calender_icon.png 20 February, 2026 | 4:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిధుల మళ్లింపునకా?

20-02-2026 01:32:05 AM

  1. హెల్త్ స్కీంపై ఉద్యోగుల్లో అనుమానాలు 
  2. దాచుకున్న డబ్బులే ఇవ్వని సర్కారు.. హెల్త్ స్కీం పేరిట వేతనంలో కోత ఎందుకు?
  3. హాస్పిటల్ బిల్లులకు నిధుల్లేవంటే మా పరిస్థితి ఏంటి..?

హైదరాబాద్, ఫిబ్రవరి 19 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం అమలుచేయాల నుకుంటున్న కొత్త హెల్త్ స్కీం(ఈహెచ్‌ఎస్)పై ఉద్యోగుల్లో అనేక అపోహలు, అనుమానాలు, ఆందోళనలు కనిపిస్తున్నాయి. హెల్త్ స్కీం విషయంలో ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితి ఉందా? అనే చర్చ ఉద్యోగుల్లో జోరుగా జరుగుతోంది.

దాచుకున్న డబ్బులనే ఇవ్వని సర్కారు.. కొత్తగా హెల్త్ స్కీం పేరుతో జీతాల్లో నుంచి కోత విధిం చి వాటిని వేరే పథకాలకు వాడుకోదనే నమ్మకమేంటని పలువురు ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. రేపు ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్‌లో చేరితే బిల్లులు కట్టాల్సి వచ్చినప్పుడు నిధులు లేవని ప్రభుత్వం చేతులు ఎత్తేస్తే తమ పరిస్థితి ఏంటనే అనుమానాలు వారిలో వ్యక్తంచేస్తున్నారు.

నెలనెలా జీతాల నుంచి జీపీఎఫ్, టీఎస్‌జీఎల్‌ఐ కట్ చేస్తున్నారేగానీ వాటిని తిరిగి ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అసలే ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగలేక, ఖజానాలో డబ్బులులేక ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ఇవ్వాల్సినవే ఇవ్వలేని పరిస్థితుల్లో కొత్తగా హెల్త్ స్కీం పేరుతో కొత్త వల వేస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

1.5 శాతం కోత ఎందుకు? 

రాష్ట్రంలోని ఉద్యోగులకు నూతన హెల్త్ స్కీంను 15 రోజుల్లో అమలు చేస్తామని ప్రభుత్వం ఇటీవల ఉద్యోగ జేఏసీ నేతలతో సమావేశం నిర్వహించి ప్రకటించిన విషయం తెలిసిందే. త్వరలోనే మరో సారి ఉద్యోగ సంఘాలతో సమావేశమై మార్గదర్శకాలు, పథకం అమలుపై చర్చించనున్నారు. తర్వాత క్యాబినెట్‌లో దీనిపై చర్చించి ప్రభుత్వం అమల్లోకి తెస్తోంది. అయితే ఈ పథకం అమలుకు ప్రతి నెలా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తమ బేసిక్ పే/పెన్షన్ నుంచి 1.5 శాతం చందాగా చెల్లిస్తారు.

దీనికి సమానంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా 1.5 శాతం కేటాయిస్తుంది. రాష్ట్రంలో రెగ్యులర్ ఉద్యోగు లు, పెన్షనర్లు మొత్తం కలిపి 7.14 లక్షల మంది ఉన్నారు. వారి కుటుంబ సభ్యులు 12.84 లక్షల మంది ఉంటారు. ఉద్యోగుల బేసిక్ పే నుంచి ప్రతి నెలా 1.5 శాతం చెల్లిస్తే ఏడాదికి రూ. 528 కోట్లు ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్‌లో జమ చేసి అంతే మొత్తాన్ని (రూ. 528 కోట్లు) ప్రభు త్వం తన వాటా కింద చెల్లిస్తుంది. దీంతో ఈ మొత్తం రూ. 1,056 కోట్లు ట్రస్టులో జమచేసి క్యాష్‌లెస్ వైద్యాన్ని అందిస్తారు.

ఈ నిర్ణయానికి ఇటీవల నిర్వహించిన సమావేశంలో ఉద్యోగుల జేఏసీ నేతలు హాజరై ఒప్పుకున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల నుంచి వ్యతిరేకత వస్తోంది. నాయకుల నిర్ణయమే అందరి నిర్ణయమా అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. అయినా గతంలో ఉద్యోగులు ప్రతి నెలా తమ వేతనం నుంచి రూ. 500 హెల్త్ స్కీంకు కట్ చేస్తే చాలనే ప్రతిపాదనలున్నాయి.

కానీ ఇప్పుడు బేసిక్ పే నుంచి రూ. 1.5 శాంత కోత పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నారు. నమ్మలేని ఖాతాల్లో జమ చేసే ఈ ప్రభుత్వ పథకం కంటే తమ సొంతంగా తీసుకునే ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ వెయ్యి రెట్లు నయమనే అభిప్రాయాలను కింది స్థాయి ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లు వ్యక్తంచేస్తున్నారు. 

సంప్రదించకుండా..

సామాన్య ఉద్యోగులను, ఉపాధ్యాయులను కనీసం సంప్రదించకుండా, కేవలం కొందరు సంఘాల నాయకులు ప్రభుత్వంతో చేతులు కలిపి ఇలాంటి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడమేంటని తెలంగాణ ఎంప్లాయీస్ వాయిస్ పేరుతో సోషల్ మీడియాలో ఒక ప్రకటనను విడుదల చేశారు. జీవితాంతం సేవచేసి, రిటైర్మెంట్ తర్వాత తమ సొంత డబ్బుల కోసం ఏళ్ల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఉద్యోగులు, పెన్షనర్లకు ఎదురవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దాచుకున్న డబ్బులే ఇవ్వని ప్రభుత్వం, ఇప్పుడు నెల నెలా చందాల పేరుతో వసూళ్లు చేయడం దేనికి సంకేతం? అని నిలదీస్తున్నారు. ఉద్యోగుల నుంచి కట్ అవుతున్న సీపీఎస్ డబ్బులు ఎక్కడ జమ అవుతున్నాయి? వాటి భద్రత ఎంత? అన్న ప్రశ్నలకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదంటున్నారు. సంక్షేమ పథకాలకు నిధులు ఇచ్చే ప్రభుత్వం, పగలు రాత్రి కష్టపడే ప్రభుత్వ యంత్రాంగానికి ఇవ్వాల్సిన హక్కులను మాత్రం కాలరాస్తోందని విమర్శిస్తున్నారు.

తక్షణమే పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను విడుదల చేయాలి, నూతన పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. హెల్త్ స్కీమ్ పేరుతో జీతాల కోతను తక్షణమే నిలిపివేసి, గతంలో ఉన్న ఉచిత వైద్య సదుపాయాలనే మరింత మెరుగుపరచాలని డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగులు మౌనంగా ఉన్నారంటే అది బలహీనత కాదు, బాధ్యత.. కానీ ఆ బాధ్యతను ఆసరాగా చేసుకుని వారి హక్కులను హరిస్తే, భవిష్యత్తులో ఉద్యోగ, ఉపాధ్యాయుల లోకం గొంతెత్తక తప్పదని హెచ్చరిస్తున్నారు.

ఉద్యోగులు సంధిస్తున్న పలు ప్రశ్నలు  

* అటు ప్రభుత్వానికి ఇటు తెలంగాణ జేఏసీ నాయకులకు ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లు హెల్త్ స్కీం విషయంలో పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. 

* దాచుకున్న డబ్బే ఇవ్వనప్పుడు కొత్తగా 1.5 శాతం కోత ఎందుకు?

* నెలనెలా మా జీతాల నుంచి జీపీఎఫ్, జీఎల్‌ఐ కట్ చేస్తున్నారు. కానీ అవసరానికి చేతిలో చిల్లిగవ్వ పెట్టరు. లోన్లు ఇవ్వరు.

* రిటైర్ అయ్యాక రావాల్సిన సెటిల్‌మెంట్లు ఇవ్వరు.

* అసలు మా డబ్బులు ఏ ఖాతాల్లో ఉన్నాయో, ఏ ప్రభుత్వ పథకాలకు మళ్లించారో ఎవరికీ తెలియదు. 

* ఉన్న డబ్బులకే గ్యారెంటీ లేదు.. రేపు ఈ డబ్బులను కూడా వాడేసుకోరనే నమ్మకం ఏంటి?

* ముందు పాత బకాయిలు సంగతి తేల్చండి. 

నిధుల మళ్లింపు అనే ప్రచారం తప్పు

హెల్త్ స్కీం నిధుల మళ్లింపు అనే ప్రచారం తప్పు. కొందరు కావాలని ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో అపోహలు సృష్టిస్తున్నారు. హెల్త్ ట్రస్టు ద్వారా ఈ స్కీంను విజయవంతంగా నడుపుకోవచ్చు. ప్రతి నెలా ఉద్యోగులవి దాదాపు రూ.40 కోట్లు ఈ స్కీం కింద ట్రస్టులో జమవుతాయి. ఈ నలభై కోట్లను ప్రభుత్వం ఏ స్కీంలకు మళ్లించుకుంటుంది. సంవత్సరానికి 12 వేలకు ఏ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ వైద్య సేవలను అందిస్తుంది. అయినా అక్కడ భార్యభర్తతోపాటు ఇద్దరు పిల్లలకు మాత్రమే వర్తిస్తుంది.

కానీ ప్రభుత్వం ఇచ్చే హెల్త్ స్కీంలో భార్యభర్త, పిల్లలు, ఉద్యోగుల తల్లిదండ్రులకు కూడా వర్తిస్తుంది. తక్కువ ప్రీమియమే కట్ అవుతోంది. ప్రైవేట్ హెల్త్ స్కీం ఏడాదికి రూ.30 వేలకు తక్కువేలేదు. ప్రభుత్వంతో సంబంధంలేకుండా ట్రస్ట్ ద్వారానే ఈ స్కీం నడుస్తోంది. అయినా ఈ స్కీంలో ఉండాలా? వద్దా? అనేది ఉద్యోగి ఇష్టం. బలవంతంగా రుద్దడంలేదు. ఆసుపత్రులు కూడా మెరుగైనా వైద్య సేవలు అందించేలా వారం రోజుల్లోనే రెండంచెల విధానంలో బిల్లులు చెల్లించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పెట్టాము. ఇది ఉద్యోగులకు భరోసా ఇచ్చే స్కీం.

 పుల్గం దామోదర్ రెడ్డి, పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి

0.75 శాతం కట్ చేయాలి  

గతంలో కేసీఆర్ ప్రభుత్వం తామే మొత్తమయ్యే ఖర్చును భరిస్తామని చెప్పింది. ఇప్పుడు ఉద్యోగులు, ప్రభుత్వం సమాన వాటాతో హెల్త్ స్కీంను అమలు చేస్తున్నారు. దీనికి మేము కూడా ఒప్పుకున్నాము. కానీ 1.5 శాతం కాకుండా దాన్ని తగ్గించాలి. ఉద్యోగుల బేసిక్ పే నుంచి 1.5 శాతం జీతం కట్ చేయడం ఎక్కువ. ఉద్యోగుల నుంచి 0.75 శాతం, ప్రభుత్వ వాటా 0.75 కట్ చేస్తే చాలు. 1.5 శాతం కట్ చేస్తే సంవత్సారినికి సుమారుగా రూ.15వేలు అవుతోంది. ఇవే పెడితే ప్రైవేట్‌లోనే హెల్త్ ఇన్సూరెన్స్ పొందొచ్చు కదా. తర్వాత 1.5 శాతాన్ని తగ్గించుకోవచ్చని ఇప్పుడు అంటున్నారు గానీ, తర్వాత తగ్గిస్తారనేది చెప్పలేము. 

 నవాత్ సురేష్, టీపీయూఎస్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి

మంచి స్కీమ్.. అపోహలొద్దు 

ఇది మంచి స్కీమ్. దీనిపై సీఎస్‌కు పూర్తి అవగాహన ఉంది. అనవసరంగా ఉద్యోగులు దీనిపై ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు. ఈ ట్రస్ట్‌లో ఆరుగురు ఉద్యోగ సంఘాల నాయకులు కూడా ఉంటారు. ఇందులో జమయ్యే డబ్బులపై ట్రస్టుకే అన్ని అధికారాలు ఉంటాయి. ప్రతి నెలా ఎంత డబ్బులు జమవుతున్నాయి? ఎంత ఖర్చు అవుతుందో చూసుకోవచ్చు. జమయ్యే డబ్బులు, ఖర్చును బట్టి ఉద్యోగుల కటింగ్‌ను 1.5 శాతం నుంచి 1 శాతాన్ని తగ్గించుకోవచ్చు. అసలే పది సంవత్సరాల నుంచి ఈ స్కీం పెండింగ్‌లో ఉంటూ వస్తోంది. ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పదిహేను పదహారు వందల తక్కువ ప్రీమియంతోనే ఉద్యోగులు, పెన్షనర్లు వారి కుటుంబ సభ్యులకు మంచి వైద్య సదుపాయాలు అందుతాయి.

 మారం జగదీశ్వర్, తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్

మెరుగైన వైద్యసేవలు అందాలనే..

చాలా మంది ఉద్యోగులు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వారికి సరైనా వైద్య సేవలు అందడం లేదు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో క్యాష్‌లెస్ మెరుగైన వైద్య సేవలు అందాలని, వారికి న్యాయం జరగాలనే దీనికి ఒప్పుకున్నాం. ఉద్యోగుల పక్షాన ప్రభుత్వానికి మేము స్పష్టంగా చెప్పాం. మా ఖాతాల నుంచి డబ్బులు కట్ చేసినట్లుగానే ప్రభుత్వం కూడా అంతే మొత్తాన్ని డిపాజిట్ చేయాలని. ఉద్యోగుల ప్రతినిధులుగానే ఈ నిర్ణయానికి ఒప్పుకున్నాం. అయితే కొంత మంది ఉద్యోగుల్లో పలు అపోహలు ఉన్నాయి. వాటి గురించి వారికి వివరించే ప్రయత్నం చేస్తున్నాం.  

 బీ.శ్యామ్, టీజీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి