18 July, 2026 | 12:24 AM

అన్నభావు సాఠే కలగన్న సమానత్వమేది?

18-07-2026 12:00 AM

నేడు సాఠే వర్ధంతి :

‘భూమి శేషనాగు తలపై కాదు... శ్రమజీవుల అరచేతులపై నిలబడి ఉంది.‘అన్నభావు సాఠే. భారతదేశంలో తన కలంతో సామాజిక సమానత్వం కోసం సాహిత్య సేద్యం చేసిన మహనీయుల్లో అన్నభావు సాఠే పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. మహారాష్ట్రకు చెందిన మాంగ్ (ఎస్సీ) సామాజికవర్గంలో 1920 ఆగస్టు 1న జన్మించారు. ఆయన అసలు పేరు తుకారాం భౌరావ్ సాఠే, తన జీవితాన్ని శ్రమజీవుల, దళితుల, బహుజనుల హక్కుల కోసం అంకితం చేశారు.

పేదరికం, కుల వివక్ష చిన్నప్పటి నుంచే ఎదురయ్యాయి. పాఠశాల విద్య ఎక్కువగా అందకపోయినా, జీవితాన్నే విశ్వవిద్యాలయంగా మలుచుకొని గొప్ప రచయితగా, కవిగా, జాన పద కళాకారుడిగా, సినిమా స్క్రిప్టు రైటర్ గా, సామాజిక చైతన్యవేత్తగా, అంబేద్కర్ వాదిగా, ఎదిగారు. 35కు పైగా నవలలు, వందలాది కథలు, జానపద గీతాలు, నాటకాల ద్వారా అణగారిన వర్గాల జీవితాలను ప్రపంచానికి పరిచయం చేశారు. ఆయన రచించిన ‘ఫకీరా‘ నవల మరాఠీ సాహిత్యంలో ఒక మైలురాయిగా నిలిచింది.

ఇలా తన రచనల ద్వారా కోట్లాది మంది పీడిత ప్రజల గొంతుకగా నిలిచారు. ఆయన కథలు, నవలలు అనేక విదేశీ భాషల్లోకి అనువాదమయ్యాయి. సమాజంలో దళితులు  కష్టాలను ఆయన రచనల్లో అద్భుతంగా చూపించారు. ఆయన పాటలు, నాటకా ల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపారు. అన్నభావు సాఠే మహారాష్ట్ర సంప్రదాయ జానపద కళారూపమైన ‘తమాషా‘ పేరుతో సామాజిక చైతన్యం, శ్రామికుల హక్కులు, కులవివక్ష వ్యతిరేక విధానాలపై అనేక ప్రదర్శనలు ఇచ్చాడు.

’సంయుక్త మహారాష్ట్ర ఉద్యమం’లో కీలక పాత్ర పోషించాడు. ఆయన 1969 జూలై 18  మరణించాడు. అక్షర జ్ఞానికి దూరమైన కులం లో పుట్టి బడుగు బలహీన వర్గాల విముక్తి కోసం అక్షర సేద్యం చేసిన గొప్ప వ్యక్తి అన్నభావు సాఠే. ఆయనను రష్యా ఇండియన్ మాక్స్ మ్ గోర్కీ గా పిలిచింది. రష్యన్ యూనివర్సిటీలో పాఠాలుగా సాఠే రచనలున్నాయి. దేశ విదేశీయులతో ‘అన్నా’ అని పిలుపునందుకున్న మొదటి భారతీయు డు అన్నాభావు సాఠె.

ఇంత గొప్ప మహనీయుని చరిత్ర పట్ల అగ్రవర్ణ ప్రభుత్వాలు, చరిత్రకారులు వివక్ష చూపారు. మరుగున పడిన మహనీయుడుగా మిగిలాడు. దళిత సాహిత్య పితామహుడిగా, సాహిత్య సమ్రా ట్గా ప్రసిద్ధి చెందిన అన్నాకు ‘భారతరత్న’ ఇవ్వాలి. అన్నభావు సాఠే ఆలోచనలపై జ్యోతిరావు పూలే సామాజిక విప్లవ భావజాలం, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సామాజిక న్యాయ సిద్ధాంతం ప్రధానంగా కనిపిస్తుంది. అంబేద్కర్ భావజాలానికి ప్రభావితమై దళిత, బహుజనులను చైతన్య పరిచే రచనలు చేశారు.

‘ఫకీరా’ నవలను బాబాసాహెబ్కు అంకితం చేశారు. నేడు భారతదేశంలో మెజారిటీ ప్రజలు బీసీ, ఎస్సీ, ఎస్టీలు అయినప్పటికీ రాజకీయ, ఆర్థిక, విద్యా, పరిపాలనా రంగాల్లో వారికి జనాభా నిష్పత్తిలో ప్రాతినిధ్యం లేదు. ఈ అసమానతలను చాలా కాలం క్రితమే అన్నభావు సాఠే తన రచనల్లో ప్రశ్నించారు. ఆయన సాహిత్యం సామాజిక అసమానత, కుల వివక్ష, శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా సాగిన ఉద్యమం.

ఈ క్రమం లో అన్నభావు సాఠే కేవలం రచయితగా కాకుండా, సామాజిక మార్పు కోసం కలం పట్టిన ఉద్యమకారుడిగా గుర్తుంచుకోవాలి. ఆయన చూపిన మార్గం ఆత్మవిశ్వాసాన్ని, హక్కుల సా ధనకు దిశానిర్దేశాన్ని అందిస్తుంది. అందుకే అన్నభావు సాఠే ఆలోచనలు నేటికీ స్ఫూర్తిదాయకం. సాఠే కలం రగిలించిన చైతన్యం, ఫూలే వెలిగించిన విద్యా జ్యోతి, బీఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగ దిక్సూచితోనే సమానత్వ భారతం నిర్మితమవుతుంది. ఇదే అన్నభావు సాఠేకు నిజమైన నివాళి.

సంపతి రమేష్

7989579428