07-06-2025 01:54:46 AM
కొండపాక, జూన్ 6: ప్రజల సౌకర్యార్థం నిర్మిస్తున్న రింగ్ రోడ్డు పనులు అర్ధాంతరంగా ఆగిపోవడంతో ప్రజలకు కష్టాలను తెచ్చి పెట్టింది. రింగ్ రోడ్డు పనులకు ముహూర్తం ఎప్పుడు కుదురుతుందో, రోడ్డు పొడవున గుంతలు, బురదమయంతో కంకర తేలి దుమ్ము తో ప్రజలు అవస్థలు పడుతున్నారు. సిద్దిపేట జిల్లా చుట్టూ పలు గ్రామాలను కలుపుతూ వేస్తున్న రింగ్ రోడ్డు పనులు కొండపాక మండలం బందారం గ్రామం వద్ద నిలిచిపోయాయి.
రోడ్డు పనుల్లో భాగంగా కంకర పోసి వదిలేయడంతో వాహనదారుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నంగునూరు మండలం పాలమాకుల, వెంకటాపూర్, తిమ్మాయిపల్లి నుంచి బందారం మీదుగా దుద్దెడను కలుపుతూ ఈ రోడ్డు పూర్తి చేయాల్సింది. కానీ నిర్మాణ పనులు బందారం వద్ద నిలిచిపోవడంతో ప్రజలకు కొత్త సమస్యలను తెచ్చిపెట్టింది.
నిలువెత్తు నిర్లక్ష్యం
దుద్దెడ రాజీవ్ రహదారి నుంచి బందారం వెళ్లే రోడ్డు వరకు విద్యుత్ స్తంభాలను తొలగించి రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. అలా చేయకుండా ఒక ప్రక్క మాత్రమే పూర్తి చేశారు. మరోపక్క రోడ్డును అలాగే వదిలేశారు. దుద్దెడ నుంచి బందారం, అంకిరెడ్డిపల్లి వెళ్లే రోడ్డు మధ్యలో ఉన్న బ్రిడ్జిని నిర్మించకుండ వదిలేశారు. వర్షాలు పడక ముందే ఈ రోడ్డును బాగు చేయాలని ఆయా గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
దుమ్ము ధూళితో శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో ఉక్కిరిబిక్కిరి.
బంధారం గ్రామంలో ప్రధాన వీధుల గుండా రోడ్లపై కంకర తేలింది. దాంతో విపరీతమైన దుమ్ము ధూళి వచ్చి ఇండ్లల్లో చేరుతుందని, దాంతో శ్వాస కోశ సంబంధిత వ్యాధులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నమని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుకు ఇరవైపూల మురికి కాలువలు నిర్మించకపోవడంతో మురుగు నీరు రోడ్లపై చేరి దుర్వాసన వెదజల్లుతుందని తెలిపారు. బందారం గ్రామంలో నిర్మాణంలో ఉన్న రోడ్డు పనులు పూర్తి చేయాలని కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చిన ఫలితం లేదని ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి వెంటనే రోడ్డు నిర్మాణ పనులు పూర్తిచేయాలని కోరుతున్నారు.
రోడ్డు త్వరగా నిర్మించండి...
రింగు రోడ్డు నిర్మాణంలో నిర్మాణంపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మా గ్రామం వరకు నిర్మించి గ్రామంలో వదిలేశారు. ప్రయాణాలకు ఇబ్బందులతో పాటు ప్రాణాలకు నష్టం జరుగుతుంది. తేలిన కంకరపై కనీసం నడవలేని పరిస్థితి నెలకొన్నది. జిల్లా కలెక్టర్ స్పందించి రోడ్డు నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి.
బందారం దుర్గయ్య, గ్రామస్తుడు.