ట్రంప్ హత్యకు ఇరాన్ స్కెచ్?
అగ్రరాజ్యాన్ని అలర్ట్ చేసిన ఇజ్రాయెల్
ఇరాన్ ఎంతమంది ప్రపంచ నేతలను హతమార్చింది?
టెహ్రాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి
యుద్ధం ఇంకా ముగియలేదు: ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు
వాషింగ్టన్/టెల్‌అలీవ్/టెహ్రాన్, జూలై10: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హత్యకు ఇరాన్ పక్కా ప్రణాళికతో స్కెచ్ వేసినట్లు ఇజ్రాయెల్ అగ్రరాజ్యాన్ని అలర్ట్ చేసింది. ట్రంప్‌ను లేపేసేందుకు టహ్రాన్ కొత్త కుట్రలతో సిద్ధమైందని ఆరోపించింది. ఈ హత్యా ఆరోపణలపై ఇరాన్ స్పందించింది.
ఇరాన్ ఎంతమంది ప్రపంచ నాయకులను హత్య చేసింది? అని టెహ్రాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి ప్రశ్నించారు. మరోపక్క ఇరాన్‌తో యుద్ధం ఇంకా ముగియలేదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు హెచ్చరించారు. ఇంకోపక్క నెతన్యాహుతో గల్ఫ్ దేశా ల్లో తాజా పరిస్థితులపై ట్రంప్ ఫోన్లో మాట్లాడారు. దీంతో పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయనే సంకేతాలు కన్పిస్తున్నాయి. అమెరికా పరస్పర దాడులతో గల్ఫ్ దేశాలు మళ్లీ బాంబులు, క్షిపణులు, డ్రోన్ల దాడులతో మార్మోగుతున్నాయి.
ఈ పరిణామాల వేళ ఇజ్రాయెల్ నిఘా వర్గాలు అగ్రరాజ్యానికి కీలక హెచ్చరికలు చేశాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను హత్య చేసేందుకు ఇరాన్ కొత్త కుట్రలు చేస్తున్నట్లు హెచ్చరించాయి. ట్రంపు లక్ష్యంగా చేసుకుని దాడులు జరగొచ్చని అమెరికా నిఘా సంస్థలకు కొన్ని వారాలుగా సమాచారం అందు తూనే ఉంది. కానీ, దీని గురించి ఇజ్రాయెల్ అలర్ట్ చేయడం ఈ మధ్యకాలంలో ఇదే మొదటిసారి. ట్రంప్ హత్యకు ఇరాన్ పకడ్బందీగా ప్రణాళికను రూపొందించినట్లు తమకు సమాచారం వచ్చిందని ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ అగ్రరాజ్యాన్ని హెచ్చరించింది.
ఈ మేరకు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే, ఈ కుట్రకు సంబంధించి ఇతర వివరాలేవీ బయటకు రాలేదు. మరోవైపు, తనపై హత్య కుట్రల గురించి ట్రంప్ కూడా ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. తుర్కియేలో నాటో సదస్సు సమయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘అమెరికా అధ్యక్షుడిని అడ్డు తొలగించాలని వారు (ఇరాన్‌ను ఉద్దేశిస్తూ) కోరుకుంటున్నారు.
నేను అందరి హిట్ లిస్ట్‌లో ఉన్నాను అని వ్యాఖ్యానించారు. ఈ పరిణామాల వేళ తుర్కియే నుంచి బయల్దేరిన ట్రంప్ తనకు ఇటీవల ఖతర్ కానుకగా ఇచ్చిన అధునాతన విమానాన్ని కాదని, మళ్లీ పాత విమానాన్నే వినియోగించడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఇరాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.






