11 July, 2026 | 1:52 AM

సుప్రీంకోర్టులో కలకలం

11-07-2026 12:09 AM

ధర్మాసనాన్ని ఆజ్ఞాపిస్తున్నా అంటూ పిటిషనర్ హల్‌చల్

గాలిలోకి పేపర్లు విసిరివేత

లైవ్‌లోనే జడ్జీలపై దుర్భాషలాడిన వ్యక్తి

సీజేఐపైనా అనుచిత వ్యాఖ్యలు

సదరు వ్యక్తిపై కోర్టు ధిక్కారణ చర్యలకు నిరాకరణ

న్యూఢిల్లీ, జూలై 10: సుప్రీం కోర్టులో శుక్రవారం ఓ పిటిషనర్ హల్‌చల్ చేశాడు. మిస్టర్ జ్యుడీషియల్ సర్వెంట్.. మిమ్మల్ని నేను ఆజ్ఞాపిస్తున్నా.. అంటూ గాలిలోకి పేపర్లు విసిరేశాడు. న్యాయమూర్తులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. సీజేఐపైనా అనుచిత వ్యాఖ్యలు చేశాడు.

అయితే సదరు వ్యక్తిపై కోర్టు ధిక్కారణ చర్యలకు దేశ అత్యున్నత న్యాయస్థానం నిరారిస్తూ.. అతనిపై సానుభూతి వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టులో శుక్రవారం దిగ్భ్రాంతికర సంఘటన చోటుచేసుకుంది. ఒక కేసు విచారణ జరుగుతున్న సమయంలో పిటిషనర్ కోర్టు హాల్‌లోనే వీరంగం సృష్టించాడు. ఈ ఘటనతో కోర్టు హాల్‌లో ఉన్నవారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అలహాబాద్ హైకోర్టు తన పిటిషన్‌ను కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ ప్రబల్ ప్రతాప్ అనే వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.

జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ అలోక్ అరాధేలతో కూడిన ధర్మాసనం ఎదుట శుక్రవారం విచారణకు వచ్చిం ది. లక్నో ఏసీపీ వికాస్ నగర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల్సిందిగా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరాడు. కోర్టు నిబంధనల ప్రకారం.. లైవ్ స్ట్రీమింగ్ అవుతున్న సమయంలోనే ఈ అవాంఛనీయ ఘటన జరిగింది. విచారణ ప్రారంభం కాగానే సదరు పిటిషనర్ తీవ్ర అగౌరవంగా మాట్లాడటం మొదలుపెట్టాడు.

‘మిస్టర్ జ్యుడీషియల్ సర్వెంట్, లక్నో ఏసీపీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని నేను మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాను’ అని నేరుగా బెంచ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. ఈ మాటలపై జస్టిస్ విశ్వనాథన్ తీవ్రంగా స్పందించారు. ‘నువ్వు మమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నావా?‘ అని గట్టిగా ప్రశ్నించారు. దానికి పిటిషనర్ స్పందిస్తూ.. అంతా రికార్డుల్లోనే ఉందని మొండిగా సమాధానం చెప్పాడు. ఆ వెంటనే పిటిషనర్ ఒక్కసారిగా తీవ్ర ఆగ్రహంతో రెచ్చిపోయాడు. తన చేతిలోని కాగితాలను కోర్టు హాల్‌లో న్యాయమూర్తుల వైపు విసిరేశాడు.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ గందరగోళం సృష్టించాడు. పరిస్థితి చేయి దాటిపోతుండటాన్ని గమనించిన సుప్రీంకోర్టు భద్రతా సిబ్బంది వెంటనే జోక్యం చేసుకున్నారు. అతడిని అడ్డుకుని, అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టు హాల్ వెలుపలికి పంపించేశారు. ఇంతటి ఉద్రిక్తత చోటుచేసుకున్నా కూడా న్యాయమూర్తులు ఎంతగానో సంయమనం పాటించారు. కోర్టు కార్యకలాపాలకు అంతరాయం కలిగించినప్పటికీ, సదరు వ్యక్తిపై కోర్టు ధిక్కారణ చర్యలు తీసుకోవడానికి నిరాకరించారు.