సేవలోనూ పవర్‌ఫుల్!
- విధులతో పాటు సేవా కార్యక్రమాలు
- వేతనంలో కొంత పేదలకు స్వచ్ఛంద విరాళం
- చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి నెలా ఆర్థిక చేయూత
- ఆదర్శంగా నిలుస్తోన్న టీజీఎన్‌పీడీసీఎల్ ఉద్యోగులు
విద్యుత్ సరఫరాలో ప్రజలకు నిరంతరం సేవలందిస్తున్న టీజీఎన్‌పీడీసీఎల్ ఉద్యోగులు సామాజిక సేవలోనూ తమ ప్రత్యేకతను చాటుతున్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు అండగా నిలుస్తూ మానవత్వాన్ని చాటుతున్నారు. తమ నెలవారీ వేతనంలో కొంత మొత్తాన్ని స్వచ్ఛందంగా విరాళం అందిస్తూ ఏర్పాటు చేసిన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి నెలా నిరుపేదలకు చేయూతనిస్తున్నారు. టీజీఎన్‌పీడీసీఎల్ పరిధిలోని యూనియన్లు, అసోసియేషన్‌లు అభాగ్యులకు అండగా నిలిచేందుకు తమ ఉద్యోగుల సహకారంతో చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేశాయి. ఈ ట్రస్ట్‌కు సంస్థలోని ప్రతి ఉద్యోగి నెలకు కనీసం రూ.50 చొప్పున, అంతకంటే ఎక్కువ మొ త్తాన్ని స్వచ్ఛందగా విరాళం అందిస్తున్నారు.
ఈ విధంగా ఉద్యోగుల నుంచి ప్రతి నెలా సుమారు రూ.5.40లక్షల మేర నిధులు సమకూరుతున్నాయి. ఈ నిధులను 18 సర్కిళ్ల పరిధిలోని 27 అనాథ, వృద్ధ సంక్షేమ సంస్థలకు ప్రతి నెలా రూ.20,000 చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. ప్రధానంగా అనాథ పిల్లల సంరక్షణ, వృద్ధాశ్రమాల నిర్వహణ, దివ్యాంగుల సేవ, పేద పిల్లల విద్యా సహాయం, మహిళా సంక్షేమం, మానసిక వికలాంగుల పునరావాసం వంటి సామాజిక సేవా కార్యక్రమాలకు ఈ నిధులను వెచ్చిస్తున్నారు. వృత్తిలోనే కాకుండా, సామజిక సేవలోనూ తమ వంతు భాద్యతను నిర్వర్తిస్తుండటం మానవతా విలువలకు అద్దం పడుతోంది.
ఈ జిల్లాల్లో సేవా సంస్థలు
టీజీఎన్‌పీడీసీఎల్ పరిధిలోని హనుమకొండ, జనగా మ, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, వరంగ ల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో గల 27 అనాథ, వృద్ధ సంక్షేమ సంస్థలకు సేవాసంస్థలకు ప్రతి నెలా రూ.20వేల చొప్పున ఆర్థిక సహాయం అందుతోంది. ఉద్యోగుల సహకారంతో ఈ సహాయం, అనాథ పిల్లల్లో చిరునవ్వులు నింపడంతో పాటు వృద్ధాశ్రమాల్లో ఆశ్రయం పొందుతున్న వృద్ధులు, పేద పిల్లలు, దివ్యాంగులు, ఆపేదలో ఉన్న నిరుపేదల్లో వెలుగులు నింపుతోం ది. సమాజంలోని బలహీన వర్గాల పట్ల మానవతా దృక్పథంతో ముందుకు సాగుతున్న టీజీఎన్పీడీసీఎల్ చారిటబుల్ ట్రస్ట్, భవిష్యత్తులో మరింత విస్తృత స్థాయిలో సేవా కార్యక్రమాలను చేపట్టే దిశగా కృషి చేస్తోంది.
బండి సంపత్‌కుమార్, మహబూబాబాద్
అనాథలకు కొండంత బలం
మంగంపేటలోని వృద్ధాశ్రమంలో 40 మంది వరకు ఆశ్రయం పొందుతున్నారు. ప్రతినెలా దాతల సహకారం, కొందరు తమ పుట్టినరోజు సందర్భంగా సమకూర్చే ఆహార పదార్థాలు, ఇతర వస్తువులతో వెళ్లదీస్తున్నాం. ఇప్పుడు విద్యుత్ శాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతినెలా రూ.20వేలు ఇవ్వడానికి ఉద్యోగులు ముందుకు రావడం కొండంత బలాన్ని ఇచ్చింది. నిర్వహణ కోసం ఇబ్బందులు పడుతున్న తరుణంలో విద్యుత్ ఉద్యోగులు అండగా నిలవడంతో అనాథలకు, వృద్ధులకు మరింత సేవ చేసే అవకాశం దక్కింది.
సామ్రాజ్యం, వృద్ధాశ్రమం నిర్వాహకురాలు






