మూసీ ప్రక్షాళనను బీఆర్‌ఎస్ వ్యతిరేకిస్తుందా?
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, మార్చి 18 (విజయక్రాంతి): గండిపేట నుంచి బాపు సరోవర్ వరకు మొదటి దశలో చేపడుతున్న ఈ పునరుజ్జీవన కార్యక్రమం కేవలం ప్రచార ఆర్భాటం కోసం చేస్తున్నది కాదని, మహాత్మా గాంధీ చెప్పినట్టుగా, ప్రతి నిర్ణయంలోనూ అత్యంత పేదవాడి కన్నీళ్లు తుడవాలనే సంకల్పంతోనే మేము ముందుకు సాగుతున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మూసీ పరివాహక ప్రాంతంలోని పేద ప్రజలకు అత్యుత్తమమైన హైజీనిక్ వాతావరణాన్ని కల్పించి, వారిని ఈ అభివృద్ధి ప్రక్రియలో భాగస్వాములను చేయడమే మా లక్ష్యమన్నారు.
బుధవారం మూసీ ప్రాజెక్టుపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందిస్తూ... విపక్షాలు పక్కదోవ పట్టించే ప్రయత్నం చేయకుండా, పేదవాడి జీవితాల్లో వెలుగులు నింపే ఈ బృహత్తర కార్యక్రమాన్ని అభినందించాలని కోరారు. మూసీ పునరుజ్జీవం ఒక సామాజిక బాధ్యత అని, మురుగు నీరు, ఈగలు, దోమలు మరియు రోగాల మధ్య దయనీయ పరిస్థితుల్లో బతుకుతున్న పేదల జీవితాలను మార్చాలనేదే మా ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు. మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటున్న వారు పేదలు అదే మురికి కూపంలో ఉండాలని కోరుకుంటున్నారా? అని ప్రశ్నించారు.
నివాసాలు కోల్పోయే ప్రతి పేద కుటుంబానికి పట్టా ఉన్నా లేకపోయినా అదే ప్రాంతంలో అపార్ట్‌మెంట్లు నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి ఇప్పటికే స్పష్టం చేశారని గుర్తు చేశారు. అంతేకాకుండా అక్కడి మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించి వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తామన్నారు. వారి పిల్లల కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించి ఉజ్వల భవిష్యత్తును అందిస్తామని తెలిపారు.
హైదరాబాద్ నగరానికి మణిహారంగా మూసీని తీర్చిదిద్దుతుంటే ప్రతి అడుగులో అడ్డుపడటం సరికాదని, పేదవాడు పేదవాడిగానే ఉండాలి, మురికిలోనే బతకాలి అనే ధోరణి ప్రతిపక్ష పార్టీ నాయకులు వీడాలని హితవు పలికారు. ఈ మహా యజ్ఞం ద్వారా మూసీ పరివాహక ప్రాంతాల ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది.
మూసీ నది ప్రక్షాళన దిశగా ఈ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అత్యంత పారదర్శకంగా ఉన్నాయని, నదిలోకి వచ్చే ప్రతి నాలా వద్ద ఎస్టీపీలను ఏర్పాటు చేసి, మురికినీటిని పూర్తిగా శుద్ధిచేసిన తర్వాతనే మూసీలోకి వదులుతామని మా ప్రెసెంటేషన్‌లో చాలా స్పష్టంగా వివరించామన్నారు. దీనిపై ప్రజల నుంచి, మేధావుల నుంచి వచ్చే మెరుగైన సలహాలను, సూచనలను పరిగణనలోకి తీసుకోవడానికి మా ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ నేతల మాదిరిగా మేం ప్రచార ఆర్భాటం చేయబోమని, మూసీ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు వివరాలన్నీ వెబ్‌సైట్‌లో ఉన్నాయని, ఎవరైనా సలహాలు సూచనలు ఇవ్వవచ్చన్నారు.




