21 July, 2026 | 11:21 AM

ఎల్ నినోపై అప్రమత్తత

21-07-2026 12:00 AM

జి.లక్ష్మణ్ కుమార్ :

వాతావరణ మార్పులు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలోని మధ్య, తూర్పు ప్రాంతాల ఉపరితల జలాల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే పెరగడం వల్ల ఏర్పడే ఎల్ నినో పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా వర్షపాతం, ఉష్ణోగ్రతలు, వ్యవసాయంపై ప్రభావం చూపుతున్నది. భారతదేశంలో దక్షిణ, పశ్చిమ రుతుపవనాలపై ఎల్ నినో ప్రభావం ఎక్కువగా కనిపిస్తుండగా, తెలంగాణ కూడా దీనికి అతీతమేమీ కాదు.

ఎల్ నినో ప్రభావం వ్యవసాయానికే పరిమితం కాదు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంటుంది. భూగర్భ జలమట్టం పడిపోవడం, చెరువులు, రిజర్వాయర్లలో నీటినిల్వలు తగ్గడం, తాగునీటి సమస్యలు ఉత్పన్నం కావడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి. విద్యుత్ అవసరం పెరగడం, పశువులకు మేత, తాగునీటి కొరత ఏర్పడడం కూడా దీనికి అనుబంధ పర్యవసానాలే.

ఈ నేపథ్యంలో వ్యవసాయరంగంలో ముందస్తు ప్రణాళిక అత్యంత కీలకం. వాతావరణ శాఖ సూచనలను అనుసరించడం, తక్కువ నీటితో సాగు చేయగల పంటలను ఎంచుకోవడం, నీటి సంరక్షణ చర్యలు చేపట్టడం, బిందుసేద్య పద్ధతులను ప్రోత్సహించడం వంటి చర్యలు నష్టాలను కొంతవరకు తగ్గిస్తాయి. రైతులకు సకాలంలో శాస్త్రీయ సలహాలు, నాణ్యమైన విత్తనాలు, పంటల బీమా, ఆర్థిక సహాయం అందించడం ప్రభుత్వ బాధ్యత.

అయితే ప్రతి ఎల్ నినో సంవత్సరంలోనే కరువు వస్తుందని భావించడమూ సరైంది కాదు. భారతదేశంలో వర్షపాతం అనేక ఇతర వాతావరణ కారకాలపై కూడా ఆధారపడి ఉంటుంది. అందువల్ల వాతావరణ శాఖ, వ్యవసాయ శాస్త్రవేత్తలు విడుదల చేసే తాజా అంచనాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం అవసరం. ఎల్ నినో ప్రభావం వల్ల భారతదేశంలో, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో రుతుపవనాల తీరు మారడం, వర్షపాతం తగ్గడం, వర్షాలు ఆలస్యంగా ప్రారంభం కావడం లేదా మధ్యలో దీర్ఘకాల విరామాలు ఏర్పడే అవకాశం ఉంటుంది.

ఇలాంటి పరిస్థితులు వ్యవసాయ రంగంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి. అందువల్ల రైతులు సంప్రదాయ సాగు విధానాల కంటే పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవడం అత్యంత అవసరం. ఎల్ నినో ప్రభావం కనిపించే సంవత్సరాల్లో ఎక్కువ నీరు అవసరమయ్యే పంటల కంటే తక్కువ నీటితో పెరిగే, తక్కువ కాలంలో దిగుబడి ఇచ్చే పంటలను సాగు చేయడం వల్ల నష్టాలను గణనీయంగా తగ్గించుకోవచ్చు.

జొన్న, సజ్జ, రాగి, పెసర, మినుములు, కంది, నువ్వులు, వేరుశెనగ వంటి పంటలు వర్షాభావ పరిస్థితులను కొంతవరకు తట్టుకుని రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తాయి. వర్షాధార ప్రాంతాల్లో వరి సాగు చేసే రైతులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. తగినంత నీటి వనరులు లేకుండా వరి సాగు చేస్తే తీవ్ర నష్టాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. అలాగే వర్షాలు స్థిరంగా ప్రారంభమైన తర్వాతే పత్తి విత్తనాలు నాటడం మంచిది.

తక్కువ వ్యవధిలో పండే వంగడాలను ఎంచుకోవడం ద్వారా పంటను కాపాడుకునే అవకాశం పెరుగుతుంది. వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నట్లుగా రైతులు వాతావరణ శాఖ విడుదల చేసే అంచనాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ సాగు నిర్ణయాలు తీసుకోవాలి. నేలలో తేమను నిల్వ ఉంచేందుకు మల్చింగ్, గట్లు ఏర్పాటు, వర్షపు నీటి సంరక్షణ వంటి చర్యలు చేపట్టాలి. అవసరమైన విత్తనాలు, ఎరువులు ముందుగానే సిద్ధం చేసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది.

మారుతున్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ పంటల సాగుకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ప్రతి వ్యవసాయ సీజన్‌కు జిల్లా, మండలాలవారీగా పంటల ప్రణాళిక రూపొందిస్తూ రైతులకు తగిన సూచనలు అందిస్తోంది.

వరికి బదులుగా పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాలు, తక్కువ నీటితో సాగు చేయగల పంటల వైపు రైతులను ప్రోత్సహిస్తోంది. వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ శాస్త్రీయ సాగు పద్ధతులను వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్నదాతలు ప్రభుత్వం, అధికారుల సలహాలు, సూచనలను కచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది.

 వ్యాసకర్త: సమాచార, పౌరసంబంధాల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్,

కరీంనగర్, 9676647807