లెబనాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడి
18-08-2024 01:34 AM
న్యూ ఢిల్లీ, ఆగస్టు 17: పాలస్తీనా హమాస్ మిలిటెంట్లు, ఇజ్రాయెల్ దళాల గాజా స్ట్రిప్‌లో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్ మద్దతు గల హెజ్బొల్లా, ఇజ్రాయెల్ దళాలు తమ సరిహద్దులో ప్రతీరోజు కాల్పులు, దాడులకు తెగబడుతున్నాయి. తాజాగా శనివారం ఇజ్రా యెల్ దళాలు దక్షిణ లెబనాన్‌లోని నబాతిహ్ ప్రాంతంలో జరిపిన వైమానిక దాడిలో దాదాపు 9మంది మరణించినట్లు లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా దాడిలో ఒక మహిళ, ఆమె ఇద్దరు పిల్లలు, ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. హెజ్బొల్లా ఆయుధ స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నట్లు సమాచారం. ఇజ్రాయెల్ హమాస్ మధ్య శాంతి చర్చలు జరుగుతున్న సమయంలో ఇలాంటి దాడులు చెడు సంకేతాలను ఇస్తున్నాయని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.




