13 July, 2026 | 4:00 PM

యాక్షన్ మోడ్‌లోకి..

11-12-2024 12:00 AM

పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. పిరియాడిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. తొలిసారిగా పవన్ పిరియాడిక్ సినిమా చేస్తుండటంతో పాటు, ఏపీ డిప్యూటీ సీఎం అయ్యాక వస్తున్న తొలి సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన షూటింగ్ చివరి అంకానికి చేరుకుంది. చివరి షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌లో పవన్ కూడా పాల్గొంటున్నారు. మొత్తానికి పొలిటికల్ మోడ్ నుంచి పవన్ యాక్షన్ మోడ్‌లోకి వచ్చేశారు. దీనికి సంబంధించిన వర్కింగ్ స్టిల్‌ను చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నిధి అగర్వాల్ నటిస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖ నటుడు బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.