07-12-2025 01:32:17 AM
రికార్డు సమయంలో శస్త్రచికిత్సతో ప్రాణాలు కాపాడిన అమోర్ ఆస్పత్రి వైద్యులు
హైదరాబాద్, డిసెంబర్ 6 (విజయక్రాంతి): నగరంలో నిర్మాణంలో ఉన్న ఒక భవనం మూడో అంతస్తు నుంచి నవీన్ కుమార్ అనే ఓ భవన నిర్మాణ కార్మికుడు ప్రమాదవశాత్తు పడిపోయాడు. అతడి ఊపిరితిత్తుల్లోకి ఇనుప రాడ్లు గుచ్చుకుపోయి, వాటికి రంధ్రం పడింది. ఆ కార్మికుడికి అమోర్ ఆస్పత్రి వైద్యులు రికార్డు సమయంలో అత్యవసర శస్త్రచికిత్స చేసి, ప్రాణాలు నిలబెట్టారు. 42 ఏళ్ల వయసున్న నవీన్ కుమార్‌ను ఆస్పత్రికి తీసుకొచ్చేసరికి అతడి శరీరం నుంచి రెండు ఇనుప రాడ్లను తొలగించారు.
దాదాపు 2-3 లీటర్ల వరకు రక్తం పోవడం, ఊపిరితిత్తులకు-ఛాతీ గోడకు మధ్య రక్తం గడ్డకట్టడం, ఊపిరితిత్తులకు రంధ్రం పడడం... ఇన్ని సమస్యలు అతడికి ఉన్నాయి. శరవేగంగా రక్తం ఎక్కించి, రీససిటేషన్ చేశారు. గాయం చాలా పెద్దగా ఉన్నట్లు సీటీ స్కానింగ్లో తెలిసింది. దాంతో వెనువెంటనే అతడిని ఆపరేషన్ థియేటర్కు తరలించారు. వైద్యులు అతడికి అత్యవసరంగా థొరకాటమీ శస్త్రచికిత్స చేశారు. అతడి ఎడమ ఊపిరితిత్తిలోని శ్వాసకోశం పూర్తిగా ధ్వంసమైపోయింది.
దాంతో దాన్ని తొలగించాల్సి వచ్చింది. కానీ రక్తస్రావం చాలా ఎక్కువగా ఉండడంతో నవీన్ రక్తపోటు మరింతగా పడిపోసాగింది. ఫలితంగా రక్తం మరింత ఎక్కించారు. ఒక ఊపిరితిత్తి మాత్ర మే పనిచేస్తుండటంతో దాన్ని రక్షించేందుకు వెంటిలేషన్ వ్యూహాలను అమలు చేశారు. అతడికి ఆక్సిజన్ ఏమాత్రం అందకపోతున్నా కూడా మెదడు, ఇతర కీలక అవయ వాలు ఏవీ దెబ్బతినకుండా వైద్యబృందం చాలా కష్టపడింది.
అమోఆర్ ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్, ఆర్థో ఆంకాలజీ సర్జన్ డాక్టర్ కిశోర్ బి. రెడ్డి మాట్లాడుతూ, మేం చికిత్స చేసిన వాటిలో ఇది అత్యంత సంక్లిష్టమైన, సమస్యాత్మకమైన ట్రామా కేసు. మా అత్యవసర, సర్జికల్, ఎనస్థీషియా, క్రిటికల్ కేర్ బృందాల్లోని వైద్యులందరూ అద్భుతమైన సమన్వయంతో పనిచేసి అతడి ప్రాణాలు కాపాడారని అన్నారు. వైద్యబృందంలో శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ కళ్యాణ్, డాక్టర్ పూజిత, ఎమర్జెన్సీ బృందానికి చెందిన డాక్టర్ నందీప్, డాక్టర్ అశోక్, క్రిటికల్ కేర్ విభాగ నిపుణులు డాక్టర్ ప్రత్యూష, ఎనస్థీషియా నిపుణులు డాక్టర్ జగదీష్ కీలకంగా వ్యవహరించారు.