5 March, 2026 | 10:20 AM

విద్యాలయ నిర్వహణ ఇంతా అధ్వానమా?

05-03-2026 12:57 AM
  1. కేజీబీవీ ఎస్ వోపై కలెక్టర్  ఆగ్రహం

విధుల్లో అలసత్వం వహిస్తే వేటు తప్పదు 

తనిఖీలతో హడలెత్తించిన కలెక్టర్ స్నేహ శబరిష్ 

కేసముద్రం, మార్చి 4 (విజయక్రాంతి): విద్యాలయం నిర్వహణ తీరు ఇదేనా..? విద్యార్థులకు వసతి, సౌకర్యాల కల్పన ఇంత అధ్వాన్నమా.. ఎస్ ఓ గా మీ పనితీరు సరిగా లేదంటూ మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ కేసముద్రం కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయం నిర్వహణ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబాబాద్ కలెక్టర్ గా విధుల్లో చేరిన తర్వాత జిల్లా కలెక్టర్ తొలిసారిగా కేసముద్రం కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేశారు. ప్రతి తరగతి గదిని పరిశీలించడంతోపాటు విద్యార్థులతో బోధన, వసతి, సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు. స్టోర్ రూమ్, వంటగది, తాగునీటి వసతి, ఆవరణను పరిశీలించారు.

రికార్డులను తనిఖీ చేశారు. పాఠశాల నిర్వహణ తీరు పూర్తిగా అధ్వానంగా మారిందని, విద్యార్థులకు భోజన, వసతి సౌకర్యాల కల్పనలో నిర్లక్ష్యం, పాఠశాల నిర్వహణ తీరు అస్తవ్యస్తంగా ఉందని గుర్తించి, స్పెషల్ ఆఫీసర్ సోమలక్ష్మి పనితీరు సరిగా లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పనితీరు మార్చుకోవాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. 

తరచుగా తనిఖీలు చేస్తా

ప్రభుత్వం విద్య ప్రమాణాలను పెంచడానికి, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి ప్రత్యేకంగా కృషి చేస్తుందని, విద్యాలయాల్లో విద్యాబోధన, వసతి సౌకర్యాల కల్పనలో నిర్లక్ష్యం వహిస్తే చూస్తూ ఊరుకోబోమని కలెక్టర్ హెచ్చరించారు. తరచుగా తనిఖీలు చేస్తానని ఆమె వెల్లడించారు. విద్యాధికారి రాజేశ్వర్, తహసిల్దార్ వివేక్ ఉన్నారు.ఇదిలా ఉండగా అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, జెడ్పి సీఈవో పురుషోత్తంతో కలిసి జిల్లా కేంద్రంలోని మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల విద్యాలయం, జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలను తనిఖీ చేశారు.