21 July, 2026 | 11:21 AM

బీసీలకు కోటా సాధ్యమేనా?

21-07-2026 12:00 AM

టీ.చిరంజీవులు :

* పార్లమెంట్ సమావేశాలు సోమవారం నాడు ప్రారంభమయ్యాయి. గత 15 నెలలుగా కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో పెండింగ్‌లో ఉన్న తెలంగాణ 42% బీసీ రిజర్వేషన్ బిల్లులు ఈ సమావేశాల్లో అయినా చర్చకు వస్తాయా? అనే ఆశతో బీసీ సమాజం ఎదురుచూస్తోంది. అయితే ఈ కీలక అంశంపై రాష్ట్ర ప్రభుత్వం గాని, కేంద్ర ప్రభుత్వం గాని ఇప్పటివరకు తగిన చొరవ చూపలేదు.

బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ హామీని చట్టబద్ధంగా అమలు చేయించే దిశగా కేంద్రంపై అవసరమైన ఒత్తిడి తీసుకురావడంలో విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు, 50% రిజర్వేషన్ పరిమితిని పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని బహిరంగంగా చెప్పిన ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ కూడా పార్లమెంట్‌లో ఈ అంశాన్ని ప్రాధాన్యంగా ప్రస్తావించకపోవడం బీసీలలో నిరాశను కలిగిస్తోంది.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా తెలంగాణలోని సుమారు 2 కోట్ల బీసీ ప్రజల ఆకాంక్షలకు సంబంధించిన ఈ అంశంపై స్పష్టమైన నిర్ణయం తీసుకోకుండా ఇతర  అంశాలకే ప్రాధాన్యం ఇస్తోందనే భావన బీసీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. 

న్యాయస్థానాలు గతంలో అనేక సందర్భాలలో తమ తీర్పులను   వాపస్ తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ప్రశ్న ఒక్కటే, తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్లు చట్టబద్ధంగా సాధ్యమేనా? ఇది దాటకూడని లక్ష్మణ రేఖనా? అలాంటప్పుడు 42% రిజర్వేషన్ల అమలుకు రాజ్యాంగపరమైన, న్యాయపరమైన మార్గాలు ఏమిటి? 50% పరిమితి నేపథ్యంలో వాటిని ఎలా సాధించవచ్చు? ఈ డిమాండ్ రాజ్యాంగబద్ధంగా సాధ్యమా? దీనికి సం బంధించిన సుప్రీంకోర్టు తీర్పులు, రాజ్యాంగ నిబంధనలు, తమిళనాడు అనుభవం, తెలంగాణ పరిస్థితులు ఏమంటున్నాయో ఒకసారి పరిశీలిద్దాం.

భారత రాజ్యాంగం సమానత్వాన్ని ప్రాథమిక హక్కుగా గుర్తించినప్పటికీ, సామాజిక న్యాయాన్ని ఆత్మగా స్వీకరించింది. శతాబ్దాలుగా విద్య, ఉపాధి, రాజకీయ అధికారంలో వెనుకబడిన వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడమే రిజర్వేషన్ల ప్రధాన ఉద్దేశం. అందువల్ల రేజర్వేషన్ పేదరిక నిర్ములన కార్యక్రమం కాదు, అది సామాజిక, విద్యాపరమైన వెనుకబాటుతనాన్ని సరిదిద్దే రాజ్యాంగ సాధనం.

తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కులగణన 2024 ప్రకారం బీసీ లు రాష్ట్ర జనాభాలో సుమారు 56.33% ఉన్నారు. ఈ నేపథ్యంలో విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం రెండు బిల్లులను గవర్నర్ వద్ద ఆమోదింపజేసి, 2025 ఏప్రిల్‌లో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రపతి ఆమోదం కోసం, 9వ షెడ్యూల్‌లో చేర్చటానికి  పంపింది. కేంద్రం వద్ద గత 15 నెలలుగా ఇది పెండింగ్‌లో ఉంది. 

రిజర్వేషన్లకు ఆధారం రాజ్యాంగం: భారత రాజ్యాంగంలోని అనేక నిబంధనలు రిజర్వేషన్లకు స్పష్టమైన రాజ్యాంగ బలం కల్పిస్తున్నాయి. 1. ఆర్టికల్ 14- సమానత్వ హక్కు. 2.ఆర్టికల్ 15(4), 15(5)- సామాజిక, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు విద్యలో ప్రత్యేక రిజర్వేషన్లు. 3.ఆర్టికల్ 15(6), 16(6)- ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు. 4.ఆర్టికల్ 16(4)- ప్రభుత్వ ఉద్యోగాలలో తగిన ప్రాతినిధ్యం లేని వెనుకబడిన వర్గాలకు తగిన రిజర్వేషన్లు.

5.ఆర్టికల్ 16(4ఏ), 16 (4బీ)- ఎస్సీ/ఎస్టీలకు పదోన్నతులలో రిజర్వేషన్లు, బ్యాక్‌లాగ్ ఖాళీలు. 6. ఆర్టికల్ 243డీ, 243టీ-స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు. 7. ఆర్టికల్ 340, 342- ఎస్సీ/ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం లోక్‌సభ, శాసనసభలలో సీట్లు రిజర్వు చేయటం. 8. ఆర్టికల్ 334-లోక్‌సభ, శాసనసభలలో రిజర్వేషన్లు మొదట 10 సంవత్సరాల కాలానికే కల్పించారు. తదనంతరం ప్రతి పదేళ్లకు ఒకసారి వాటిని సవరణ ద్వారా పొడిగిస్తూ వస్తున్నారు.

అయితే కొంతమంది విద్యా, ఉద్యోగాలలోని రిజర్వేషన్లు కూడా 10 సంవత్సరాలకు మాత్రమే అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి ఆర్టికల్ 15, 16లలో కల్పించిన విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లకు ఎలాంటి కాలపరిమితి లేదు. అవి శాశ్వతమైన సామాజిక, న్యాయ చర్యలుగా ప్రాథమిక హక్కులుగా రాజ్యాంగంలో ఉన్నాయి.

రిజర్వేషన్లు సమానత్వానికి విరుద్ధం కావు: రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 అందరికీ సమానత్వాన్ని హామీ ఇస్తుంది. కానీ సమానత్వం అంటే అందరికీ ఒకే విధమైన వ్యవహారం కాదని సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో వివరించింది. ఉదాహరణకు, ఇద్దరు విద్యార్థులు ఉన్నారని అనుకుందాం. ఒకరు అన్ని సౌకర్యాలు ఉన్న కుటుంబంలో చదివారు. మరొకరు పేద గ్రామంలో, పాఠశాల కూడా సరిగా లేని పరిస్థితుల్లో చదివారు. ఇద్దరికీ ఒకే పరీక్ష పెట్టి ఇదే సమానత్వం అనడం వాస్తవ సమానత్వం కాదు. అందుకే ఆధునిక రాజ్యాంగాలు రూపక సమాన త్వం కంటే వాస్తవ సమానత్వానికి ప్రాధాన్యం ఇస్తాయి. భారత రాజ్యాంగం కూడా ఇదే మార్గాన్ని అనుసరించింది.

అంబేద్కర్ దృక్పథం: అంబేద్కర్ దృష్టిలో రాజకీయ ప్రజాస్వామ్యం మాత్రమే సరిపోదు. సామాజిక ప్రజాస్వామ్యం లేకపోతే రాజకీ య ప్రజాస్వామ్యం కూడా నిలవదని ఆయన హెచ్చరించారు. 1949 నవంబర్ 25న రాజ్యాంగ సభలో ఆయన చేసిన ప్రసంగంలో ఒక గొప్ప హెచ్చరిక చేశా రు: రాజకీయ సమానత్వం ఉన్నా, సామాజిక, ఆర్థిక అసమానతలు కొనసాగి తే, అవి ఏదో ఒకరోజు ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేస్తాయని అన్నారు.

అందువల్ల రాజ్యాంగం కేవలం ఓటుహక్కును మాత్రమే ఇవ్వలేదు. సామాజిక న్యాయాన్ని సాధించడానికి ప్రత్యేక రాజ్యాంగ నిబంధనలను కూడా చేర్చింది. ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్ట్ పూర్వ ప్రధానన్యాయమూర్తి చంద్రచూడ్ BRUT టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ దేశంలో సామాజిక సమతుల్యం సాధించటం లో రిజర్వేషన్లు ప్రధానపాత్ర పోషించాయని తన అభిప్రాయాన్నివ్యక్తపరిచారు.  

రాజ్యాంగ లక్ష్యం-సంక్షేమ రాజ్యం: భారత రాజ్యాంగ పీఠికలోనే సామాజి క, ఆర్థిక, రాజకీయ న్యాయం అనే మూడు లక్ష్యాలను ప్రకటించారు. 1.ఆర్టికల్ 38 ప్రకారం: సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం ఆధారంగా ఒక సామాజిక వ్యవస్థను నిర్మించాలి. 2.ఆర్టికల్ 39(బీ), (సీ) ప్రకారం: దేశ సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కాకూడదు. వనరులు సమాజ ప్రయోజనానికి ఉపయోగపడాలి. 3.ఆర్టికల్ 46 ప్రకారం: సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల విద్యా, ఆర్థిక ప్రయోజనాలను ప్రత్యేకంగా ప్రోత్సహించాలి. ఈ ఆదేశ సూత్రాలు రిజర్వేషన్లకు నైతిక, రాజ్యాంగపరమైన పునాదిని కల్పిస్తాయి.

ప్రపంచంలో ఇలాంటి విధానాలున్నాయా?: అమెరికాలో అఫర్మేటివ్ యాక్ష న్, దక్షిణాఫ్రికాలో బ్లాక్ ఎకనామిక్ ఎంపవర్‌మెంట్, బ్రెజిల్‌లో విశ్వవిద్యాల య కోటాలు, మలేషియాలో భూమి పుత్ర విధానం, దక్షిణాఫ్రికా 1996 రిజర్వేషన్ వంటి  ప్రత్యేక చర్యలను అనేక దేశాలు చారిత్రక అసమానతలను తగ్గించడానికి చేపట్టాయి. అంటే, ఇది భారతదేశ ఆలోచన కాదు; చారిత్రక అన్యాయాలను సరిదిద్దడానికి ప్రపంచవ్యాప్తంగా అనుసరించే ప్రజాస్వామ్య విధానం. అవి వాస్తవ సమానత్వం సాధించడానికి రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక చర్యలు.

మెరిట్ అంటే ఏమిటి?: రిజర్వేషన్ల వ్యతిరేకులు తరచుగా మెరిట్ దెబ్బతింటుందని అంటారు. కానీ ఒక విద్యార్థి అంతర్జాతీయ పాఠశాలలో చదివి పరీక్ష రాస్తే, మరొక విద్యార్థి ఉపాధ్యాయులు కూడా లేని ప్రభుత్వ పాఠశాలలో చది వి అదే పరీక్ష రాస్తే  ఇద్దరి మార్కులను మాత్రమే చూసి మెరిట్ నిర్ణయించడం న్యాయమా? అందుకే సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో మెరిట్‌ను సామాజిక అవకాశాల నుంచి వేరుచేసి చూడలేమనే భావనను గుర్తించింది. అవకాశమూ మెరిట్ నిర్మాణంలో భాగమే. నిజానికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వచ్చిన తర్వా త అన్ని పోటీ పరీక్షలలో జనరల్ కేటగిరి వారి మెరిట్ ఓబీసీల కంటే చాలా తక్కువ. మెరిట్ గురించి మాట్లేడే నైతికత ఇప్పుడు ఆధిపత్య కులాలకు లేదు.

రిజర్వేషన్లు ఎందుకు అవసరం?: విద్యలో ప్రాతినిధ్యం పెంచడం, ప్రభుత్వ ఉద్యోగాల్లో తగిన అవకాశాలు కల్పించడం, పరిపాలనలో అన్ని వర్గాల భాగస్వామ్యాన్ని పెంచడం, సామాజిక న్యాయాన్ని సాధించడం, వివక్ష ప్రభావాన్ని తగ్గించడం, ప్రజాస్వామ్యాన్ని సమగ్రంగా మార్చడం రిజర్వేషన్ల లక్ష్యాలు. అందువల్ల రిజర్వేషన్ వ్యక్తిగత పేదరికాన్ని కాకుండా సామాజికంగా వెనుకబడిన వర్గాల వెనుకబాటుతనాన్ని పరిష్కరించడానికి ఉద్దేశించిన రాజ్యాంగ సాధనం.

50% పరిమితి ఎలా వచ్చింది?: రాజ్యాంగంలో ఎక్కడా రిజర్వేషన్లు 50% మించకూడదనే నిబంధన లేదు. ఈ పరిమితి పూర్తిగా న్యాయ స్థానాల వ్యాఖ్యల ద్వారా అభివృద్ధి చెందింది. 1.ఎం.ఆర్ బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ (1962): ఈ కేసులో సుప్రీంకోర్టు మొదటిసారిగా సాధారణ పరిస్థితుల్లో రిజర్వేషన్లు 50% మించరాదని వ్యాఖ్యానించింది. 2.స్టేట్ ఆఫ్ కేరళ వర్సెస్ ఎన్.ఎం థామస్ (1976): ఈ కేసులో న్యాయమూర్తులు జస్టిస్ వి.ఆర్.కృష్ణ అయ్యర్, జస్టిస్ ఓ.చిన్నప్ప రెడ్డి సమానత్వం అంటే అందరికి ఒకే విధంగా వ్యవరించడం కాదని సబ్‌స్టెంటివ్ జస్టిస్ అని పేర్కొంటూ చారిత్రక అసమానతలను తొలగించడానికి ప్రత్యేక చర్యలు అవసరమని స్పష్టంగా చెప్పారు.

రాజ్యాంగం సామజిక న్యాయం లక్ష్యంగా పెట్టుకున్నందున, రిజర్వేషన్లను కఠిన సంఖ్యా పరిమితులతో నిర్బంధించడం సరైంది కాదని సూచించారు. 3. అలాగే జస్టిస్ ఓ.చిన్నప్ప రెడ్డి కె.సి. వసంత్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక 1985 కేసులో కూడా అభిప్రాయపడ్డారు. 4.ఇంద్రా సాహ్నీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (1992): మండల్ కేసుగా ప్రసిద్ధి చెందిన ఈ తీర్పులో తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనం 27% ఓబీసీ రిజర్వేషన్లను సమర్థించింది.

సాధారణ పరిస్థితుల్లో 50% పరిమితిని కొనసాగించినప్పటికీ, అసాధారణ పరిస్థితుల్లో ఈ పరిమితిని అధిగమించవచ్చని స్పష్టంగా పేర్కొంది. 50% పరిమితి సంపూర్ణ నిషేధం కాదని, ప్రత్యేక పరిస్థితుల్లో మినహాయింపులు సాధ్యమని ఈ తీర్పు చెబుతుంది (పేరా  810). 5.ఎం.నాగరాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (2006): ఈ కేసులో పదోన్నతుల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ప్రభుత్వాలు కొలిచే గణాంకాలు (క్వాంటిఫైయబుల్ డేలా) ఆధారంగా వెనుకబాటుతనం, తగిన ప్రాతినిధ్యం లేకపోవడం వంటి అంశాలను నిరూపించాల్సిన అవసరాన్ని స్పష్టం చేసింది.

అందువల్ల కులగణన వంటి విశ్వసనీయ గణాంకాలు అత్యంత కీలకమైనవి. 6.జర్నైల్ సింగ్ (2018): నాగరాజ్ తీర్పులోని కొన్ని అంశాలను సవరించిన ఈ తీర్పు, గణాంక ఆధారిత నిర్ణయాల ప్రాముఖ్యతను మరోసారి పునరుద్ఘాటించింది. 7. ఎస్సీ, ఎస్టీ, బీసీలు కాని ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాలు ఈడబ్ల్యూఎస్ తీర్పు: జన్‌హిత్ అభియాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (2022) 103వ రాజ్యాంగ సవరణ ద్వారా 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను సుప్రీంకోర్టు సమర్థించింది.

50% పరిమితిరాజ్యాంగ మౌలిక సూత్రం కాదని కోర్టు తీర్పు ఇచ్చింది. దీని వలన అనేక రాష్ట్రాలలో రిజర్వేషన్లు 50%  సీలింగ్ పరిమితిని దాటాయి. ఇప్పటికే భారత దేశంలోని చాలా రాష్ట్రాలలో ఈడబ్ల్యూఎస్ కాక 50% దాటి రిజర్వేషన్లు ఉన్నాయి. ఉదాహరణకు 80% ఉన్న రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్ వంటి ట్రైబల్ స్టేట్‌లలో ఈడబ్ల్యూఎస్, బీసీలకు రిజర్వేషన్ లేదు. సిక్కిమ్ 90%, (బీసీలకు 40%, ఈడబ్ల్యూఎస్‌కు 5%), ఛత్తీస్‌గఢ్ 58%, తెలంగాణ 54%, కర్ణాటక 56%, తమిళనాడు 69% (ఇక్కడ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు లేవు).

9వ షెడ్యూల్-తెలంగాణ 42% రిజర్వేషన్లు: అయితే ఐ.ఆర్ కోయెల్హో వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు (2007) తీర్పులో సుప్రీంకోర్టు ఒక కీలక సూత్రాన్ని ప్రకటించింది. 9వ షెడ్యూల్‌లో చేర్చిన చట్టాలు కూడా రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణాన్ని ఉల్లంఘిస్తే న్యాయ సమీక్షకు లోబడతాయని పేర్కొంది. అంటే, 50% సీలింగ్ దాటడం రాజ్యాంగ మౌలిక సూత్రానికి వ్యతిరేకం కాదు. కాబట్టి 9వ షెడ్యూల్‌లో చేర్చడం వల్ల రక్షణ లభిస్తుందని చెప్పడంలో ఎలాంటి ఇబ్బంది లేదు. 9వ షెడ్యూల్‌లో ఇప్పటికి 284 చట్టాలు చేర్పించగా ఏ ఒక్క చట్టాన్ని సుప్రీంకోర్ట్ కొట్టివేయలేదనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. 

తెలంగాణలో 42% అవకాశాలు: తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కులగణనలో బీసీల జనాభా 56.33%  ఉన్నట్లు ప్రకటించింది. అలాంటి  పరిస్థితులలో తెలంగాణ ఒక అసాధారణ పరిస్థితులున్న రాష్ట్రంగా ప్రభుత్వం ఒక కేసు ను నిర్మించాలి. ఎందుకంటే ఇక్కడ 88% జనాభా అనగా.. ఎస్సీలు 18%, ఎస్టీ లు 10%, బీసీలు 56.33% ఉన్నారు. వారి వెనుకబాటుతనం, తగిన ప్రాతిని ధ్యం లేమి, సామాజిక న్యాయం వంటి అంశాలను పటిష్టంగా నిరూపించగలిగితే, రాజ్యాంగ పరిధిలో 42% రిజర్వేషన్ కోసం బలమైన వాదన నిర్మించవచ్చు. మనం ఇక్కడ అడుగుతున్నది తగినంత ప్రాతినిధ్యమే గాని దామాషా రిజర్వేషన్లు కావనే విషయాన్ని న్యాయస్థానాలకు స్పష్టం చేయాలి.

స్థానిక సంస్థలలో అడ్డంకులెందుకు?: స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే ప్రయత్నం చేసింది. అయితే హైకోర్టు ముందు సమగ్ర కులగణన నివేదిక, అవసరమైన గణాంక ఆధారాలు సమర్పించలేదనే అంశం ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. అందువలన భవిష్యత్తులో ప్రభుత్వం  కులగణన గణాంకాలు కోర్టుల ముందు సంపూర్ణంగా , పారదర్శకంగా ఉంచాలి. చట్టపరమైన ప్రమాణాలు పాటిస్తే పరిస్థితి భిన్నంగా ఉండే అవకాశం ఉంది.

న్యాయ వ్యవస్థ పారదర్శకత: కొన్ని సందర్భాల్లో బలమైన రాజ్యాంగ, న్యాయ వాదనలు ఉన్నప్పటికీ ఆశించిన ఫలితాలు రావడం లేదు. దీనికి న్యాయవ్యవస్థలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రాతినిధ్యం తక్కువగా ఉండటం కూడా కారణమని నిపుణులు భావిస్తున్నారు. దీంతో సామాజిక న్యాయానికి సంబంధించిన కొన్ని తీర్పులు వెనుకబడిన వర్గాల ఆశలకు అనుగుణంగా లేకపోవడం పట్ల ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

103వ రాజ్యాంగ సవరణతో వచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 50 శాతం పరిమితిని దాటినా, సుప్రీంకోర్టు వాటిని సమర్థించింది. కొందరు న్యాయమూర్తులు దీనిపై భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో 50 శాతం పరిమితిపై కొత్త చర్చ మొదలైంది. న్యాయవ్యవస్థలో విస్తృత సామాజిక ప్రాతినిధ్యం అవసరం కూడా చర్చలోకి వచ్చింది.

పరిపాలన సామర్థ్యం దెబ్బతింటుందా?: ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేష న్లు 50% మించి ఉంటే ప్రతిభ, పరిపాలనా సామర్థ్యం దెబ్బతిని అల్లకల్లోలం ఏర్పడుతుందని కొందరు మేధావులు వాదిస్తుంటారు. అయితే ఈ వాదనకు స్పష్టమైన, సార్వత్రిక ఆధారాలు లేవు. ఒక రాష్ట్రంలో రిజర్వేషన్ల శాతం ఎక్కువగా ఉండటం మాత్రమే పరిపాలనా నాణ్యత లేదా ఆర్థికాభివృద్ధిని నిర్ణయించే అంశం కాదు.

పరిపాలనా వ్యవస్థ, విద్యా ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అభివృద్ధి, మానవ వనరుల నాణ్యత వంటి అనేక అంశాలు కలిసి ఫలితాలను నిర్ణయిస్తాయి. తమిళనాడులో ఎంజీ రామచంద్రన్ 1980లో రిజర్వేషన్లను 68 శాతానికి పెంచారు. తర్వాత కరుణానిధి 1990లో 69 శాతానికి పెంచారు. అయినప్పటికీ, తమిళనాడు దేశంలోని పారిశ్రామిక, విద్యా, ఆరోగ్య, మానవాభివృద్ధి సూచీలలో ప్రముఖ రాష్ట్రాలలో ఒకటిగా నిలిచింది.

తయారీరంగం, ఆటోమొబైల్ పరిశ్రమలు, ఆరోగ్య సేవలు, ఉన్నత విద్య వంటి రంగాల్లో ఆ రాష్ట్రం గణనీయమైన పురోగతి సాధించింది. ఈ అనుభవం, ఎక్కువ రిజర్వేషన్లు ఉండటం మాత్రమే పరిపాలనా సామర్థ్యాన్ని తప్పనిసరిగా దెబ్బతీస్తుందన్న వాదన తప్పు అని తెలియజేస్తుంది.

30% పరిమితి- అంబేద్కర్: కొంతమంది అంబేద్కర్ రాజ్యాంగ సభలో రిజర్వేషన్లు 30% మించకూడదని చెప్పారని ప్రచారం చేస్తుంటారు.  సమాన అవకాశాలు, పరిపాలనా సామర్థ్యాన్ని సమతుల్యం చేసే అంశాలపై మాత్రమే ఆయన చర్చించారు. మైనారిటీ ఆఫ్ సీట్స్ వ్యాఖ్య అసలు అర్థం, ఆయన మాటల సారాంశం ఇలా ఉంది: ఒకవైపు సమాన అవకాశాల సూత్రం కొనసాగాలి. మరోవైపు చారిత్రకంగా వెనుకబడిన వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలి.

ఈ రెండు లక్ష్యాల మధ్య సమతుల్యత అవసరం. ఈ సందర్భంలోనే ఆయన ‘Reservation should be confined to a minority of sea ts’ అనే భావనను వ్యక్తం చేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటం టే: ఆయన 30% అనే సంఖ్యను రాజ్యాంగంలో ప్రతిపాదించలేదు. 40%, 50% లేదా మరే నిర్దిష్ట శాతాన్ని కూడా రాజ్యాంగ పరిమితిగా నిర్ణయించలేదు. ఆయన ఉద్దేశం సమాన అవకాశాల సూత్రం పూర్తిగా నిర్వీర్యం కాకుండా సమతుల్యత పాటించాలన్నది మాత్రమే. 

తెలంగాణలో 42% అనేది అసాధారణ  పరిస్థితులు ఉన్న నేపథ్యంలో తగినంత ప్రాతినిధ్యం కింద అడుగుతున్న న్యాయబద్ధమైన డిమాండ్.

ఆర్టికల్ 16(4) మినహాయింపా? ప్రత్యేక నిబంధనా?: సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో, ముఖ్యంగా ఎన్.ఎం థామస్, తరువాతి తీర్పుల్లో, ఆర్టికల్ 16(4) అనేది కేవలం ఆర్టికల్ 16(1)కు మినహాయింపు మాత్రమే కాదని, సమాన అవకాశాలను వాస్తవంగా అమలు చేయడానికి ఉద్దేశించిన ప్రత్యేక రాజ్యాంగ నిబంధన అని వివరించింది.

రాజకీయ సంకల్పం కూడా అవసరం: తెలంగాణ ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లును కేంద్ర ప్రభుత్వానికి పంపినప్పటికీ, అది ఇప్పటికీ రాష్ట్రపతి ఆమోదం పొందలేదు. దీనికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన, ఇతర కీలక విధాన అంశాలపై దృష్టి సారిస్తున్నప్పటికీ, తెలంగాణలోని  రెండు కోట్ల బీసీ ప్రజలకు సంబంధించిన ఈ బిల్లుపై అదే స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వకపోవడమేనని విమర్శలు వినిపిస్తున్నాయి.

అదే సమయంలో, రాష్ట్ర ప్రభుత్వం మెట్రో రైలు వంటి అభివృద్ధి ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని, అవసరమైన ఒత్తిడి తీసుకొచ్చి అనుకూల నిర్ణయాలను సాధించేందుకు కృషి చేస్తున్నది. అయితే బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ల బిల్లు విషయంలో మాత్రం అదే స్థాయి పట్టుదల, సమన్వయం, రాజకీయ ఒత్తిడి కనిపించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెండు ప్రభుత్వాలు అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కలిసి పనిచేయగలిగినప్పుడు, బీసీల హక్కులకు సంబంధించిన ఈ కీలక అంశంలో కూడా అదే చొరవ చూపాలని బీసీ సమాజం కోరుతోంది.

42% రిజర్వేషన్ అనేది కేవలం రాజకీయ నినాదం కాదు; ఇది రాజ్యాంగం ప్రసాదించిన సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, ప్రజాస్వామ్య ప్రాతినిధ్యం అనే విలువలకు సంబంధించిన అంశం. భారత రాజ్యాంగంలో 50% రిజర్వేషన్ల పరిమితి అనే స్పష్టమైన నిబంధన లేదు. అది సుప్రీంకోర్టు తీర్పుల ద్వారా అభివృద్ధి చెందిన ఒక న్యాయసూత్రం మాత్రమే. అదే సమయంలో, అసాధారణ పరిస్థితుల్లో తగిన గణాంకాలు, బలమైన ఆధారాలు, రాజ్యాంగబద్ధమైన చట్టనిర్మాణం ఉంటే మినహాయింపులకు అవకాశం ఉందని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసింది.

తమిళనాడులో 69% రిజర్వేషన్ల అమలు, ఇంద్రా సాహ్నీ, ఎం. నాగరాజ్, ఐ.ఆర్. కోయెల్హో, ఈడబ్ల్యూఎస్ తీర్పులు మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తున్నాయి. సామాజిక న్యాయాన్ని విస్తరించడానికి రాజ్యాంగం మూసివేసిన తలుపు కాదు; శాస్త్రీయ గణాంకాలు, సమగ్ర చట్టనిర్మాణం, పారదర్శక విధానాలు, ప్రజాస్వామ్య సంకల్పం ఉంటే రాజ్యాంగం మార్గాలను చూపిస్తుంది. అందువల్ల తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్ల సాధనకు మూడు అంశాలు అత్యంత కీలకం. మొదటిది విశ్వసనీయ కుల, సామాజిక, విద్యా, ఆర్థిక గణాంకాలు. రెండవది, రాజ్యాంగబద్ధమైన, న్యాయపరంగా బలమైన చట్టనిర్మాణం. మూడవది, దృఢమైన రాజకీయ సంకల్పం.

అయితే చరిత్ర చెబుతున్న గొప్ప సత్యం ఏమిటంటే, ప్రజా ఉద్యమం లేకుండా ఏ సామాజిక హక్కూ సాధించబడలేదు. ఓటు హక్కు నుంచి విద్యా హక్కు వరకు, రిజర్వేషన్ల నుంచి రాజకీయ ప్రాతినిధ్యం వరకు ప్రతి హక్కు ప్రజల సంఘటిత పోరాట ఫలితమే. అదే విధంగా 42% బీసీ రిజర్వేషన్లు కూడా కేవలం ప్రభుత్వాల దయతో రావు; ప్రజాస్వామ్యబద్ధమైన, శాంతియుతమైన, రాజ్యాంగబద్ధమైన ఉద్యమం ద్వారానే సాధ్యమవుతాయి.

ప్రత్యేకంగా బీసీ యువత ఈ చారిత్రక బాధ్యతను గుర్తించాలి. చదువులో, ఉద్యోగాల్లో, ప్రజా జీవితంలో ముందుకురావడంతో పాటు, రాజ్యాంగంపై అవగాహన పెంచుకోవాలి. గణాంకాలను అధ్యయనం చేయాలి. సామాజిక వాస్తవాలను ప్రజలకు వివరించాలి. ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉద్యమాన్ని బలోపేతం చేయాలి. ఉద్యమం ఎంత బలంగా ఉంటే, సామాజిక న్యాయం అంత దగ్గర అవుతుంది.

అంతిమంగా చెప్పాలంటే 42% బీసీ రిజర్వేషన్లకు తుది సమాధానం రాజకీయ నినాదాల్లో లేదు; రాజ్యాంగంలో ఉంది. కేవలం వాదనల్లో లేదు; శాస్త్రీయ గణాంకాల్లో ఉంది. కేవలం కోర్టు తీర్పుల్లో లేదు; ప్రజల సంఘటిత సంకల్పం లో ఉంది. కేవలం ప్రభుత్వ నిర్ణయాల్లో లేదు; చైతన్యవంతమైన బీసీ సమాజం నిర్మించే ప్రజా ఉద్యమంలో ఉంది. గణాంకాలు మన బలం, రాజ్యాంగం మన ఆయుధం, సామాజిక న్యాయం మన లక్ష్యం, సంఘటిత ఉద్యమమే మన విజయం.

 వ్యాసకర్త: విశ్రాంత ఐఏఎస్, బీసీ ఇంటెలెక్చువల్ ఫోరమ్ చైర్మన్