11 May, 2026 | 7:38 AM

ఆ పిచ్ సంతృప్తికరమేనా?

21-08-2024 12:11 AM

టీ20 ప్రపంచకప్ పిచ్ రేటింగ్స్ విడుదల

దుబాయ్: అమెరికాలోని న్యూయార్క్ నసావు కౌంటీ స్టేడియం పిచ్‌కు ఐసీసీ సంతృప్తికర రేటింగ్ ఇవ్వడం ఆసక్తి కలిగించింది. ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌కు వెస్టిండీస్, అమెరికాలు సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో న్యూయార్క్ వేదికగా మొత్తం 8 మ్యాచ్‌లు నిర్వహించగా.. దాదాపు అన్ని మ్యాచ్‌ల్లోనూ లో స్కోరింగ్‌లే నమోదయ్యాయి. దీంతో నసావు కౌంటీ పిచ్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మంగళవారం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టోర్నీకి సంబంధించి పిచ్ రేటింగ్స్‌ను విడుదల చేసింది.

జూన్ 1 నుంచి 29 వరకు జరిగిన మెగా టోర్నీలో మొత్తం 52 మ్యాచ్‌లు జరగ్గా.. మూడు మ్యాచ్‌లకు ఉపయోగించిన పిచ్‌పై అసంతృప్తి వ్యక్తం చేసిన ఐసీసీ.. మిగతా అన్ని మ్యాచ్‌లకు సంతృప్తికర రేటింగ్ ఇచ్చింది. ఐసీసీ అసంతృప్తి వ్యక్తం చేసిన మూడింటిలో రెండు న్యూయార్క్.. మరొకటి ట్రినిడాడ్ పిచ్. ఇక న్యూయార్క్ వేదికగా జరిగిన భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు ఐసీసీ సంతృప్తికర రేటింగ్ ఇచ్చింది.

ఇక భారత్, ఐర్లాండ్ మ్యాచ్‌తో పాటు శ్రీలంక, సౌతాఫ్రికా మ్యాచ్‌లకు ఉపయోగించిన పిచ్‌లపై ఐసీసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌కు ఐసీసీ వెరీ గుడ్ రేటింగ్ ఇవ్వడం విశేషం.