1 April, 2026 | 3:31 AM

నాకు తెలియకుండానే జీవిత ఆ బైక్ అమ్మేశారు!

01-04-2026 12:57 AM

స్టార్ హీరో శర్వా ఇప్పుడు భారీ రేసింగ్ డ్రామా ‘బైకర్’తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిన భారతదేశపు మొట్టమొదటి మోటోక్రాస్ అడ్వంచరస్ చిత్రమిది. ఇందులో మాళవిక నాయర్ కథానాయిక. సీనియర్ నటుడు రాజశేఖర్‌తోపాటు బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఏప్రిల్ 3న విడుదల కానున్న ఈ సినిమా గురించి హీరో రాజశేఖర్ చెప్పిన విశేషాలివీ.. 

చాలా రోజుల తర్వాత నేను చేసిన సినిమా రిలీజ్ అవుతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్ది చాలా ఆనందంగా ఉంది. ముఖ్య పాత్రలో నటించినప్పటికీ హీరోగా నటించిన సినిమాలాగా ఉంది. ప్రేక్షకులు ఎంతలా మెచ్చుకుంటారోనని ఎదురుచూస్తున్నా. 

నేను ఏ క్యారెక్టర్ చేసినా నా క్యారెక్టర్‌తోపాటు కథ బాగుండాలి అనుకుంటా. నా క్యారెక్టర్, కథ.. రెండూ నచ్చే ఈ సినిమా చేశా. కథపరంగా సూపర్ హిట్. 

నాకు చిన్నప్పట్నుంచి బైక్స్ అంటే చాలా ఇష్టం. మా అమ్మమ్మగారింట్లో ఒక బుల్లెట్ బండి ఉండేది. నేను సెలవుల్లో అక్కడికి వెళ్లిన ప్రతిసారి ఆ ఊరు మొత్తం బుల్లెట్‌లో తిరిగేవాడిని. ఆ తర్వాత బైక్స్ మీద ఆసక్తి పెరుగుతూ వచ్చింది. ‘శేషు’ సినిమా సమయంలో స్వయంగా నేనే యమహా సిక్స్ ఫిఫ్టీ సీసీ బండి కొనుక్కొని ఆ షూటింగుకు వాడాను. ఆ తర్వాత అదే బైక్‌ను రోజూ నడుపుకునేవాడిని. నేను నడిపే విధానం చూసి ‘మీరు చాలా రిస్క్‌తో నడుపుతున్నారంటూ నాకు తెలియకుండానే జీవిత ఆ బైక్ అమ్మేశారు (నవ్వుతూ). ‘బైకర్’లో నా క్యారెక్టర్ పేరు బుల్లెట్ సునీల్. ఈ క్యారెక్టర్ గురించి పూర్తి వివరాలు సినిమాలోనే చూడాలి.

నాకు ఎప్పుడూ నా కుటుంబమే అతిపెద్ద బలం. ఈ సినిమా, నా క్యారెక్టర్ ఇంత అద్భుతంగా రావడానికి ఒక కారణం జీవిత, మా పిల్లలు. వాళ్ల సహకారం చాలా గొప్పది. ఈ సినిమా చేసినప్పుడు నన్ను స్కూల్‌కు డ్రాప్ చేసి మళ్లీ అక్కడి నుంచి తీసుకొచ్చే ఒక మదర్‌లాగా చూసుకున్నారు.

మా పాషన్, ప్రొఫెషన్ రెండు సినిమానే. ఇంట్లో మొత్తం సినిమా వాతావరణమే ఉంటుంది. కొత్త సినిమాలు రిలీజైతే నేరుగా థియేటర్‌కు వెళ్లి చూస్తుంటాం. ఏదైనా కథ, క్యారెక్టర్ వస్తే అందరం కలిసి చర్చించుకుంటాం. షూటింగ్‌లో జరిగిన విశేషాలూ మాట్లాడుకుంటాం. అందరం సినిమా ప్రొఫెషన్‌లోనే ఉన్నాం కాబట్టి ఇంట్లో చాలా సౌకర్యంగా ఉంటుంది. 

ఇంకా నా కొత్త సినిమాలంటే.. -పవన్ సాదినేనితో ‘మగాడు’ సినిమా చేస్తున్నా. అది ఇంకా 20% మిగిలింది.. వచ్చే నెల నుంచి షూటింగ్ అనుకుంటున్నారు. నేను, రమ్య, విశ్వదేవ్, శివాని కలిసి ఒక సినిమా చేస్తున్నాం. అది షూటింగ్ జరుగుతుంది. త్వరలోనే టైటిల్ రిలీజ్ చేస్తాం.