15 April, 2026 | 11:01 AM

ప్రాణాలకు విలువ లేదా!

02-11-2025 12:00 AM

భారత్‌లో మద్యం తాగడం వల్ల ప్రాణాలు కోల్పోతున్న వారి కంటే మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల అమాయక ప్రజల ప్రాణాలు పోతున్న సంఖ్యే ఎక్కువగా ఉండడం బాధాకరం. మద్యం తాగి వాహనాలు నడపొద్దని ప్రభుత్వాలు, పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ మద్యం ప్రియులు మాత్రం వారి సూచనలను బేఖాతరు చేస్తూ రోడ్లపైకి ఎక్కి నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ ప్రజల ప్రాణాలు బలిగొంటున్నారు.

ఇటీవల కర్నూల్ జిల్లా చిన్నటేకూరు జాతీయ రహదారిపై కావేరీ ట్రావెల్స్ స్లీపర్ బస్సు అగ్ని ప్రమాదం ఈ కోవకు చెందినదే. మద్యం మత్తులో బైక్‌ను నడిపిన శివశంకర్ అనే వ్యక్తి తాను చనిపోవడమే గాక బస్సులోని పసి పిల్లలు సహా 19 మంది ప్రయాణికుల ప్రాణాలను బలి తీసుకోవడం కలచివేసింది. రెండేళ్ల క్రితం మహారాష్ట్రలోని బుల్దానాలో ఇలాగే ఒక బస్సు అగ్నికి ఆహుతి కావడంతో 25 మంది ప్రయాణికులు మరణించారు.

తర్వాత విచారణలో బస్సు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు  తేలింది. మద్యం తాగి వాహనం నడపడమే నేరమనుకుంటే, ఒక వ్యక్తిగా బాధ్యతను మరిచి ప్రజల ప్రాణాలు తీసే హక్కు ఎవరిచ్చారన్నది ఆలోచించాల్సిన అంశం. కాగా కర్నూల్ ఘటనపై హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనా ర్ ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. మద్యం మత్తులో వాహనా లు నడిపే వాళ్లు మానవ బాంబులు, టెర్రరిస్టులతో సమానమన్నారు.

వారి జల్సాల కోసం ఇతరుల ప్రాణాలు తీసే హక్కు వాళ్లకు లేదని, వీరిని ఇలాగే వదిలేస్తే రోడ్ల మీద ఎంతో మందిని చంపేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే మద్యం తాగి వాహనాలు నడిపి ప్రజల ప్రాణాలు తీస్తుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవ్వొచ్చు. కానీ ఇక్కడ నిందించాల్సింది ప్రభుత్వాన్ని కాదు మన వ్యవస్థను. ఎందుకంటే తాగి వాహనాలు నడపొద్దని ప్రభుత్వాలు, పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరిక లు జారీ చేస్తున్నప్పటికీ మందుబాబులు మాత్రం తమకేం పట్టనట్లుగా వ్యవహరిస్తూ నష్టం కలిగిస్తున్నారు.

ఇవాళ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల ఎన్ని ప్రాణాలు పోతున్నాయో.. మద్యం తాగి యాక్సిడెంట్‌లు చేయడం ద్వారా కూడా అన్నే ప్రాణాలు పోతున్నా యి. డ్రంక్ అండ్ డ్రైవ్ పేర్లతో పోలీసులు వాహనాలను ఆపి తనిఖీలు చేయడం, తాగిన వారికి భారీగా జరిమానాలు విధించడం, కౌన్సెలింగ్‌లు ఇచ్చి పంపిస్తున్నారు. తమ టార్గెట్‌లు చేరుకోవడం కోసం పోలీసులు అడ్డగోలుగా వాహన తనిఖీలు చేస్తూ ప్రయాణికులను ఇబ్బందికి గురి చేస్తున్నా రన్న మాటే కానీ, ఒక రకంగా సమాజానికి మంచే చేస్తున్నారు.

నిత్యం డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల ఇవాళ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు తగ్గినట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి.అయితే పోలీసులు కేవలం నగరాలకు మాత్రమే పరిమితమవ్వకుండా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోనూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను చేయాల్సిన అవసరముంది. ఇక శనివారం శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల మధ్య తొక్కిసలాట జరిగి 9 మంది మరణించడం విషాదాన్ని నింపింది.

ఏకాదశి పురస్కరించుకొని అధిక సంఖ్యలో భక్తులు రావడం, పోలీసులకు సమాచారం ఇవ్వడంలో ఆలయ సిబ్బంది విఫలం కావడం ఘటనకు కారణమైంది. పైన పేర్కొన్న రెండు సంఘటనలు వేర్వేరు అయినప్పటికీ బాధ్యతారాహిత్యం వల్ల అమాయక ప్రజల ప్రాణాలకు విలువ లేకుండా పోతుంది.