calender_icon.png 17 July, 2025 | 11:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డి ఆర్టీఐ చెక్‌పోస్టు వద్ద అంతా మామూళ్లే!

17-07-2025 12:53:41 AM

ఏసీబీ ఆకస్మిక తనిఖీలు.. లారీ డ్రైవర్లు బేఖాతర్

విజయక్రాంతి కథనానికి స్పందన

రాష్ట్రవ్యాప్తంగా దాడులకు సిద్ధమైన ఏసీబీ

హైదరాబాద్/కామారెడ్డి, జూలై 16 (విజయక్రాంతి) : సరిహద్దుల్లోని ఆర్టీఏ చెక్‌పోస్టుల వద్ద అదే కథ.. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఎన్నిసార్లు ఆకస్మిక తనిఖీలు చేసినా మారని లంచాల కథ.. బుధవారం కామారెడ్డి జిల్లా పొందుర్తి ఆర్టీఏ చెక్‌పోస్టుపై ఏసీబీ ఆకస్మిక దాడులు జరిపినప్పుడు కూడా సీన్ రిపీటైంది.

ఏసీబీ అధికారులు అక్కడే ఉన్నా, వారిని ఏమాత్రం పట్టించుకోని లారీ డ్రైవర్లు ఆర్టీఏ సిబ్బందికి ముడుపు లు ముట్టజెప్పి వెళ్లారు. ఇదిచూసి నివ్వెరపోవడం ఏసీబీ అధి కారుల వంతైంది. ‘చెక్ లేని సరిహద్దు లు.. లంచాల పోస్టులు’ పేరిట విజయక్రాంతి దినపత్రికలో ఈనెల 14న ప్రచురితమైన కథనానికి ప్రభుత్వం స్పందించింది. రాష్ట్రవ్యాప్తంగా చెక్ పోస్టుల వద్ద పరిస్థితులపై వెంటనే తనిఖీలు చేపట్టాలని, అక్కడి పరిస్థితులపై ఓ నివేదిక సిద్ధం చేయాలని రవాణా శాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు.

అలాగే చెక్ పోస్టుల వద్ద సాగుతున్న అక్రమాల వల్ల ప్రభుత్వానికి వస్తున్న చెడ్డపేరుపైనా ఉన్నతాధికారులు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద కొనసాగుతున్న అవినీతిపై మరోసారి ఏసీబీ దృష్టిపెట్టింది. ఈ నేపథ్యంలో బుధవారం కామారెడ్డి జిల్లా పొందుర్తి ఆర్టీఏ చెక్‌పోస్టుపై ఏసీబీ ఆకస్మిక దాడులు చేసింది.

ఎప్పటిలాగే అక్కడ ఐదుగురు అనధికార వ్యక్తులు లారీల డ్రైవర్లు, ఓనర్ల నుంచి డబ్బులు వసూలుచేస్తూ కనిపించారు. ఆర్టీఏ అధికారులు తమ విధులను వదిలేసి, అక్కడ ఏజెంట్ల చేతిలోనే తమ బాధ్యతలను అప్పజెప్పిన పరిస్థితులను చూసి ఏసీబీ అధికారులు అవాక్క య్యారు. ఏసీబీ అధికారుల ముందే లారీల డ్రైవర్లు వచ్చి డబ్బులు ఇచ్చిపోవడం కనిపించింది. అక్కడ ఉన్న ఏసీబీ అధికారులను లారీ డ్రైవర్లు ఏమాత్రం పట్టించుకోలేదు.

డబ్బులు ఇచ్చి తమ పనైపోయిందన్నట్లుగా వెళ్లిపోయారని ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ తనిఖీల సందర్భంగా ఓ ఏఎంవీఐ వద్ద, ఏజెంట్ల వద్ద కూడా ఏసీబీ అధికారులకు లెక్క తేలని డబ్బు దొరికింది. గతంలోనూ పలుమార్లు ఈ చెక్ పోస్ట్ వద్ద ఏసీబీ దాడులు నిర్వర్తించగా ఇదే పరిస్థితి కనిపించింది. తాజాగాను ఏసీబీ అధికారులు అక్కడి పరిస్థితులను చూసి పూర్తి నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించనున్నట్లు తెలిపారు.

సంబంధిత అధికా రులు తమ విధులను ప్రైవేటు వ్యక్తులను ఏజెంట్లుగా నియమించుకుని వారికి అప్పగిస్తున్నట్లు గుర్తించామని.. ప్రభుత్వానికి ఇవ్వబోయే నివేదికలో ఈ విషయాలన్నింటినీ పొందుపరుస్తున్నట్లు తెలిపారు. కామా రెడ్డి తనిఖీల్లో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్‌పెక్టర్, ఓ ప్రైవేటు ఏజెంట్ శివకుమార్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఏసీబీ డిఎస్పి శేఖర్ గౌడ్ తెలిపారు. మరో ఇద్దరు పరారైన్నట్లు చెప్పారు.

దాడులకు సిద్ధమైన ఏసీబీ..

ఆర్టీఏ చెక్‌పోస్టుల వద్ద పెద్దఎత్తున అవినీతి చోటుచేసుకుంటున్న వ్యవహారంపై విజయక్రాంతి కథనానికి స్పందించిన సీఎంఓ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని చెక్‌పోస్టులపైనా దాడులు నిర్వహించి ఓ నివే దికను అందించాలని ఆదేశించినట్లు సమాచారం. ప్రభుత్వ ఖజానాకు గండి పడితే స హించేది లేదని, కచ్చితంగా అవినీతి అధికారుల భరతం పట్టాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చెక్‌పోస్టులపై ఏసీబీ దాడులు కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది.