8 May, 2026 | 10:17 AM

మార్కెట్లోనే మక్కల నిల్వ

08-05-2026 09:23 AM

కొనుగోళ్లకు తొలగిన ఇబ్బంది 

కేసముద్రం, (విజయక్రాంతి): లారీల కొరత నేపథ్యంలో కొనుగోలు చేసిన మక్కలను కేసముద్రం మార్కెట్ షెడ్లలో నిలువ చేసే విధంగా చర్యలు చేపట్టారు. దీనితో కొద్దిరోజులుగా మార్క్ఫెడ్ సంస్థ ద్వారా మక్కల కొనుగోళ్లలో ఏర్పడ్డ ప్రతిష్టంబన తొలగిపోయింది. శుక్రవారం నుండి తిరిగి మార్క్ఫెడ్ ద్వారా మక్కల కొనుగోలు చేపట్టనున్నట్లు మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి తెలిపారు. గురువారం కేసముద్రం మార్కెట్లో చైర్మన్ గంట సంజీవ రెడ్డి అధ్యక్షతన ధనసరి, కేసముద్రం సొసైటీల చైర్మన్లు మర్రి రంగారావు, దీకొండ వెంకన్న, అధికారులు, రైతు, కార్మిక సంఘ నాయకులు సమావేశం నిర్వహించి, మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేయు మొక్కజొన్న కేసముద్రం నందు గల ఓపెన్ షెడ్లలో లాట్ల పద్ధతిన నిల్వ చేయుటకు గాను ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మార్క్ ఫెడ్ శాఖ, ప్రాథమిక వ్యవసాయ సంఘాలు గ్రామాల వారీగా కొనుగోలు చేసిన బస్తాలను నిలువ చేయుటకు ఒక ప్రణాళిక తయారు చేయడం జరిగినది.

వ్యవసాయ, సహకార శాఖ అధికారులు గ్రామాల వారీగా గ్రామాలలో మొక్కజొన్నల నాణ్యతా ప్రమాణాలు పరీక్షించిన తర్వాత రైతులకు టోకెన్ జారీ చేయడం జరుగుతుందన్నారు. టోకెన్ జారీ చేసిన రైతులు ట్రాక్టర్ల ద్వారా బస్తా కు 51 కిలోల చొప్పున బస్తాలు నింపి వే బ్రిడ్జి పై కాంటా వేసి మార్కెట్ యార్డుకు తీసుకువచ్చి మార్క్ ఫెడ్ కు విక్రయించే విధంగా తీర్మానించారు. రైతులు తమ మొక్కజొన్న పంటను యాసంగి 2025 సీజన్లో పంట నమోదు అయినదో లేదో చెక్ చేసుకొని ఎన్ని బస్తాలు అర్హత ఉందో అంతవరకే తీసుకు రావాలన్నారు. రైతులు నింపే బస్తాలు డ్యామేజీ లేకుండా, కుట్టు వేసుకొని, చెక్ చేసుకుని తీసుకు రావాలని కోరారు.