18 July, 2026 | 12:23 AM

నిరాహార దీక్ష చేస్తే దేశద్రోహమా!

18-07-2026 12:00 AM

అది 1984వ సంవత్సరం. తమకు షెడ్యూల్ తెగ హోదా కల్పించాలని లద్దాఖ్ ప్రాంత ప్రజలు పెద్దఎత్తున ఉద్యమం చేస్తున్నారు. ప్రజల డిమాండ్ల సాధనే ఏకైక లక్ష్యంగా ఆ ప్రాంతానికి చెం దిన ఉద్యమనేత సోనమ్ వాంగ్యాల్ ఆమరణ నిరాహార దీక్షబూనారు. రోజులు గడు స్తున్న కొద్ది ఆయన ఆరోగ్యం క్షీణించసాగింది. ఆ దీక్ష 16వ రోజుకు చేరింది. పరి స్థితి చేయిదాటుతున్న తరుణంలో నాటి ప్రధాని ఇందిరాగాంధీ స్వయంగా ఢిల్లీ నుంచి లేహ్ ప్రాంతానికి వెళ్లారు.

షెడ్యూల్ హోదా కల్పిస్తామని లద్ధాఖ్ ప్రజలకు హా మీ ఇచ్చి, వాంగ్యాల్‌కు నిమ్మరసం తాగిం చి ఆ దీక్షను విరమింపజేశారు. కానీ, నేడు అదే వాంగ్యాల్ కుమారుడు సోనమ్ వాం గ్‌చుక్ పార్లమెంట్‌కు కూతవేటు దూరంలోని జంతర్ మంతర్‌లో చేస్తున్న దీక్ష శిబి రానికి వెళ్లే ఓపిక ఈ ప్రభుత్వానికి లేదు. దీక్షను విరమింపజేసే తీరికా పాలకులకు లేదు. ‘దేశమంటే మట్టి కాదోయ్, దేశమం టే మసుషులోయ్’ అని అన్నారు మహాకవి గురజాడ అప్పారావు. దేశంలోని మట్టి మనుషులందరినీ కదిలించిన ఈ వాక్యాలు మన ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఆకట్టుకుందేమో! అందుకే ఎర్రకోట వేదికగా ఆయన కూడా ఈ మాటల ను వల్లె వేశారు. దేశం ముందు, ఆ తర్వాతే పార్టీ అన్నది బీజేపీ సిద్ధాంతం. దేశభక్తికి అనధికారిక పేటెంట్ కూడా ఆ పార్టీ దగ్గరే ఉన్నది.

అలాంటి పార్టీ పాలిస్తున్న ప్రభు త్వం నేడు దేశం కోసం, దేశాన్ని నిర్మించే విద్యావ్యవస్థలో సంస్కరణల కోసం, దేశానికి భవిష్యత్తు అయిన యువత భవిత కోసం జరుగుతున్న నిరసన దీక్ష వైపు కనీ సం కన్నెత్తి చూడకపోవడం శోచనీయం. యూపీఏ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలకు వ్యతిరేకంగా ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమాలు, సామాజిక కార్యకర్త అన్నా హజారే చేసిన నిరసన దీక్షల పునాదులపైనే 2014లో నాడు నరేంద్ర మోదీ సర్కార్ నిర్మితమైంది. ఆ కఠిన వాస్తవాన్ని నేడు కేంద్ర పాలకులు విస్మరించడం సరికాదు.

నాడు తమను అందలమెక్కించిన నిరసనలు, నిరాహార దీక్షలు నేడు దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ సాక్షి గా చేస్తున్న ఆర్తనాదాలను పాలకులు ఆలకించడం లేదు. ప్రభుత్వ నిర్లక్ష్య ఫలితంగా జరిగిన పేపర్ లీకుల కారణంగా పాతికమంది విద్యార్థులు బలైపోయినా కళ్లుండి కూడా ధృతరాష్ర్టునిలా చూస్తుండిపోయా రే తప్ప, కనీసం పట్టించుకున్న పాపాన పోవడం లేదు. పైగా తప్పని నిలదీస్తే దేశద్రోహం అంటగడుతున్నారు. అయినా సరిహద్దుల్లో జవాన్లకు సహాయం చేసి తన దేశభక్తిని చాటుకున్న సోనమ్ వాంగ్‌చుక్‌కే దేశద్రోహమనే కీర్తి కీరిటం తప్పలేదు. ఇక మనమెంత! 

అణచివేత అలవాటైన సమాజం 

మరోవైపు మన దేశంలో అడుగడుగు నా సమస్యలతో సహవాసం చేయడం అలవాటైపోయిన ప్రజలు ఈ దీక్ష కూడా ఇసుక రేణువులో ఓ అణువంత అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి మన దేశానికి 1947లోనే స్వరాజ్యం సిద్ధించిం ది. దేశానికైతే స్వాతంత్య్రం వచ్చింది కానీ, ఈ దేశ ప్రజలు మాత్రం ఇంకా బానిసలుగానే బతుకుతున్నారు. భరతమాత దాస్య శృంఖలాలు తెగిపోయి దశాబ్దాలు గడుస్తున్నా ఇంకా గులాంగిరీ మానడం లేదు. కొందరు రాజకీయ పార్టీలకు, మరికొందరు నాయకులకు, ఇంకొందరు మతాలకు, ఎందరో కులాలకు, ఇంకెందరో వర్గాలకు గులాములుగా బతుకుతూ, ఎప్పుడో జీవచ్ఛవాలైపోయారు.

ప్రశ్నించే తత్వాన్ని, ఎదిరించే గుణాన్ని, నిలదీసే నైజాన్ని ఈ దేశ ప్రజలు ఎప్పుడో కోల్పోయారు. ఇక వెన్ను విరిగిన మీడియా, దేశ ప్రముఖుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. పాలకులు, అధి కార యంత్రాంగం దోపిడీకి, రాజకీయ నాయకుల అణచివేతకు అలవాటుపడ్డ స మాజం ఇది. దేశానికి స్వాతంత్య్రం సాధించేందుకు ప్రజల్లో విప్లవాగ్ని రగిలించిన భగత్ సింగ్ ఇప్పుడు దిగొస్తే, ఆయనను కూడా పిరికివాడిలా మార్చగల స్వార్థపూరిత సమాజం ఇది. ఇలాంటి వాళ్ల కోస మా ఒక విద్యావేత్త, ఆవిష్కర్త తన ప్రాణాలను పణంగా పెడుతున్నారు? ఈ సమా జానికి అలాంటి అర్హత లేనే లేదు. 

పోరాటం విఫలమైతే..

దేశ రాజధాని వేదికగా సోనమ్ వాంగ్‌చుక్ చేస్తున్న పోరాటం ఒక వ్యక్తి పోరా టమో, వ్యక్తిగత పోరాటమో కాదు. ఒక వ్యక్తికి, ఒక పార్టీకి, ఒక నాయకుడికి, ఒక వర్గానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరా టం అంతకన్నా కాదు. అది మన కోసం, మన దేశం కోసం, మన భవిష్యత్తు కోసం జరుగుతున్న మహోద్యమం. వాంగ్‌చుక్ చేస్తున్న పోరాటం ఫలించకపోతే ఆయనకు వచ్చిన నష్టమేమీ లేదు.

ఒకవేళ విఫ లమైతే మాత్రం మన దేశానికి, మనతోపాటు మన పిల్లల భవిష్యత్తుకు తీరని న ష్టం జరుగుతుంది. భవిష్యత్తులో మన సమస్యల పరిష్కారం కోసం ఎవరూ గళమెత్తరు, జంతర్ మంతర్‌లో అడుగుపె ట్టరు. ఇప్పటికే మన దేశంలో పర్యావరణ హితం కోసం నిరాహార దీక్ష చేస్తూ 2018లో ఓ సామాజిక కార్యకర్త మరణించిన దాఖలాలు ఉన్నాయి. గంగా నది కా లుష్యం, ప్రకృతి వినాశనానికి పాల్పడటం, పర్యావరణానికి హాని కలిగించడాన్ని నిరసిస్తూ జీడీ అగర్వాల్ అనే పర్యావరణ ప్రేమికుడు చేసిన నిరాహార దీక్ష గురించి ఈ దేశంలోని చాలామందికి తెలియకపోవచ్చు.

రాబోయే తరాలకు మంచి పర్యావ రణాన్ని అందించాలనే నిస్వార్థపూరిత లక్ష్యంతో 111 రోజులపాటు అన్నపానీయా లు మానేసిన ఆయన చివరికి దీక్షలోనే కన్నుమూయడం బాధాకరం. జీడీ అగర్వాల్ దీక్ష సమయంలో పట్టించుకోని ప్రభుత్వం ఇప్పుడు సోనమ్ వాంగ్‌చుక్ విషయంలోనూ అంతకంటే దారుణంగా వ్యవహరిస్తున్నది. విషాదం చోటుచేసుకోకముందే ప్రజలు మేల్కొవాలి. వాంగ్‌చుక్ దీక్షకు మద్దతుగా గళం వినిపించాలి. ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా పోరా డుతూ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. 

రాజీనామా సరిపోతుందా?

జవాబుదారీతనం లేని, పారదర్శకత లోపించి ఈ వ్యవస్థ కుంగిపోయి, కుళ్లిపోయి, కృశించిపోయింది. అలాంటి వ్యవ స్థలో అవినీతి, అక్రమాల్లో కురుకుపోయిన విద్యాశాఖ మంత్రి రాజీనామా చేస్తే ఎంత, చేయకపోతే ఎంత? ఒక్క వ్యక్తి రాజీనామాతోనే ఈ వ్యవస్థ మొత్తం మారిపోతుందా? అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. కానీ, 2021, 2024, 2026లో మూడు పర్యాయాలు నీట్ ప్రశ్నాపత్రం లీకైన విషయం మాత్రం వారికి కనిపించడం లేదు. పేపర్ లీక్ కారణంగానే 2024లో యూజీసీ నెట్ రద్దు, ఇటీవల సీబీఎస్‌ఈలో వెలుగులోకి వచ్చిన అవకతవకలను విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇంకా మర్చిపోలేదు. ఇలా వరుసగా అవకతవకలు జరుగుతున్నప్పుడు ఆ శాఖ మంత్రిగా కొనసాగే అర్హత ధర్మేంద్ర ప్రధాన్‌కు ఉన్నదా? అన్నది బీజేపీ పాలకులు ప్రశ్నించుకోవాలి.

శిశుపాలుని నూరు తప్పులలాగా వంద తప్పు లు చేసే వరకు చూస్తూ ఉంటారా? ఒక మంత్రి పదవిని భర్తీచేసే సమర్థవంతుడైన వ్యక్తి బీజేపీలో, మన దేశంలో లేరా? అయినా ఒక వ్యక్తి రాజీనామాతో అంతా మారిపోతుందని ఆశించడమూ అత్యాశే అవుతుంది. ఆయన స్థానంలోకి వచ్చే మరో కొత్త వ్యక్తి కూడా అదే వ్యవస్థ నుంచి వస్తారని, మరో వ్యక్తి ఆశీసులైనా మార్పు రాదని మన కంటే వాళ్లకే బాగా తెలుసు. అందుకే కాబోలు ఈ విషయంపై బీజేపీ హైకమాండ్ నాన్చివేత ధోరణి అవలంబిస్తున్నది. కాకపోతే, ఈ రాజీనామాతో అ యినా జవాబుదారీతనం వస్తుందని, పా రదర్శకత పెరుగుతుందని ఒక చిన్న ఆశ.

వ్యాసకర్త సెల్: 9885679876

మాలోతు సురేష్