ఓయూ పీహెచ్‌డీ విద్యార్థుల డిజైన్ సెమినార్లలో అక్రమాలు
ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్, ఓయూ కార్యదర్శి లెనిన్
ముషీరాబాద్, జూన్ 25 (విజయక్రాంతి): ఉస్మానియా విశ్వవిద్యాలయం రసాయన శాస్త్ర విభాగంలో పీహెచ్.డి. పరిశోధక విద్యార్థుల డిజైన్ సెమినార్ల నిర్వహణలో అక్రమాలు జరిగాయని, ఉన్నత స్థాయి కమిటీ వేసి అధికార దుర్వినియోగనికి పాల్పడ్డ ప్రొఫెసర్లపై కఠిన చర్యలు తీసుకొని అఖిల భారత విద్యార్ధి సమాఖ్య (ఏఐఎస్‌ఎఫ్) రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్, ఓయు కార్యదర్శి ఐ లెనిన్ డిమాండ్ చేశారు.
ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వద్ద గురువారం పుట్ట లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ.. రసాయన శాస్త్ర విభాగంలో పీహెచ్.డి. పరిశోధక విద్యార్థుల డిజైన్ సెమినార్ల నిర్వహణలో అధికార దుర్వినియోగం జరిగిందని ఆరోపించారు. ఓయూ అదనపు పరీక్షల నియంత్రణాధికారి డా. కృష్ణంరాజు పర్యవేక్షణలో ఉన్న ఒక పీహెచ్.డి. విద్యార్థికి డిజైన్ సెమినార్ నిర్వహించకుండానే పూర్వ తేదీతో (ప్రీ -డేటెడ్) డిజైన్ సెమినార్ నివేదిక జారీ చేసారని, ఈ ప్రక్రియకు రసాయన శాస్త్ర విభాగాధిపతి, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యురాలు ప్రొఫెసర్ విజ్జులత, అలాగే రసాయన శాస్త్ర విభాగ బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్, ఎంఎంటీఎస్ డైరెక్టర్ ప్రొఫెసర్ విజయ్ కుమార్, విషయ నిపుణుడు ప్రో. సక్ రామ్ సహకరించారని తెలిపారు.
ఈ చర్యలు దేశంలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థగా పేరుగాంచిన ఓయూ ప్రతిష్టను దెబ్బతిస్తున్నాయన్నారు. ఈ సమావేశంలో ఏఐఎస్‌ఎఫ్ ఓయూ అధ్యక్షులు ఉప్పల్ ఉదయ్ కుమార్, సహాయ కార్యదర్శి ఆశ్వన్ కుమార్, ఉపాధ్యక్షులు దొంది రామ్, నేతలు సుమన్, మధు తదితరులు పాల్గొన్నారు.






