అంతరాష్ట్ర దొంగ అరెస్టు...
సీఐ కోటేశ్వర్ వెల్లడి..
కరీంనగర్ సిటీ (విజయక్రాంతి): నగరంలోని కట్టరాంపూర్‌లో గత నెల 25న జరిగిన చోరీ కేసులో నిందితుడిని వన్‌టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన నిందితున్ని మీడియా ముందు హాజరుపరచి ఇన్‌స్పెక్టర్ కోటేశ్వర్ వివరాలు వెల్లడించారు. కట్టరాంపూర్‌లోని శాతవాహన అపార్ట్‌మెంట్స్‌లో నివసిస్తున్న ఉప్పుగండ్ల రాజమణి గత నెల 23న ఇంటికి తాళం వేసి బంధువులు ఇంటికి వెళ్లింది. 25న తిరిగి వచ్చేసరికి ఇంటికి తాళం పగలగొట్టి ఉండడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. బీరువాలో దాచి ఉంచిన బంగారు నగలతో పాటు సాంసంగ్ టీవీ చోరీకి గురైనట్లు రాజమణి కుమారుడు మురళీకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సాంకేతిక ఆధారాలను పరిగణలోకి తీసుకొని విచారణ చేపట్టారు.
ఈ క్రమంలో నిందితుడు మంగళవారం ఉదయం గౌతమ్‌నగర్ సమీపంలో సంచరిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని విచారించగా నేరం అంగీకరించడంతో అతని వద్ద నుంచి చోరీ సొమ్మును రికవరీ చేశారు. నిందితుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లా మండపేటకు చెందిన కందుల సత్యనారాయణగా గుర్తించారు. నిందితుడు వద్ద నుండి చోరీ సొమ్మును, సాంసంగ్ టీవీ, 21 తులాల బంగారు ఆభరణాలు, 46 తులాల వెండి వస్తువులు, సెల్‌ఫోన్‌ను రికవరీ చేశారు. చోరీ కేసులో నిందితుడిని మంగళవారం కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్ బిల్ల కోటేశ్వర్ తెలిపారు. నిందితుడు సత్యనారాయణ గతంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20 కేసుల్లో నిందితుడిగా ఉండి జైలుశిక్ష కూడా అనుభవించాడు. నిందితున్ని అదుపులోకి తీసుకున్న సిబ్బంది, ఎస్‌ఐ రాజన్న, ఎస్‌ఐ భాస్కర్ రెడ్డి, సీసీఎస్ ఎస్‌ఐ రమేష్, క్రైం టీం పీసీ కుమార్, సంపత్, సీసీఎస్ హెచ్‌సి సురేంద్ర పాల్‌సింగ్‌లను ఇన్‌స్పెక్టర్ కోటేశ్వర్ అభినందించారు.






