16 April, 2026 | 2:01 AM

రేషన్ డీలర్ల.. కార్డుల లీలలు

16-04-2026 12:24 AM
  1. రూ.5 వేలకే.. రేషన్ కార్డు..
  2. ప్రభుత్వ ఉద్యోగులకు సైతం కోపిన్ కార్డులు..
  3. భూస్వాములకు సైతం రేషన్ కార్డులు..
  4. అడ్డదారిలో రేషన్ కార్డుల మంజూరు.. రెవిన్యూ అధికారుల వత్తాసు..
  5. తాజాగా బాన్సువాడ మండలo తాడ్కోల్ రేషన్ డీలర్ వసూలు..
  6. పదుల సంఖ్యలో రేషన్ కార్డుల మంజూరు..
  7. ఉన్నతాధికారులు పరిశీలిస్తే లక్షల్లో కార్డులు బహిర్గతం..
  8. నిబంధనలు భేఖాతార్..
  9. రేషన్ డీలర్ ను తప్పించేందుకు కొంతమంది అధికారుల యత్నం..
  10. అక్రమ రేషన్ కార్డుల జారీపై భాజపా నేతలు సబ్ కలెక్టర్‌కు ఫిర్యాదు..
  11. రేషన్ డీలర్ పై చర్యలు తీసుకునేనా..?

బాన్సువాడ,ఏప్రిల్ 15 (విజయక్రాంతి): పేద బడుగు బలహీన వర్గాల కుటుంబాలకు అందాల్సిన  ప్రభుత్వ రేషన్ కార్డులు పక్కదారి పడుతున్నాయి. పైకం అందిస్తే చాలు.. చేతికి కోపిన్ కార్డు వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఇటు రేషన్ డీలర్లు సైతం కొత్త కోటింగ్ కార్డును ఇచ్చేందుకు కాసులు దండుకుంటున్నారు అన్న విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న కుటుంబాల వారు సైతం రేషన్ కార్డును పొంది అనుభవిస్తున్నారు. అనర్హులు  సైతం కోపిన్  కార్డు ద్వారా లబ్ధిని పొందుతున్నారు.

ప్రభుత్వ ఉద్యోగులు, కార్పొరేషన్ల ఉద్యోగులు, భూస్వాములు, బడా వ్యాపారులు, కోటీశ్వరుల చేతుల్లో ఓపెన్ కార్డులు చిక్కుకున్నాయి. వాటి ధార బిపిఎల్ కింద వచ్చే రేషన్ సరుకులతో పాటు ఇతరాత్ర పథకాలకు సైతం దరఖాస్తు చేసుకుంటూ ప్రయోజనం పొందుతున్నారు. ప్రభుత్వం మాత్రం పాత రేషన్ కార్డుల విధానాన్ని పక్కనపెట్టి కొత్త రేషన్ కార్డుల జారీకి శ్రీకారం చుట్టింది. 14 జులై 2025 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీకి సన్నద్ధం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల నుండి 2.85 లక్షల కార్డులను అర్హులైన నిరుపేదలకు అందించే విధంగా చర్యలు తీసుకుంది.

ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను జారీ చేయడం ప్రశంసనీయమే అయినప్పటికీ, కార్డుల జారీలో జరుగుతున్న అవకతవకలు, అక్రమాలపై దృష్టి సారించకపోవడం విడ్డూరకరంగా ఉంది. అడ్డగోలుగా అనర్హులు దొడ్డి దారిన కార్డులను చేజిక్కించుకునే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. అక్రమ రేషన్ కార్డుల జారిపై రెవిన్యూ శాఖ చర్యలు శూన్యమయ్యాయి. అధికారులు ఆ దిశగా దృష్టి పెట్టడం లేదు. దాంతో మధ్య దళారుల ప్రమేయం జరుగుతుంది. ప్రస్తుతం ప్రభుత్వం తాజాగా రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారుల కుటుంబాలకు ఐదు లక్షల ఇన్సూరెన్స్ వసతిని కల్పించడం అక్రమార్కులకు మరింత అవకాశం ఏర్పడుతోంది.

ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి 50 వేల నుండి లక్ష రూపాయలు నెలకు వేతనాన్ని పొందుతున్న వారు సైతం దర్జాగా ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యాన్ని స్వీకరిస్తున్నారు. ధనవంతులు, భూస్వాములు సైతం ఏం చక్క సంఘ బియ్యంతో పాటు రేషన్ సరుకులను పొందుతున్నారు. విదేశాలలో ఉన్న వారి పేరిట సైతం కార్డుల సరుకులు ప్రతినెల సప్లై అవుతూనే ఉన్నాయి. ఎక్కడో ఉండి ఓటిపి చెబితే చాలు డీలర్లు రేషన్ సరుకులను అందజేస్తున్నారు. వాస్తవానికి రేషన్ కార్డు ఉండాలంటే గ్రామీణ ప్రాంత వాసులకు  ఏడాదికి 1,50,000 వార్షిక ఆదాయం కలిగి ఉండాలి. అదే పట్టణవాసులైతే రెండు లక్షల వరకు వార్షిక ఆదాయం కలిగి ఉండాలి.

బిపిఎల్ కింద గుర్తింపబడ్డ వారు మాత్రమే ఫుడ్ సెక్యూరిటీ కార్డులు పొందే అవకాశం ఉంటుంది. నిబంధనలు బాగానే ఉన్నా.. అమలులో మాత్రం పారదర్శకత లోపించింది. ఏప్రిల్ మాసంలో ప్రతి కార్డుదారుకు మూడు నెలల సన్నబియాన్ని పంపిణీ చేశారు. అసలైన నిరుపేదకు 20 నుండి 25 కిలోల బియ్యం డీలర్ ద్వారా అందగా, అనర్హులైన  కార్డుదారులకు మాత్రం క్వింటాల్కు పైబడి బియ్యం సప్లై అయ్యాయి.

ఈ విషయంలో డీలర్లు సైతం అక్కడక్కడ తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. రెవిన్యూ అధికారులైతే... మాకెందుకులే అని వెనుకంజ వేస్తున్నారు. కొత్తగా ప్రభుత్వం జారీ చేస్తున్న రేషన్ కార్డులలో జరుగుతున్న అక్రమాలపై సర్కారు స్పందించాల్సిన అవసరం ఉంది. రెవిన్యూ శాఖ మంత్రి నికార్స్ గా నిబంధనలు అమలు చేసి తీరాల్సిందేనని జిల్లా కలెక్టర్లకు ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ, ఎక్కడ కూడా అలాంటి చర్యలు కనిపించడం లేదు. ఇకపోతే పాత రేషన్ కార్డుల సంఖ్య విషయంలో చాలా అక్రమాలు చోటు చేసుకున్నాయి. చాలా మటుకు బోగస్ కార్డులే లబ్ధిని పొందుతున్నాయి.

ఈ విషయంలో కూడా పాలకులు దృష్టి పెట్టె పరిస్థితి ఉంది. కార్డుల అక్రమజారిలో జరుగుతున్న తతంగంపై బిజెపి, బీఆర్‌ఎస్ నేతలు గుర్రంటున్నారు. అక్రమ కార్డుల జారిని అడ్డుకోవాలంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. గత కొన్ని రోజుల క్రితం బాన్సువాడ మండలంలోని తాడ్కోల్ గ్రామంలోని రేషన్ డీలర్ రేషన్ కార్డులు ఇప్పిస్తామని చెప్పి పేద ప్రజల నుండి ఒక్కొక్కరి వద్ద 5 వేల రూపాయల వరకు  వసూలు చేశారని  సబ్ కలెక్టర్ కిరణ్మయికి గ్రామస్తులతో  పాటు బిజెపి నాయకులు ఫిర్యాదు చేశారు.  వారు మాట్లాడుతూ, గ్రామంలోని రేషన్ షాప్ డీలర్ రేషన్ కార్డుల కొరకు ఐదువేల రూపాయలు వసూలు చేశారని సంబంధిత రెవిన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపడితే తాము నిజాలు బయటపెడతామన్నారు.

ఆ రేషన్ డీలర్ పై కఠిన చర్యలు తీసుకొని ఆ డీలర్ షిప్ ను రద్దు చేయాలని డబ్బులు ఇచ్చిన వారి డబ్బులు తిరిగి ఇప్పించాలని   డిమాండ్ చేశారు.  బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి స్పందిస్తూ, వెంటనే విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ రేషన్ డీలర్ పై జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆదేశానుసారం షోకస్ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే గ్రామంలో విచారణ ప్రారంభించారు త్వరలోనే సబ్ కలెక్టర్ కిరణ్మయికి నివేదిక అందజేస్తామని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పేర్కొన్నారు.