:03 AM
115.5 గ్రాముల బంగారం, 300 గ్రాముల వెండి, 25 వేల నగదు బైక్, సెల్‌ఫోన్ స్వాధీనం
వివరాలు వెల్లడించిన నల్లగొండ డీఎస్పీ కొలను శివరాంరెడ్డి
నల్గొండ టౌన్,(విజయ క్రాంతి): ఇండ్లతో పాటు బైక్ డిక్కీల్లో దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 115.50 గ్రాముల బంగారం, 300 గ్రాముల వెండి, రూ.25 వేల నగదుతో పాటు మొబైల్ ఫోన్, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను నల్లగొండ డీఎస్పీ కొలను శివరాంరెడ్డి బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరలు సమావేశంలో వెల్లడించారు. జిల్లాలో వరుస దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో ఎస్పీ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సీసీఎస్, నల్లగొండ I టౌన్ పోలీసులు, చందంపేట, పెద్దవూర పోలీసులు వివిధ ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు చేస్తుండగా దొంగలను పట్టుకున్నట్లు చెప్పారు.
బుధవారం ఉదయం 10.30 గంటలకు చందంపేట మండలం పోలేపల్లి క్రాస్ రోడ్ వద్ద బైక్‌పై అనుమానాస్పదంగా వచ్చిన ఇద్దరు వ్యక్తులను ఆపి పాప్లాన్ డివైస్ (వేలిమ్రుదాల తనిఖీ పరికరం)తో చెక్ చేయగా వారు పాత నేరస్తులైన బీసపోగు శాంసన్, కండరకొండ కృష్ణ కిశోర్‌గా గుర్తించినట్లు తెలిపారు. అదుపులోకి తీసుకుని విచారించగా గతంలో పలు దొంగతనాల్లో జైలుకు వెళ్లి ఇటీవల విడుదలై మళ్లీ దొంగతనాలు చేస్తున్నట్లు వెల్లడించారన్నారు. చందంపేట, వాడపల్లి, చింతపల్లి, ఇబ్రహీంపేట, నేరేడుచర్ల, ఏపీలోని బెల్లంకొండ, బండ్లమోటు పోలీస్ స్టేషన్ పరిధిలో 9 ఇండ్లలో, రెండు వాహన డిక్కీల్లో దొంగతనాలను చేసినట్లు తెలిపారు. అంతేగాకుండా కండరకొండ కృష్ణ కిశోర్ పెద్దవూర, పెబ్బేరుతో పాటూ మోత్కూర్ లో మూడు డిక్కీ దొంగతనాలకు పాల్పడినట్లు వెల్లడించారు.
విచారణలో వీరిపై గతంలో తమిళనాడు, ఉమ్మడి తెలుగు ర్రాష్టాల్లో దొంగతనం కేసులు ఉన్నట్లుగా గుర్తించినట్లు చెప్పారు.ఆదేవిధంగా నల్లగొండ జిల్లా కేంద్రంలో వన్‌టౌన్ పరిధిలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా బంగారం అమ్మేందుకు దుకాణానికి వచ్చినట్లు సమాచారం రావడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా కాకినాడకు చెందిన దర్మడి దుర్గాప్రసాద్‌గా గుర్తించినట్లు చెప్పారు. నల్లగొండ పట్టణంలో ఇటీవల మూడు దొంగతనాలు చేసి బంగారం అమ్మే క్రమంలో పోలీసులకు చిక్కినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. ఈ సమావేశంలో సీఐలు ఏమిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, బీసన్న, సీసీఎస్ సీఐ జితేందర్‌రెడ్డి, ఎస్‌ఐ శివకుమార్, విజయ్‌కుమార్, శ్రీకాంత్‌రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్దనగిరి, పుష్పగిరి, నాగరాజు, వహీద్‌పాషా, గులాం దస్తాగిరి, గణేశ్ పాల్గొన్నారు.