29 August, 2026 | 10:39 AM

ట్యాక్స్ రెవెన్యూ రూ.11,464.17కోట్లు!

11-06-2024 12:32 AM

కేంద్రానికి కాగ్ తెలంగాణ నివేదిక

ద్రవ్యలోటు రూ.2,246.62కోట్లు

రాష్ట్ర ఆదాయం రూ.14068.41కోట్లు

చేసిన ఖర్చు రూ.13918.31కోట్లు

రూ.1865.15కోట్ల వడ్డీలను చెల్లించిన రేవంత్ సర్కారు 

కోడ్ వల్ల కేంద్రం నుంచి విడుదలకు నోచుకోని రూపాయి

హైదరాబాద్, జూన్ 10 (విజయక్రాంతి): తెలంగాణ ఆదాయం, వ్యయం, జీతభత్యాలు, ద్రవ్యోలోటు, ప్రభుత్వం చెల్లిస్తున్న వడ్డీలకు సంబంధించి.. ఏప్రిల్ నెలకు సంబంధించిన నివేదికను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్  జనరల్(కాగ్) తాజాగా కేంద్రానికి అందజేసింది. ఏప్రిల్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి గతేడా దితో పోలిస్తే అన్నింట్లా రాబడి పెరిగింది. ముఖ్యంగా పన్ను వసూళ్లలో మెరుగైన పురగోతి సాధించింది.

ఈ ఏప్రిల్‌లో పన్ను రాబడి రూ.11,464.17 కోట్లు వచ్చింది. గతేడాది ఏప్రిల్‌లో రూ.9,698.65కోట్లు వసూ లైంది. ద్రవ్యలోటును కూడా  సర్కారు చాలావరకు తగ్గించుకుంది. గతేడాది ఏప్రిల్‌లో  ద్రవ్యలోటు రూ.5,026.30కోట్లు ఉండగా.. ఈసారి అది రూ.2,246.62కోట్లకు తగ్గినట్టు  నివేదికలో పేర్కొంది. ఈ ఏప్రిల్‌లో అప్పులతో కలిపి ఆదాయం రూ.14,068.41కోట్లు కాగా.. గతేడాది రూ.15,085.34 కావడం గమనార్హం. గతేడాది చేసిన అప్పులకు కంటే.. ఈ ఏడాది ఏప్రిల్‌లో అప్పులు దాదాపు రూ.3 వేల కోట్లు తగ్గాయి. దీంతో ఆదాయం తగ్గింది.  ఇదిలా ఉంటే, ఈ ఏప్రిల్‌లో కేంద్రం నుంచి రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదని కాగ్ తన నివేదికలో పేర్కొంది.  ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో కేంద్రం నుంచి నిధులు రాలేదని తెలుస్తోంది.

l ఈ ఏప్రిల్‌లో రాష్ట్ర ప్రభుత్వ మొత్తం వ్యయం రూ.13918.31కోట్లు కాగా.. గతేడాది రూ.12463.85కోట్లను ఖర్చు చేసిం ది. గతేడాది మాదిరిగానే ఈ ఏప్రిల్‌లో కూడా వచ్చిన ఆదాయాన్ని పూర్తిస్థాయిలో ఖర్చు చేయకపోడవం గమనార్హం.

l జీఎస్టీ వసూళ్ల విషయానికి వస్తే.. ఈసారి రూ.4475.57కోట్లు వచ్చాయి. అయితే గతేడాది రూ.4081.79కోట్లు వసూలయ్యాయి. గతేడాదితో పోలిస్తే.. రూ.393.78కోట్ల రాబడి పెరిగింది. 

l బీఆర్‌ఎస్ సర్కారు హయాంలోఖజానాకు ఊతమిచ్చిన ఎక్సైజ్ సుంకం ఈ ఏప్రిల్‌లో చెప్పుకోదగ్గ స్థాయిలో వసూలైంది. గతేడాది రూ.969.08 కోట్లు వచ్చింది. ఈసారి రూ.1580.43కోట్లకు పెరిగింది.

l స్టాంపులు, రిజిస్ట్రేషన్ ద్వారా ఈసారి రూ.1116.33కోట్ల ఆదాయం రాగా.. గతేడాది రూ.990.56కోట్లు వచ్చింది. 

l ఈ ఏప్రిల్‌లో రూ.2661.10కోట్ల సేల్స్ ట్యాక్స్ వసూలూ కాగా.. గతేడాది రూ.2303.10 కోట్లు వచ్చింది.

l అలాగే పన్నేతర రాబడి ఈ ఏప్రిల్‌లో రూ.354.71కోట్లు వచ్చింది. గతేడాది రూ.357.64కోట్లు వసూలైంది.

l రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన అప్పులకు వడ్డీలను ఏప్రిల్‌లో భారీగా కట్టింది. గతేడాది ఏప్రిల్‌లో రూ.1483.70కోట్ల వడ్డీలను కట్టిన సర్కారు, ఈ సారి రూ.1865.15 కోట్లు చెల్లించింది. గతేడాది జీతాల రూపంలో రూ.3237.33కోట్లు ఉద్యోగులకు చెల్లించిన ప్రభుత్వం.. ఈసారి వేత నాలు చెల్లింపు రూ. 3847.17కోట్లకు పెరిగింది. 

l పెన్షన్ల చెల్లింపు గతేడాది రూ.1466.32 కోట్లు ఉంటే, ఈసారి రూ.1331.75కోట్లను ప్రభుత్వం చెల్లించింది. ప్రభుత్వ పథకాల సబ్సిడీ కోసం గతేడాది ఏప్రిల్‌లో రూ.702.82కోట్లు వెచ్చించిన రాష్ట్ర సర్కారు.. ఈసారి రూ.976.97కోట్లను ఖర్చు చేసింది.

l గతేడాది డిసెంబర్‌లో ఏర్పాటైన కాంగ్రెస్ సర్కారు ఈ ఏడాది ఫిబ్రవరిలో పార్లమెంట్ ఎన్నికల ముందు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను రూ. 2,75,891 కోట్లతో అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆ బడ్జెట్ అంచనాలకు అనుగుణంగా రేవంత్ సర్కారు ముందుకుసాగుతోంది. ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో వచ్చే నెలలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానుంది. ఆ తర్వాత ఆ బడ్జెట్‌కు అనుగుణం ఆదాయ, వ్యయాలపై ప్రభుత్వం దృష్టిసారించనుంది.