27 June, 2026 | 12:04 AM

బుల్స్ బౌన్స్‌ బ్యాక్

06-06-2024 01:40 AM

3 శాతం కోలుకున్న స్టాక్ సూచీలు

న్యూఢిల్లీ, జూన్ 5:  బీజేపీ స్పష్ఠమైన మెజారిటీ సాధించి, తిరిగి ఎన్‌డీఏ స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న మార్కెట్ విశ్లేషకుల అంచనాలు గురితప్పడంతో మంగళవారం భారీగా పతనమైన మార్కెట్ వెనువెంటనే బుధవారం బౌన్స్ అయ్యింది. క్రితం రోజు నష్టాల్లో (6 శాతం) సగం పూడ్చుకున్నాయి. స్టాక్ సూచీలు 3 శాతం కోలుకున్నాయి. ఎన్‌డీఏ భాగస్వాములు ప్రభుత్వం ఏర్పాటకు సిద్ధమయ్యారన్న వార్తలతో కనిష్ఠస్థాయిలో లభిస్తున్న షేర్లను ఇన్వెస్టర్లు కొనుగోలు చేశారు. దీంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 2,303 పాయింట్లు పెరిగి 74,382 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ సూచి 2,455 పాయింట్లు ఎగిసి 74,534 పాయింట్లను సైతం తాకింది. ఇదేబాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఇంట్రాడేలో 786 పాయింట్లు ర్యాలీ జరిపి 22,670 పాయింట్ల గరిష్ఠస్థాయిని తాకగా, ముగింపులో లాభాల స్వీకరణతో కొంతమేర దిగివచ్చి 736 పాయింట్ల లాభంతో (3.36 శాతం) 22,620 పాయింట్ల వద్ద ముగిసింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్స్, ఎఫ్‌ఎంసీజీ షేర్లను  ఇన్వెస్టర్లు భారీగా కొనుగోలు చేశారు. ముఖ్యంగా హెవీవెయిట్ షేర్లయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ సూచీలను రికవరీ బాట పట్టించాయి. నిఫ్టీ అన్ని షేర్లూ లాభాలతో ముగిసాయి. 

పాలసీ ఏజెండా కొనసాగింపుపై ఆశలు

అధికార పార్టీ మెజారిటీ తగ్గినప్పటికీ, ఈ టెర్మ్‌లో మోదీ ప్రభుత్వం అమలు చేసిన పాలసీ ఏజెండా (మూలధన పెట్టుబడులు, మౌలిక రంగ సదుపాయాల కల్పన, తయా రీ తదితరాలు) ఇక మీదట కూడా కొనసాగుతుందని తాము అంచనా వేస్తున్నట్టు మోతీలాల్ ఓస్వాల్ రీసెర్చ్ విడుదల చేసిన రిపోర్ట్‌లో పేర్కొంది. అలాగే గ్రామీణ ప్రాంతాల కోసం కొన్ని ప్రజాకర్షక విధానాలను సైతం ప్రభుత్వం అమలు చేస్తుందని భావిస్తున్నామని బ్రోకరేజ్ తెలిపింది. సమీప భవిష్యత్తులో ప్రభుత్వ ఏర్పాటు, రిజర్వ్‌బ్యాంక్ ద్రవ్య విధానంపై మార్కెట్ దృష్టి ఉంటుందని మోతీలాల్ ఓస్వాల్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ్ ఖెమ్కా తెలిపారు. 

కదంతొక్కిన బ్యాంకింగ్

తాజా మార్కెట్ ర్యాలీకి బ్యాంకింగ్ షేర్లు నేతృత్వం వహించాయి. సెన్సెక్స్ బాస్కెట్‌లో అన్నింటికంటే అధికంగా ఇండస్‌ఇండ్ బ్యాంక్ 7.75 శాతం పెరగ్గా, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు 3 శాతం మధ్య ఎగి సాయి. టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, హిందుస్థాన్ యూనీలీవర్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌లు సైతం భారీగా లాభపడ్డాయి. అన్ని రంగాల సూచీలు లాభాలతోనే ముగిసాయి. మిడ్‌క్యాప్ ఇండెక్స్ 4.41 శాతం పెరగ్గా, స్మాల్ క్యాప్ సూచి 2.93 శాతం ఎగిసింది. వివిధ రంగాల సూచీల్లో అన్నింటికంటే అధికంగా టెలికమ్యూనికేషన్స్ ఇండెక్స్ 6.01 శాతం ఎగిసింది. సర్వీసెస్ ఇండెక్స్ 5.74 శాతం, మెటల్ ఇండెక్స్ 5.36 శాతం, ఆటో ఇండెక్స్ 4.50 శాతం, కమోడిటీస్ సూచి 4.48 శాతం, కన్జూమర్ డిస్క్రీషనరీ ఇండెక్స్ 4.29 శాతం మేర పెరిగాయి.  బీఎస్‌ఈలో లిస్టయిన మొత్తం షేర్లలో 2,597 షేర్లు లాభపడగా, 1,221 షేర్లు తగ్గాయి.

పెరిగిన రూ.13.22 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద

మంగళవారం నాటి పతనంతో ఒక్క రోజులోనే రూ.31 లక్షల కోట్ల సంపదను నష్టపోయిన ఇన్వెస్టర్లు మరుసటి రోజైన బుధవారం తిరిగి అందులో కొంతమేర రూ.13.22 లక్షల కోట్ల సంపదను సాధించగలిగారు. మార్కెట్ తాజా బౌన్స్ బ్యాక్‌తో ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ.13,22,847 కోట్లు పెరిగి 4,08,06,552 కోట్ల కు చేరింది.  క్రితం రోజు ఇది రూ.3,94,83,705 లక్షల కోట్లకు (4.73 ట్రిలియన్ డాలర్లు) పడిపోయింది. కేంద్రంలో రాజకీయ స్థిరత్వం నెల కొంటుందన్న విశ్వాసంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లు జరిపారని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. ఇక మార్కెట్ దృష్ఠి ప్రభుత్వ ఏర్పాటుపై, రిజర్వ్‌బ్యాంక్ పాలసీపై మళ్లుతుందని చెప్పారు.

ఎన్‌ఎస్‌ఈ ప్రపంచ రికార్డు

ఒక్క రోజులో 1,971 కోట్ల లావాదేవీలు

నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) ఒకే రోజులో అత్యధిక లావాదేవీలు నిర్వహించి ప్రపంచ రికార్డును నెలకొల్పింది. బుధవారం ఎన్‌ఎస్‌ఈలో 1,971 కోట్ల ట్రేడింగ్ లావాదేవీలు జరిగాయి. మంగళవారంనాటి భారీ పతనం అనంతరం మార్కెట్ రికవరీ జరిగినరోజున 6.15 గంటల ట్రేడింగ్ సమయంలో ఈ రికార్డు సాధించినట్టు ఎన్‌ఎస్‌ఈ సీఈవో అశీష్ చౌహాన్ తెలిపారు.