దమ్ముంటే కేసీఆర్ ను టచ్ చేసి చూడు..!
కూలేది బీఆర్ఎస్ పార్టీ దిమ్మెలు కాదు.. కాంగ్రెస్ కుర్చీలే:
మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి.
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( CM Revanth Reddy) బీఆర్ఎస్ పార్టీని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకుని చేస్తున్న వ్యాఖ్యలపై నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి(Former MLA Marri Janardhan Reddy ) తీవ్ర స్థాయిలో స్పందించారు. దమ్ముంటే కేసీఆర్ ను టచ్ చేసి చూపించాలని సవాల్ విసిరారు. గురువారం స్థానికంగా బిఆర్ఎస్ పార్టీ నేతలతో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో కలిసి పాల్గొని ఆయన మాట్లాడుతూ, గ్రామాల్లో కూలిపోయేది బీఆర్ఎస్ పార్టీ దిమ్మెలు కాదని, కాంగ్రెస్ పార్టీ కుర్చీలేనని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం దృష్టి పెట్టకుండా ప్రతిరోజూ కేసీఆర్ ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ఫోన్ టాపింగ్ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి కి నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో మర్రి జనార్దన్ రెడ్డి ఈ విధంగా స్పందించారు.
రైతులకు రైతుబంధు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, మహిళలకు హామీ ఇచ్చిన పథకాల అమలుపై శ్రద్ద చూపాలన్నారు. ప్రజల సమస్యలను పక్కనబెట్టి రాజకీయ విమర్శలతో కాలం గడుపుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ బలం, కేసీఆర్ నాయకత్వం గురించి తక్కువ అంచనా వేయొద్దని బిఆర్ఎస్ పార్టీ సత్తా ఏమిటో తరచూ రాత్రి పూట ఫేస్ లైన్ లో మాట్లాడుతున్న తన గురువు చంద్రబాబును, లేదా సోనియా గాంధీని అడిగి తెలుసుకోవాలన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని, తెలంగాణ ప్రజలు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని మర్రి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమంపై దృష్టి సారించాలని, రాజకీయ కక్షసాధింపు చర్యలను విరమించుకోవాలన్నారు.






