హమాలీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఎమ్మార్వోకు వినతి
కోనరావుపేట,(విజయక్రాంతి): రాష్ట్ర పిలుపులో భాగంగా హమాలీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో గురువారం తాసిల్దార్ కు కార్మిక సంఘం నాయకులతో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం హమాలీ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందని, ప్రభుత్వం ఏర్పడి సుమారు 30 నెలలు గడిచినా ఇప్పటివరకు ఆ హామీ అమలుకు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.
వెంటనే హమాలీ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే 55 సంవత్సరాలు నిండిన హమాలీ కార్మికులకు సంక్షేమ పథకాలు, ఆర్థిక భద్రత కల్పించాలని, పని ప్రదేశాల్లో కనీస వసతులు ఏర్పాటు చేయాలని కోరారు. కార్మికుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే సానుకూలంగా స్పందించి డిమాండ్లను నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 24వ తేదీన కలెక్టరేట్ ముట్టడి, ధర్నా కార్యక్రమం నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి హమాలీ కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు లోకుర్తి రాజు, యాస శ్రీనివాస్, కార్మికులు మహేష్, నవీన్, సత్యం తదితరులున్నారు.






