ఇందిరమ్మ రాజ్యంలో రైతును రాజు చేస్తాం
- మీ ఇంటి బిడ్డగా సమస్యలు తీరుస్తా
- మంత్రి పొంగులేటి
పాలేరు, జూన్ 23: ఇందిరమ్మ రాజ్యంలో రైతును రాజుగా చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వ అడుగులు పడుతున్నాయని, అందులో భాగంగానే రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేసి తీరుతామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన కూసుమంచి మండలంలోని ముత్యాలగూడెం, చేగోమ్మ, తురకగూడెం, కూసు మంచి, జుజ్జులరావుపేట, మల్లాయిగూడెం గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాలేరు నియోజక ప్రజల ఆశీసులతోనే మంత్రిని అయ్యానని, మీ ఇంటి పెద్దకొడుకుగా ప్రతీ సమస్యను తీరుస్తానని హామీ ఇచ్చారు.
గత ప్రభుత్వం చేసిన అప్పులకు నేడు వడ్డీలు చెల్లిస్తూ కూడా తమ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పాటుపడుతున్నదన్నారు. సంవత్సరంలోపే అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు, నిరుపేదలకు తొలి విడతలో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని తెలిపారు. ముత్యాలగూడెం, చేగోమ్మ గ్రామా ల్లో గత ప్రభుత్వ అండతో అక్రమంగా పాస్‌బుక్‌ల ద్వారా భూమిని దక్కించుకున్నారని ఫిర్యాదు చేయగా, రెవెన్యూ యాక్ట్ ద్వారా సర్వే జరిపించి అట్టి పాస్‌బుక్‌లను రద్దు చేయాలని అక్కడే ఉన్న అధికారులను ఆదేశించారు.
కూసుమంచి మండల కేంద్రంలో 30పడకల ఆస్పత్రి చేయాలని కోరారని అంతకు మించి శుభవార్తను అతి త్వరలో తెలుపుతానన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల, టెక్నికల్ కళాశాల్లో ఈ సంవత్సరమే అడ్మిషన్లు ప్రారం భించాలని అధికారులను ఆదేశించారు. త్వరలోనే బస్‌షెల్టర్‌ను ఏర్పాటు చేస్తామని హమీ ఇచ్చారు. ఆయనవెంట మద్దినేని స్వర్ణకుమారి, రాయల నాగేశ్వరరావు, ఎంపీపీ బాణోత్ శ్రీనివాస్, ఎంపీటీసీ మాదాసు ఉపేందర్, నాయకులు ఎండి.హఫీజుద్దీన్, జొన్నల గడ్డ రవి, మాజీ ఎంపీపీ ఆర్.వెంకటరెడ్డి, మంకేన వాసు తదితరులు పాల్గొన్నారు.
మానవత్వం చాటుకున్న పొంగులేటి
సూర్యాపేట: ఖమ్మం జిల్లా పర్యటనను ముగించుకుని ఆదివారం సాయంత్రం మంత్రి హైద్రాబాద్‌కు తిరిగి వెళ్తున్న క్రమంలో సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల కేంద్రంలో కారును ద్విచక్రవాహనం ఢీనడంతో ద్విచక్రవాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన మంత్రి తన కాన్వాయిని నిలిపి, కాన్వాయిలోని ఓ వాహనంలో క్షతగాత్రున్ని ప్రైవేటు దవాఖానకు తరలించి చికిత్స అందేలా చేశారు. బాధిత కుటుంబ సభ్యులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.






