15 July, 2026 | 12:40 AM

ఎస్‌ఎఫ్‌ఐ నాయకుల ముందస్తు అరెస్ట్

15-07-2026 12:00 AM

చౌటుప్పల్, జూలై1౪ :రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘చలో సచివాలయం‘ కార్యక్రమానికి బయలుదేరిన ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడాన్ని ఎస్‌ఎఫ్‌ఐ చౌటుప్పల్ మండల కమిటీ తీవ్రంగా ఖండించింది.ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ చౌటుప్పల్ మండల అధ్యక్షుడు దాసరి ప్రకాష్, మండల కార్యదర్శి తిగుళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు.

ఫీజు బకాయిలు చెల్లించలేదనే కారణంతో కొన్ని విద్యాసంస్థలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఒత్తిడి చేయడం వల్ల ఉన్నత చదువులకు వెళ్లలేక విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడుతోందన్నారు.‘ఎమ్మెల్యేల జీతాలకు కరువు లేదు పేద విద్యార్థుల స్కాలర్షిప్లకే కరువు వచ్చింది. ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకునే ప్రజాపాలన?‘ అని వారు ప్రశ్నించారు.

విద్యార్థుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న చలో సచివాలయం కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని అన్నారు. అరెస్టులతో విద్యార్థి ఉద్యమాలను అణచివేయలేరని, విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎస్‌ఎఫ్‌ఐ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను తక్షణమే విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.