29 August, 2026 | 7:51 AM

ఆకునూరులో కొత్త వీరుల విగ్రహాలు

11-06-2024 12:35 AM

నాడు సర్వతోభద్రశిల, నేడు కాలభైరవశిల్పం

సిద్దిపేట, జూన్ 10 (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరులో కొత్తవీరుల శిల్పాలు లభించాయి. తెలంగా ణ కొత్త చరిత్రకారుల బృందం సభ్యులు ఆకునూరులో సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా వారు గుర్తించిన కొత్తవీరుల విగ్రహాల గురించి వెల్లడించారు. ఈ గ్రామం లో రెండు పాటిగడ్డలుంటాయి. ఒక పాటిగడ్డమీద గతంలో జైన సర్వతోభద్రశిల లభించింది. ఇప్పుడు గ్రామంలోని సోమరాజుల కుంటలో నాలుగు శిల్పాలు లభించా యి. ఇందులో రెండు వీరుగల్లులు, ఒకటి నాగముచుళింద పోలికలున్న నాగవిగ్రహం, మరోకటి రాష్ట్రకూటులనాటి కాలభైరవశిల్పం.

కాగా, రెండు వీరుగల్లులలో ఒకటి రాష్ట్రకూటుల కాలానికి చెందిన అలంకృత వీరశిల. ఒకటే అంతస్తున్న ఈ వీరశిలలో వీరుడు సర్వాభరణాలు ధరించి ఉన్నాడు. కుడిచేతిలో భాణం, ఎడమచేతిలో విల్లు ధరించి డాకాలు సాచి యుద్ధ సన్నద్దుడై ఉన్నాడు. నడినెత్తిన కొప్పు, మూపున వీరశృంఖల, నడుమున పట్టాకత్తి ధరించి ఉన్నాడు. కాళ్లకు స్త్రీలకు వలె పాంజిబులు, మువ్వల నూపురాలుండటం విశేషం. ఈ వీరుగల్లులకు స్త్రీతత్వప్రతిమాలక్షణాలుండటం ఆశ్చర్యం.

ఈ వీరుడు అమరుడైనా డని తెలుపడానికి సూచనగా ఇద్దరు అప్సరాంగనులు వీరుని తలకు ఇరువైపులా నిల్చుని వీంజమారులు వీస్తున్నారు. ఇటువంటి వీరుగల్లులు చాలా ఆరుదుగా ఉంటా రు. రెండో వీరుగల్లులో వీరుని సిగ కుడిపక్కకు కట్టి ఉన్నది. వీరుడు బల్లెంతో శత్రువు మీద దాడికి సిద్ధంగా ఉన్నాడు. వీరుని నడుమున పెద్దకత్తి ఉంది. వీరుడు అంతగా అలంకరించబడలేదు.. కాబట్టి కాకతీయపూర్వ శైలిలో చెక్కబడిన వీరగల్లు విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి.