calender_icon.png 9 November, 2025 | 2:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం మానసిక స్థితి దెబ్బతిన్నట్టుంది?

09-11-2025 12:41:02 AM

మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి

హైదరాబాద్, నవంబర్ 8 (విజయక్రాంతి) : సీఎం రేవంత్‌రెడ్డి మానసిక స్థితి దెబ్బతిన్నట్టుందని, ఆయన సందర్భం లేకుం డా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి ఎద్దేవా చేశారు. శనివారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. క్రైమ్ జరగకుండా నిఘా పెట్టడానికి కేసీఆర్ కమాండ్ కంట్రోల్ కడితే, రేవంత్‌రెడ్డి కమాండ్ కంట్రోల్‌లో కూర్చుని తమపైన నిఘా పెడుతున్నారా అని ప్రశ్నించారు.

ప్రగతి భవన్‌లో బుల్లెట్ ప్రూఫ్ కిటికీలు ఉంటే చూపించాలని, బుల్లెట్ ప్రూఫ్ కిటికీలు, కమాండ్ కంట్రోల్, సెక్రటేరియట్ పైన కమిషన్ వేయవచ్చు కదా అని నిలదీశారు. హైదరాబాద్ అభివృద్ధి అజెండా పైనే జూబ్లీహిల్స్ ప్రజలు ఓటు వేయబోతున్నారని స్పష్టం చేశారు. దేశంలో ఎవరూ తిట్టని విధంగా వైఎస్సార్, సోనియాగాంధీని రేవంత్‌రెడ్డి తిట్టారని గుర్తుచేశారు. ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలను ఎన్ని రోజులు భయపెడతారని ప్రశ్నించారు.

రేవంత్ రెడ్డిలో భయం మొదలైందని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తర్వాత ఆయన పదవికి ఉపద్రవం వస్తుందన్నారు. ముఖ్యమంత్రి ఏం చేసినా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవదని, ఆయన చేసే తప్పులను చరిత్ర క్షమించదని స్పష్టం చేశారు. నోటి దూలతో బీహార్ నుంచి వెల్లగొట్టే పరిస్థితి వచ్చిందని, బీహార్ ఎన్నికల ప్రచారానికి రేవంత్ రెడ్డిని వద్దని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని పిలిపించుకున్నారని ఎద్దేవా చేశారు.

హరీశ్‌రావుపై ముఖ్యమంత్రివి చిల్లరమాటలని విమర్శించారు. ఆయన భాషతో తెలంగాణ పరువు పోతోందని, ఇప్పటికైనా మార్చుకుంటే  మంచిదని హితవు పలికారు.  సమావేశంలో మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్ రెడ్డి, గాదరి కిశోర్ కుమార్, బూడిద భిక్షమయ్యగౌడ్ ఉన్నారు.