శ్రీ‘నిధి’ స్వాహాకు అడ్డేది!
- కోట్లలో అవకతవకలు
- ఆగని వీఓఏల చేతివాటం
- ఎల్బీనగర్‌లో రూ.35 లక్షలు, పొనుగోడులో రూ.22 లక్షల మాయం!
- ఆడిట్ లో తేలిన అవినీతి బాగోతం
- చోద్యం చూస్తున్న అధికారులు
గరిడేపల్లి, ఏప్రిల్ 10: పేద మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్రీనిధి పథకం కొందరికి మాత్రం క ల్పతరువులా మారింది. ఉన్నత లక్ష్యంతో అ మలు చేస్తున్న ఈ పథకం సంఘ బంధాల పరిధిలో పనిచేస్తున్న కొంతమంది వివోఏల చేతివాటంతో అవినీతిమయంగా మారింది ఆడల్లో సందేహం లేదు. మండల వ్యాప్తంగా శ్రీనిధి నిధుల్లో కోట్ల రూపాయల అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వినిపిస్తున్నా యి. అలాగే ’శ్రీనిధి స్వాహాకు అడ్డేది’ అనే ప్రశ్నలు స్థానికంగా వెలువెత్తుతున్నాయి.
ఆడిట్‌లో బయటపడ్డ బాగోతం !
మండలంలోని ఎల్బీనగర్, పొనుగోడు గ్రామాల్లో జరిగిన సోషల్ ఆడిట్లో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఎల్బీనగర్లో సుమారు roo.35 లక్షలు, పొనుగోడులో రూ. 22 లక్షల వరకు శ్రీనిధి లోన్లు పొందిన సమ భావన సంఘాల నుంచి వసూలు చేసిన డబ్బులను బ్యాంకులకు చెల్లించకుండా వీఓఏలు తమ వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న ఈ తంతులో కొందరు అధికారుల అండ కూడా ఉన్నట్లు వినిపిస్తుంది.
మూడు పువ్వులు- ఆరు కాయలుగా అవినీతి
మండలంలో గత ఐదు సంవత్సరాలుగా అవినీతి తతంగం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతూనే ఉంది. గతంలో కూడా ఇక్కడ అనేకమంది వివోఏలు కోట్ల రూపాయలను పక్కదారి పట్టించినట్లు బ యల్పడింది. సమ భావన సంఘం మహిళల వద్ద నెలవారి డబ్బులు వసూలు చేసిన ప్పుడు వారికి సంబంధిత బుక్లో నమోదు చేయాల్సి ఉంటుంది. అలాంటి బుక్కులు ఎవరు మెయింటైన్ చేయడం లేదు.
కొంతమంది వివోఏలు కార్యాలయం సిబ్బందితో చేతులు కలిపి తమకున్న రాజకీయ నాయకుల అండతో, పలుకుబడితో మహిళా సభ్యులు అందించిన లక్షల రూపాయలను వడ్డీలకు నడుపుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇట్టే అర్థమవుతుంది. కొంతమంది వివోఏలు తమ పరిధిలో ఉన్న సమ భావన సంఘాలను రొటేషన్ పద్ధతి లో ఒక నెల కొంతమంది సంఘాల డబ్బు లు చెల్లిస్తూ మిగిలిన సంఘాల డబ్బులు తన సొంత అవసరాలకు వాడుకుంటున్నారని సంఘ బంధాల్లోని మహిళలే చర్చించు కుంటున్నట్టు తెలుస్తుంది. కొంతమంది వివోఏలు వ్యవస్థలోని లోపాలను ఆధారంగా చేసుకొని ఈ అవినీతి బాగోతాన్ని యదేచ్చగా నడుపుతున్నారని సమాచారం. మండలంలోని కొన్ని గ్రామాల్లో వివోఏలు చేసిన మోసాలు బయటపడి పోలీస్ స్టేషన్ దాకా వెళ్లి ఫిర్యాదులు చేసుకున్న పరిస్థితులు లేకపోలేదు.
చర్యలు లేకనే చేజారిన పరిస్థితి
కొందరు వివోఏలు అవినీతికి పాల్పడ్డారన్న విషయం బట్టబయలు అయినప్పటికీ అధికారులు రికవరీ చేయాలన్న ఉద్దేశంతో వారిపై చర్యలు తీసుకోకపోవడంతోనే పరిస్థితి చేజారినట్లు తెలుస్తుంది. అలాగే మితి మీరిన రాజకీయ జోక్యంతో, నాయకుల ఫైరవీలతో కొంతమంది అధికారుల లాలూచీ తో అవినీతికి పాల్పడ్డ వివోఏలపై ఇంతవరకు ఎలాంటి చర్యలు లేకపోవడం గమనా ర్హం.
అలాగే సాధారణంగా బహిరంగంగా జరగాల్సిన సోషల్ ఆడిట్ను ఏప్రిల్ 4, 6 తేదీలలో సిబ్బంది గోప్యంగా నిర్వహించడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పలు ప్రశ్నలకు అధికారులు పొంతనలేని సమాధానాలు ఇస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుని అవినీతికి అవకాశం లేకుండా చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.




