విద్యా రంగ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి
బీసీ జేఏసీ
సూర్యాపేట, జూలై 14 (విజయక్రాంతి): ప్రభుత్వ విద్యా రంగంలో ఉన్న పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించి, పేద, వెనుకబడిన తరగతుల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని బీసీ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో మంగళవారం జరిగిన సంఘ ముఖ్య సమావేశంలో బీసీ జేఏసీ జిల్లా కన్వీనర్ భద్రబోయిన సైదులు, జిల్లా ఉపాధ్యక్షుడు బైరోజు మదనచారి పాల్గొని మాట్లాడారు.
నేటి విద్యా రంగంలో పేద విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. వెనుకబడిన తరగతుల విద్యార్థులకు రావాల్సిన పెండింగ్ ఫీజు రీఅంబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలన్నారు.అలాగే ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల బలోపేతం చేయాలన్నారు.
అదేవిధంగా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలల్లో ఇష్టారాజ్యంగా పెంచుతున్న ఫీజులను నియంత్రించడానికి ప్రభుత్వం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు. అలాగే పాఠశాలలు, హాస్టల్లో విద్యార్థులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. రాబోయే రోజుల్లో విద్యార్థుల హక్కుల సాధన కోసం, విద్యా రంగ పరిరక్షణ కోసం బీసీ జేఏసీ ఆధ్వర్యంలో పోరాటాలను మరింత ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీసీ జేఏసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






