12 April, 2026 | 9:17 PM

ప్రాణాలు తీసిన రీల్స్ సరదా

18-08-2024 01:35 AM

నాగ్‌పూర్(మహారాష్ట్ర), ఆగస్టు 17: రీల్స్ తీసి ఫేమస్ అయిపోవాలనే సరదా లేక ఇతరుల కంటే డిఫరెంట్‌గా చేద్దామనే అత్యుత్సాహంతో ఓ యువకుడు చేసిన స్టంట్ కాస్తా అతడి ప్రాణాలను బలిగొంది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లోని కాలామ్న ప్రాంతానికి చెందిన ఆకాశ్ చకోలే(23) ఆగస్టు 15న స్నేహితులతో కలిసి మకర్‌ఢోక్డా డ్యామ్‌కు వెళ్లాడు. ఇటీవల కురుస్తున్న వరుస వర్షాలతో ఈ డ్యామ్ నిండి అలుగుపారుతోంది. ఈ క్రమంలో తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఆకాశ్ ఓ ప్రమాదకర స్టంట్ చేయాలనుకున్నాడు. అనుకున్నదే తడువుగా.. ముగ్గురూ కలిసి అలుగు పారుతున్న డ్యామ్ గోడను ఎక్కేందుకు యత్నించగా.. ఆకాశ్ ఒక్కడే గోడపైకి చేరుకోగలిగాడు.  మిగితా ఇద్దరూ అతడిని కిందికి దించేందుకు యత్నించగా బ్యాలెన్స్ కోల్పోయిన ఆకాశ్ కాలుజారి డ్యాంలో నీరు నిండుగా ఉండే వెనుక భాగంలో పడిపోయాడు. రెస్క్యూ టీం దాదాపు నాలుగు గంటలకు పైగా గాలించి అతడి మృతదేహాన్ని వెలికితీశారు. ఈ స్టంట్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రీల్స్ పిచ్చి లేదా గొప్పలకు పోయి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.