28 August, 2026 | 2:08 PM

Breaking News

జర్నలిస్టులకు రాఖీ కట్టి.. హెల్మెట్లు అందించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్   •   రక్షాబంధన్‌ పండుగ.. మన బంధాలకు ప్రతీక: ఎమ్మెల్యే పాయల్‌ శంకర్   •   బసవరాజు శ్రీనివాస్ పై నీలాప నిందలు మానేయండి   •   సీఐ అత్యుత్సాహం.. ఆందోళనకారులపై దాడి   •   శిశుమందిర్ విద్యార్థుల సౌభ్రాతృత్వ సందేశం   •   ముత్తారం మాజీ జడ్పీటీసీని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు   •   కిక్కిరిసిన బస్సులు.. కిటకిటలాడుతున్న బస్టాండ్లు   •   మాజీ మంత్రి కోట్నాక భీంరావు వర్ధంతిని విజయవంతం చేయాలి   •   జర్నలిస్టులకు రాఖీ కట్టిన ఎస్సై గుగులోత్ శ్రీదేవి   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మహాధర్నా   •  

పేరుకే ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం

19-06-2026 10:11 AM

- బొబ్బిలి పవన్ కళ్యాణ్

గుండాల, (విజయక్రాంతి): తల్లీబిడ్డ మృతితో గుండాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డొల్లతనం మరోసారి బయటపడిందని, ​వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించడం లేదని మండల యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ మరియు సోషల్ మీడియా కోఆర్డినేటర్ బొబ్బిలి పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ​బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, తక్షణమే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అధికారుల, సిబ్బంది నిర్లక్ష్యానికి పరాకాష్టగా మారిందని, ఇక్కడి డొల్లతనం కారణంగానే ఒక నిండు గర్భిణీ, ఆమె కడుపులోని బిడ్డ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వ ఆసుపత్రిని నమ్ముకుని వచ్చిన పేద ప్రజల ప్రాణాలతో ఇక్కడి సిబ్బంది ఆటలాడుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గుండాల పీహెచ్సీలో కనీస సమయపాలన కరువైందని ధ్వజమెత్తారు.

అత్యవసర సమయంలో వైద్యులు, సిబ్బంది అందుబాటులో లేకపోవడం వల్లే ఈ ఘోరం జరిగిందని, ఇది ముమ్మాటికీ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది చేసిన హత్యేనని ఆయన ఆరోపించారు. సమయపాలన పాటించకుండా, విధులకు గైర్హాజరై తల్లి, బిడ్డ మృతికి కారణమైన సదరు వైద్యులు, నిర్లక్ష్యపు సిబ్బందిపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, ​ఉద్యోగాల నుండి సస్పెండ్ చేయాలని, తూతూమంత్రంగా విచారణలు కాకుండా, బాధ్యులైన వారిని వెంటనే విధుల్లోంచి సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మృతి చెందిన తల్లి, బిడ్డ కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే భారీ ఎక్స్‌గ్రేషియా ప్రకటించి ఆదుకోవాలని, ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్యం కోసం, గర్భిణీల రక్షణ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది.

కానీ గుండాల పీహెచ్సీ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఆ ఆశయాలన్నీ బూడిదలో పోసిన పన్నీరవుతున్నాయని అన్నారు. బయోమెట్రిక్ హాజరు ఉన్నా వైద్యులు ఎప్పుడు వస్తున్నారో, ఎప్పుడు పోతున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇటువంటి డొల్లతనం వల్లే పేదలు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోందని అన్నారు. జిల్లా ఆరోగ్య శాఖాధికారులు (DM&HO) మరియు ఉన్నతాధికారులు వెంటనే స్పందించి గుండాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకపోతే, బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆసుపత్రి ఎదుట పెద్ద ఎత్తున ధర్నాలు, ఆందోళనలు చేపడతామని బొబ్బిలి పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.