సల్మాన్ ప్రాజెక్టులోకి..
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మాత దిల్ రాజు ఓ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎస్‌వీసీలో 63వ ప్రాజెక్టుగా రూపొందుతున్న ఈ యాక్షన్ డ్రామాపై అంచనాలను మరింత పెంచుతూ మేకర్స్ మంగళవారం ఓ శుభవార్త తెలియజేశారు. లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
బాలీవుడ్‌లో తన బ్లాక్‌బస్టర్ ఎంట్రీగా నిలిచిన ‘జవాన్’ తర్వాత నయనతార ఈ ప్రాజెక్టులో చేరడం సినిమాకు మరింత బజ్ తీసుకువచ్చింది. తన సినిమాల్లో హీరోయిన్ పాత్రలను బలంగా చూపించడంలో దర్శకుడు వంశీ పైడిపల్లి ప్రత్యేకత చాటుతారు. ఈ కథలో కూడా హీరోయిన్ పాత్ర కీలకంగా ఉండటంతో, నయనతార లాంటి పవర్ ఫుల్ నటిని ఎంపిక చేయడం ప్రత్యేకంగా నిలుస్తోందని టీమ్ భావిస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఏప్రిల్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుండగా, 2027లో థియేటర్లలో రిలీజ్ కానుందీ చిత్రం.




