విభజన చట్టం అమలయ్యేనా!
బయ్యారం ఉక్కు ప్రాజెక్టు ఊసే లేదు
ఒక్క ప్రాజెక్టుకు అందని జాతీయ హోదా
కేంద్ర మంత్రులు దృష్టిసారించాలంటున్న సీఎం రేవంత్
హైదరాబాద్, జూన్ 10 (విజయక్రాంతి): గత పదేళ్లుగా విభజన హామీలపై మొదట్లో జరిగినంత కొట్లాట తర్వాత లేకుండా పోయింది. తెలంగాణ వచ్చింది అదే సంతోషమన్న అభిప్రాయంలో ఉన్నారేమో కానీ రాజకీయంగా అవసరం వచ్చినప్పుడు తప్ప మిగతా సందర్భాల్లో విభజన హామీల గురిం చి ప్రస్తావించలేదు. చివరికు ఏపీతో ఉన్న సమస్యల పరిష్కారానికీ పెద్దగా చొరవ చూపలేదు.
తెలంగాణ, ఏపీలో ఉన్న గత ప్రభుత్వా లు, అప్పటి సీఎంలు సన్నిహితంగా ఉన్నా విభజన సమస్యలపై ఏనాడు చర్చ జరిపిందీ లేదు. ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ కొత్త ప్రభుత్వాలు వచ్చాయి. కేంద్రంలో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరించారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 5గురికి కేంద్ర మంత్రివర్గం లో చోటు లభించింది. ఈ నేపథ్యంలో గత పదేళ్లుగా పరిష్కారం కాకుండా ఉన్న విభజన చట్టంలోని హామీలు నెరవేరుతాయని రెండు రాష్ట్రాల ప్రజలు ఎదురుచూస్తున్నారు.
నెరవేరని హామీలు
ఉవ్వెత్తున ఎగసిన తెలంగాణ ఉద్యమం ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలంగాణ, అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంగా పార్లమెంట్ విభజించింది. భారత పార్లమెంటు చట్టం రెండు రాష్ట్రాల సరిహద్దులను నిర్వచించింది. ఈ చట్టం ప్రకారం ఆస్తులు, అప్పులను ఎలా విభజించాలో నిర్ణయించింది. కొత్త తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్‌ను శాశ్వత రాజధానిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట తాత్కాలిక రాజధాని గా హోదాను నిర్దేశించింది. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో కేంద్రం ఇచ్చిన హామీ లను దాదాపు నెరవేర్చాం అంటూ గతంలో పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ వాస్తవంగా అలాంటి పరిస్థితే కని పించదు. తెలంగాణ ఆవిర్భవించి పదేళ్లు పూర్తయినా విభజన హామీలు మాత్రం నెరవేరలేదు. విభజన హామీల్లో గిరిజన విశ్వవిద్యా లయం ఒక్కటే నెరవేర్చారు. ములుగులో గిరిజన కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటైంది.
బయ్యారం ఉక్కు కర్మాగారం ఏదీ?
తెలంగాణ పురోగతి కోసం ఖమ్మంలోని బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు అంశం విభజన చట్టంలో స్పష్టంగా ఉంది. పదేళ్లు గడచినా స్టీలు ఫ్యాక్టరీ ఏర్పాటులో ఇంతవరకు ఎలాంటి ముందడుగు పడలేదు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి, తెలంగాణలో యువతకు ఉపాధి కల్పించాలని కోరుతూ ఎంపీలు పార్లమెంటులో పలుసార్లు ప్రస్తావించినా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. వీటితో పాటు మిగతా విభజన హామీలను నెరవేర్చాలని తెలంగాణ ఎంపీలు కోరినా ఫలితం శూన్యమే అయింది.
కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఊసేలేదు
కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని కేంద్రం స్వయంగా విభజన చట్టంలో హామీ ఇచ్చింది. ఈ హామీని తొమ్మిదేళ్లు నానబెట్టి చివరికి రైల్వే వ్యాగన్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ప్రధాని మోదీ కాజీపేటలో వ్యాగన్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. కానీ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతంలో వేలాది మందికి ఉద్యోగ అవకాశాలతో పాటు స్థానికులకు అనేక మార్గాల ద్వారా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధికి అవకాశం ఏర్పడేది.
నదీ జలాల సమస్యలన్నీ పెండింగ్
తాము మధ్యవర్తిగా ఉంటూ పలు అంశాలపై తెలంగాణ, ఏపీ రాష్ట్రాలతో 31 సార్లు సమీక్షలు జరిపామని పార్లమెంట్‌లోనే కేంద్రం ప్రకటించింది. తాత్కాలిక నదీ జలాల కేటాయింపులనే ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. కృష్ణా బేసిన్‌లో తెలంగాణకు సగం వాటా కావాలని డిమాండ్ చేస్తోంది. విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10లోని రెండు రాష్ట్రాల మధ్య సంస్థల విభజన పదేళ్లయినా చర్చలు, కమిటీల పేరిట కాలయాపనలు తప్ప పరిష్కారం రాలేదు. నీళ్లు, నిధులు, నియామ కాలు ప్రధాన ఎజెండాలుగా తెలంగాణ ఉద్య మం వచ్చింది. తెలంగాణ ఆవిర్భావంతో మన నిధులు, మన నీళ్లు, మన ఉద్యోగాలు మనకే దక్కుతాయని, మన వనరులు మన మే పూర్తిగా సద్వినియోగం చేసుకోవచ్చని అనుకున్నా ఇప్పటికీ కృష్ణా జలాల కేటాయింపులు లేక నీళ్ల విషయంలో రాష్ట్ర ప్రజలు ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు.
తెలంగాణ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఏదీ?
తెలంగాణలో ఏదైనా ఒక సాగు నీటిపారుదల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని రాష్ట్రం నుంచి కోరుతున్నా కేంద్రం స్పందించలేదు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిన కేంద్రం తెలంగాణలోని కాళేశ్వరం లేదా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా విషయంలో ఏమాత్రం పట్టించుకోలేదని బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకులు అనేక సందర్భాల్లో విమర్శించారు. ఈ మేరకు కాళేశ్వరం ప్రాజెక్టుకు గానీ, పాలమూరు- ప్రాజెక్టుకుగానీ జాతీ య హోదా ఇవ్వాలని తెలంగాణ ప్రభు త్వం ఎన్నిసార్లు కోరినా కేంద్రం నుంచి స్పందన లేదు. జాతీయ ప్రాజెక్టు హోదా ఇవ్వడమే లేదన్న కేంద్రం.. కర్ణాటకలో అప్పర్ భద్రకు మాత్రం జాతీయ హోదా ఇచ్చారు.
కేంద్ర మంత్రులదే బాధ్యత
విభజన చట్టంలోని ప్రధాన హామీలను నెరవేర్చే బాధ్యత తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులపైనే ఉంది. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, నదీ జలాల పంపిణీ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఏదైనా ప్రాజెక్టుకు జాతీయ హోదా వంటి అంశాలతో పాటు రాష్ట్రానికి రావాల్సిన నిధులపైనా కేంద్రంలో కొత్త మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి, బండి సంజయ్ బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందనే అభిప్రాయాలు ప్రజల నుంచి వెల్లడవుతున్నాయి.






