12 July, 2026 | 2:01 AM

చరిత్రలో ఇనుగుర్తి ఘనకీర్తి!

12-07-2026 12:00 AM

కాకతీయుల కాలం నాటి ఆనవాళ్లు

మహబూబాబాద్ జిల్లాలోని ఇనుగుర్తి గ్రామం చరిత్ర, పురావస్తు, జానపద సంప్రదాయాల పరంగా విశిష్టమైన ప్రాధాన్యాన్ని కలిగి ఉంది. కాకతీయుల పాలనలో వరంగల్ రాజధాని పరిసర ప్రాంతాల్లో ఉన్న అనేక కేంద్రాల మాదిరిగానే ఇనుగుర్తి కూడా ఒక కీలక స్థావరంగా ఉండేదని ఇక్కడ ఉన్న ఆనాటి ఆనవాళ్లను బట్టి చరిత్రకారులు భావిస్తున్నారు. గ్రామ పరిసరాల్లో కనిపించే ప్రాచీన ఆలయాలు, శిల్పాలు, శాసనాలు, కోట ఆనవాళ్లు ఈ ప్రాంత చారిత్రక ప్రాధాన్యాన్ని తెలియజేస్తున్నాయి. ఇనుగుర్తి గుట్ట వ్యూహాత్మక స్థావరంగా వెలుగొందినట్లు, రహస్య సొరంగాల ద్వారా వెళ్లి యుద్ధం చేసినట్లు ఆనవాళ్లు ఉన్నాయి.

ఇలా చరిత్రలో ఘనకీర్తి గడించిన ఇనుగుర్తి చారిత్రక వైభవాన్ని పరిరక్షించాలని, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఇనుగుర్తిలో కాకతీయుల కాలం నాటి ఆనవాళ్లు స్పష్టంగా కన్పిస్తున్నా యి. 12, 14వ శతాబ్దాల మధ్య కాకతీయులు ఓరుగల్లును పాలించిన కాలంలో అనేక శైవ, వైష్ణవ దేవాలయాలు నిర్మించారు. ఇనుగుర్తిలో కనిపించే కొన్ని శిల్పాలు, స్తంభాలు, ద్వారబంధాలు కాకతీయుల నిర్మాణ శైలిని గుర్తు చేస్తాయి. ముఖ్యంగా నల్లరాతిపై చెక్కిన శిల్పాలు, సుందరమైన స్తంభాల నిర్మాణం ఆ కాలపు కళా వైభవాన్ని ప్రతిబింబిస్తుంది.

ఇనుగుర్తి గుట్ట వ్యూహాత్మక స్థావరమా?

ఇనుగుర్తి గ్రామ సమీపంలోని గుట్ట వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతంగా ఉండేదని స్థానికులు చెబుతుంటారు. ఎత్తున ప్రదేశం కావడంతో శత్రువుల కదలికలను గమనించేందుకు ఇది అనుకూలంగా ఉండి ఉండవచ్చని భావిస్తున్నారు. ఇనుగుర్తిలో కనిపించే రాతి నిర్మాణాల అవశేషాలు, కోట గోడల ఆనవాళ్లపై శాస్త్రీయ పరిశోధన అవస రం ఉంది. అలాగే ఇనుగుర్తి గురించి అత్యంత ఆసక్తికరంగా ప్రచారం లో ఉన్న అంశం రహస్య సొరంగాల కథనం.

ఇనుగుర్తి గుట్ట నుంచి వరంగల్ కోట వరకు భూగర్భ మార్గం ఉండేదని స్థానికులు చెబుతారు. యుద్ధ సమయాల్లో రాజకుటుంబ సభ్యులు, సైనికులు రాకపోకలకు వీటిని ఉపయోగించేవారని ప్రచారం ఉంది. అయితే ఈ సొరంగాల ఉనికిని నిర్ధారించే అధికారిక పురావస్తు ఆధారాలు ఇప్పటివరకూ లేవు. అందువల్ల దీనిని చారిత్రకంగా నిర్ధారిత విషయంగా కాకుండా స్థానిక జానపద కథనంగా మాత్రమే చెప్పుకుంటారు.

ప్రాచీన దేవాలయాలు

ఇనుగుర్తిలోని ప్రాచీన శివాలయం, లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, ఇతర ఆలయ నిర్మాణాలు, బురుజు, గొలుసు కట్టు చెరువులు, కాకతీయుల కాలపు శిల్పకళను, చరిత్రను ప్రతిబింబిస్తున్నాయి. ఆలయ స్తంభాలపై కనిపించే శిల్పాలు, ద్వారబంధాలపై ఉన్న అలంకరణలు ఆ కాలపు శిల్పుల నైపుణ్యాన్ని చాటుతున్నాయి. కాలక్రమేణా కొన్ని నిర్మాణాలు శిథిలావస్థకు చేరుకున్నప్పటికీ వాటి చారిత్రక విలువ మాత్రం చెక్కుచెదరలేదు. ఇనుగుర్తి పరిసర ప్రాంతాల్లో లభించిన కొన్ని శాసనాలు కాకతీయుల పాలన, దానధర్మాలు, దేవాలయాల నిర్వహణ వంటి అంశాలపై సమాచారం అందిస్తున్నాయని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఈ శాసనాలపై మరింత శాస్త్రీయ అధ్యయనం జరిగితే కొత్త చారిత్రక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి

చారిత్రక, పురావస్తు ప్రాధాన్యం ఉన్న ఇనుగుర్తిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఇనుగుర్తి చరిత్రపై సమగ్ర సర్వే నిర్వహించి, ఆలయాలు, కోట ఆనవాళ్లు, శాసనాలను సంరక్షిస్తే ఈ ప్రాంతం తెలంగాణ చారిత్రక పటంలో మరింత గుర్తింపు పొందే అవకాశం ఉంది. సమగ్ర పురావస్తు తవ్వకాలు, శాస్త్రీయ పరిశోధనలు చేపడితే కాకతీయుల చరిత్రకు సంబంధించిన విలువైన ఆధారాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని చరిత్రకారులు చెబుతున్నారు. 

 బండి సంపత్ కుమార్, మహబూబాబాద్, విజయక్రాంతి