25 June, 2026 | 2:05 AM

ఇసుక మాఫియాపై ఉక్కుపాదం

25-06-2026 01:10 AM

పోలీస్ కమిషనర్ గౌస్ ఆలమ్ స్పెషల్ ఫోకస్

వారంలో 450 ట్రిప్పుల ఇసుక పట్టివేత

వందలాది వాహనాల సీజ్

అక్రమార్కుల గుండెల్లో గుబులు

కరీంనగర్, జూన్ 24 (విజయక్రాంతి): కరీంనగర్ గడ్డపై ఇసుక మాఫియా ఆటకట్టేలా పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం పంజా విసిరారు. మనేరు నదిని కామధేనువుగా మార్చుకుని, ప్రకృతిని నిలువునా చీల్చి, ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న ఇసుక దొంగల గుండెల్లో సిపి గౌష్ ఆలం పేరు వింటేనే వణుకు పుడుతోంది.

పచ్చని నదీ తీరాలను శ్మశానాలుగా మారుస్తూ, రాత్రికి రాత్రే ఇసుకను తరలించి కోట్లు గడిస్తున్న మాఫియా ఆగడాలకు చెక్ పెట్టేందుకు పోలీస్ బాస్ గౌష్ ఆలం అపర భగీరథుడిలా రంగంలోకి దిగారు. ఆయన వ్యూహాత్మక ఆదేశాలతో టాస్క్ఫోర్స్ పోలీసులు చేపట్టిన ‘స్పెషల్ డ్రైవ్స్’ ఇసుక మాఫియా సామ్రాజ్యాన్ని అడుగులతో సహా కదిలిస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి, వీణవంక, జమ్మికుంట మండలాలను కేంద్రంగా చేసుకుని సాగుతున్న ఈ అక్రమ దందాపై పోలీసులు జరిపిన మెరుపు దాడులు అక్రమార్కులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

కేవలం వారం రోజుల వ్యవధిలోనే 450 ట్రిప్పుల అక్రమ ఇసుక డంపులను పట్టుకుని, వందలాది వాహనాలను, ట్రాక్టర్లను సీజ్ చేసిన తీరు పోలీసుల ఉక్కుపాదానికి నిదర్శనం. మనేరు నదీ గర్భంలో లోతుగా తవ్వకాలు జరుపుతూ, భూగర్భ జలాలను అతలాకుతలం చేస్తున్న ఈ అరాచక శక్తులపై పోలీసులు డేగ కన్ను వేశారు. ఇసుక తరలింపులో కీలకంగా మారిన అడ్డదారులను మూసివేస్తూ, అనుమానిత ప్రాంతాల్లో నిరంతర నిఘాను పెంచారు.

వందలాది కేసులు నమోదు చేసి, నేరస్తులను కటకటాల వెనక్కి పంపిస్తున్న ఖాకీలు, ఈ దందా వెనుక ఉన్న అసలు సూత్రధారుల భరతం పట్టేందుకు సిద్ధమయ్యారు. ‘ప్రకృతిని దోచుకుంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది‘ అని హెచ్చరిస్తున్న కరీంనగర్ పోలీసులు, ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తున్నారు. అక్రమ రవాణా గురించి సమాచారం అందించే ప్రజల వివరాలను గోప్యంగా ఉంచుతామని హామీ ఇస్తూ, మాఫియా పీచమణించే వరకు ఈ ‘యుద్ధం’ కొనసాగుతుందని, అక్రమార్కులు ఇకనైనా పద్ధతి మార్చుకోకపోతే కఠినమైన శిక్షలు తప్పవని సిపి గౌష్ ఆలం యంత్రాంగం గట్టి సంకేతాలను పంపింది.