09-11-2025 12:47:57 AM
హైదరాబాద్, సిటీబ్యూరో నవంబర్ 8(విజయక్రాంతి): బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఎంఐఎం కీలుబొమ్మలేనని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. ఆ పార్టీలకు ఓటేస్తే మనల్ని మనమే మోసం చేసుకున్నట్లు అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచా రంలో భాగంగా శనివారం మధురానగర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
అభివృద్ధిని గాలికొదిలేశారు..
‘పేరుకు ధనవంతుల నియోజకవర్గమైనా.. జూబ్లీహిల్స్‌లో కనీస సౌకర్యాలు లేవు అభివృద్ధిని గాలికి వదిలేశారని విమర్శించారు. డ్రైనేజీ నీటిలో నిలబడి సమావే శాలు పెట్టుకోవాల్సిన దుస్థితికి ఈ ప్రాంతా న్ని దిగజార్చారని మండిపడ్డారు. రహమత్ నగర్, వెంగళరావునగర్, బోరబండ కాలనీల్లో మురుగు నీటి కంపులో ప్రజలు ఎలా బతుకుతున్నారో కేసీఆర్ ఒక్కరోజైనా ఆలోచించారా? అని ప్రశ్నించారు. 11 ఏళ్లుగా ఇక్కడ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ, ఖైరతాబాద్, కూకట్‌పల్లిలా జూబ్లీహిల్స్ ఎందు కు అభివృద్ధి చెందలేదో కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
మూడు పార్టీలు ఒక్కటే..
బీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు నిజానికి ఒక్కటేనని కిషన్‌రెడ్డి తెలిపారు. పాతబస్తీలో మజ్లిస్ నేతలు హిందువులపై దాడులు చేస్తుంటే, అక్కడికి వెళ్లాలంటే మం త్రులు కూడా ఎంఐఎం ఆఫీస్ అనుమతి తీసుకోవాల్సిన దుస్థితి ఉంది. రేపు జూబ్లీహిల్స్‌లో కూడా అదే పరిస్థితి తీసుకురావాలని చూస్తున్నారని కిషన్ రెడ్డి హెచ్చరించారు. మహిళలకు రూ.2500, నిరుద్యోగులకు రూ.4000 వంటి హామీలు అమలు చేయకుండా, ఇప్పుడు డబ్బులతో ఓట్లు కొనాలని చూస్తున్నారని, ఈ మోసపూరిత పార్టీలకు ఆత్మగౌరవంతో ఓటు వేసి ప్రతీకారం తీర్చుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని కేంద్రమంత్రి ఆరోపించారు. మెహదీపట్నం, ఎర్రగడ్డలో శ్మశానవాటికల కోసం వందల గజాల స్థలం ఇవ్వడానికి మనసొచ్చిన ప్రభుత్వానికి, బంజారాహిల్స్‌లోని పెద్దమ్మ తల్లి గుడికి ఐదు గజాల స్థలం ఇవ్వడానికి మా త్రం మనసు రాలేదు. హిందూ దేవాలయా ల పట్ల ఇంత నిర్లక్ష్యం ఎందుకు..అని నిలదీశారు. ప్రజల క్షేమాన్ని కోరేది ఒక్క బీజేపీ యేనని పేర్కొన్నారు. ప్రజల కోసం పోరాడే దీపక్‌ను గెలిపించి, మోదీ నాయకత్వంలో జూబ్లీహిల్స్‌ను అభివృద్ధి చేసుకుందామని ఆయన విజ్ఞప్తి చేశారు.