ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు
బిఆర్ఎస్ నాయకులు రాచకొండ గిరి..
సంస్థాన్ నారాయణపూర్ (విజయక్రాంతి): సంస్ధాన్ నారాయణపురం గ్రామంలోని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని, సగానికి పైగా అనర్హులకే ఇండ్లు కేటాయించారని బిఆర్ఎస్ పార్టీ నాయకులు రాచకొండ గిరి(BRS party leaders Rachakonda Giri) పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. భూములు ఉన్నవారికి అర్హత లేనివారికి ఇండ్లు కేటాయించారని ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించారనీ అన్నారు. ఎంతోమంది నిరుపేదలు ఇండ్లు లేక అద్దె ఇళ్లల్లో ఉంటున్న వారికి కాకుండా కాంగ్రెస్ నాయకులు ఎంపిక చేసిన లబ్ధిదారులనే అధికారులు జాబితా సిద్ధం చేశారని అన్నారు.
సంక్షేమ పథకాల ఎంపిక పారదర్శకంగా జరగాలని స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(MLA Komatireddy Rajagopal Reddy) చెబుతుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం వారి ఆదేశాలను విస్మరించి ఇష్టరీతిలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేయడం సిగ్గుచేటని ఆరోపించారు. ప్రజాపాలనలో ప్రభుత్వ అధికారుల పాత్ర పేక్షక పాత్ర గానే మిగిలిందని, దరఖాస్తుదారుని పూర్తి స్థితిగతులు, వివరాలు వాస్తవాలను తెలుసుకోకుండానే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇచ్చిన లిస్ట్ ఫైనల్ చేయడం చాలా బాధాకరమన్నారు.
ప్రజలు ప్రభుత్వ అధికారులను విశ్వసిస్తారని కానీ ప్రభుత్వ అధికారులు మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆదేశాలతో నడవడం నిజంగా బాధాకరం అన్నారు.ప్రజలు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పడం ఖాయమని అన్నారు. గ్రామాలల్లో బిఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, మళ్లీ కేసీఆర్ పాలనే తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.






